అమెరికా కలకు బలైపోయిన భారతీయ కుటుంబం.. వెలుగులోకొచ్చిన షాకింగ్ వాస్తవాలు

ABN , First Publish Date - 2022-01-25T02:20:40+05:30 IST

ఏ దేశంలోకైనా అక్రమంగా ప్రవేశిస్తే... ఘోర అవమానాలు తప్పవు.. అక్కడి అధికారులకు చిక్కి చివరికి సొంత దేశం బాటపట్టకతప్పదు. కానీ.. గుజరాతీల్లో అనేక మంది ఇటువంటి కష్టాలకు ఎదురొడ్డి తమ ‘అమెరికా కల’ను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో..

అమెరికా కలకు బలైపోయిన భారతీయ కుటుంబం.. వెలుగులోకొచ్చిన షాకింగ్ వాస్తవాలు
భార్యా పిల్లలతో జగదీశ్ పటేల్

ఏ దేశంలోకైనా అక్రమంగా ప్రవేశిస్తే... ఘోర అవమానాలు తప్పవు.. అక్కడి అధికారులకు చిక్కి చివరికి సొంత దేశం బాటపట్టకతప్పదు.  కానీ.. గుజరాతీల్లో అనేక మంది ఇటువంటి కష్టాలకు ఎదురొడ్డి తమ ‘అమెరికా కల’ను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే జగదీశ్ పటేల్, అతడి భార్యాపిల్లలు అత్యంత హృదయవిదారక రీతిలో మట్టిలో కలిసిపోయారు. కెనడా సరిహద్దు వద్ద అర్థరాత్రి మంచు తుఫానులో చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశించే క్రమంలో ఈ దారుణం జరిగింది. మరుసటి రోజు వారి మృతదేహాలను అధికారులు గుర్తించారు. 


గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న డింగుచా అనే కుగ్రామం నుంచి ఈ కుటుంబం తన ప్రయాణం ప్రారంభించింది. ఆ గ్రామం మొత్తం జనాభా దాదాపు 3 వేలు. ‘‘మా గ్రామం నుంచి దాదాపు 1800 మంది అమెరికాకు వెళ్లారు’’.. ఏ గ్రామస్థుడిని కదిలించినా వచ్చే మాట ఇది! అయితే.. వాళ్ల ముఖంలో కాస్తంత గర్వంతో పాటూ నిర్లిప్తత ఛాయలు కనిపిస్తుంటాయి. డబ్భైల నుంచే  డింగుచా నుంచి వలసలు మొదలయ్యాయని కొందరు వృద్ధులు తెలిపారు. అమెరికాకు వెళ్లేందుకు జగదీశ్ ఓ దళారికి ఏకంగా 65 లక్షలు ముట్టచెప్పాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికీ పరారీలో ఉన్న ఆ ఏజంట్‌ను ఎలాగైనా పట్టుకుంటామని వారు శపథం చేశారు.



ఈ ఘటన విచారకరమని గ్రామస్థులు అంగీకరించినా.. వారి కళ్లల్లో మాత్రం అమెరికా కల, అశలు మెరుస్తూనే ఉంటాయి. అసలు డింగుచా నుంచి ఎంత మంది వెళ్లారో తెలుసుకునేందుకు పలు సంస్థలు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడి నుంచి, అమెరికా, బ్రిటన్, కెనడా, మెక్సికో వంటి దేశాలకు అనేక మంది తరలిపోయారు. కానీ.. వారి పూర్తి వివరాలపై ఎటువంటి స్పష్టత లేదు.  వీరి కథ విన్నవారెవరికైనా మనసులో మొదట తలెత్తే ప్రశ్న.. అసలు అమెరికా కల అంటే ఏమిటి..? అని. రాత్రుళ్లు గడ్డకట్టుకుపోయే చలిలో మృత్యువుతో పోరాడటమా..? అక్కడి భారతీయులు నడిపే షాపుల్లో అధికారిక వేతనం కంటే సగం జీతానికే పనిచేయడమా..? లేదా తన బంధువులకు మంచి ఫొటోలు పంపించేందుకు తమకు సంబంధం లేని భవనాల వద్ద ఫొటోలకు ఫోజులివ్వడమా.. ? కనీసం పాస్‌పోర్టకైనా దరఖాస్తు చేసుకోకమునుపే అనేక మంది ‘అమెరికా జెండా’ మాయలో పడిపోతారంటే అతిశయోక్తి కాదు. సమాజంలో గౌరవప్రధస్థానంలో ఉండే ఎంబీఏ విద్యాధికుడు కూడా ఇటువంటి జర్నీ ప్రారంభించేందుకు అసలేమాత్రం సంకోచించడు. 


కెనడాలో మృతి చెందిన బాధిత కుటుంబానిది వాస్తవానికి ఉన్నత నేపథ్యమే. కుటుంబ పెద్ద జగదీశ్ పటేల్ ఓ టీచర్. ఊరిలో తనకు గౌరవమర్యాదలు, తినడానికి తిండి ఉన్నాయి. కానీ..తన భార్య వైశాలి(33), కూతురు విహాంగి(13), కుమారుడు ధార్మిక(3)ను తీసుకుని అతడు అమెరికాకు బయలు దేరాడు. పేపర్‌లో ఓ ప్రకటన ద్వారా జగదీశ్ .. ఓ ఏజంట్‌ను సంప్రదించి వీసా లేకుండానే ప్రమాదభరితమైన ప్రయాణం మొదలెట్టాడు. ఆ ఏజంట్ ఆధ్వర్యంలోనే ఇలాంటి మరికొందరు ఓ బృందంగా ఏర్పడి కెనడాకు బయలుదేరారు. ఆ తరువాత.. సరిహద్దు దాటి అమెరికా చేరుకోవాలనేది వారి ప్లాన్. ఈ ప్రమాదకర ప్రయాణం కోసం జగదీశ్ కుటుంబం గత పదేళ్లుగా డబ్బులు కూడబెట్టింది. అమెరికాలోని నార్త్ డకోటా రాష్ట్రానికి చేరుకుని అక్కడి నుంచి తమ కల సాకారం చేసుకోవాలనేది వారి లక్ష్యం. ఆ గ్రామంలో నివసిస్తున్న జగదీశ్ బంధువుల్లో దాదాపు సగం మంది అమెరికాలోనే ఉన్నారని డింగుచా గ్రామస్థుడొకరు మీడియాకు తెలిపారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒక్కరైనా అమెరికాలో స్థిరపడకపోతే తమ కుటుంబం మొత్తానికీ అవమానమని పటేల్ వర్గం వారు భావిస్తారని కూడా వ్యాఖ్యానించాడు. పటేల్ సామాజిక వర్గం దృష్టిలో అమెరికా కల అంటే..  సమాజంలో ఓ హోదా.. గౌరవానికి ప్రతీక. భారత్‌లో ఆస్తిపాస్తులున్నప్పటికీ వారు సంతృప్తి చెందలేరని, అమెరికా కల సాకారం కోసం ఎంతటి మూల్యాన్నైనా చెల్లించేందుకు వెనకాడరని అక్కడి వారు చెబుతుంటారు.


గుజరాత్ నుంచి గతంలోనూ అనేక మంది ఇలా అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. గతేడాది.. మెహసానా జిల్లాకు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు ఇలాగే అమెరికాకు చేరుకుని చివరికి అక్కడి అధికారులకు చిక్కాడు. అంతకుమునుపు.. అతడు మెక్సికోకు చెందిన ఓ ఏజెంట్‌కు ఏకంగా 30 లక్షలు చెల్లించాడు. కొన్నేళ్ల క్రితం ఇదే తరహాలో ఉత్తరభారత దేశానికి చెందిన మరో మహిళ తన కూతురితో సహా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించింది. చివరికి అరిజోనా ఎడారిలో చిక్కుకుపోయి ఆ తల్లీ కూతుళ్లు మరణించారు. ఇటువంటి వ్యవహారాల్లో ఓ పార్లమెంట్ సభ్యుడి ప్రమేయం ఉందన్న విషయంలో 2007లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో బీజేపీ ఎంపీగా ఉన్న బాబూభాయ్ కటారా.. తన భార్య దౌత్యపాస్‌పోర్టు ద్వారా ఓ యువతిని అమెరికాకు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు చిక్కాడు. 


అక్రమవలసలు నివారించేందుకు ట్రంప్ ప్రభుత్వం అప్పట్లో అమెరికా-మెక్సికో సరిహద్దు వెంబడి ఓ గోడ నిర్మించేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీంతో.. అక్రమవలసదారులు కెనడా ద్వారా అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించడం ప్రారంభించారు. మెక్సికో వైపున భయంకరమైన గ్రీష్మతాపం భయపెడితే.. కెనడా వైపున శీతలవాతావరణం వీరిని కబళించేందుకు చూస్తుంటుంది. ఏటువైపు ప్రయాణమైనా మృత్యువుతో చెలగాటమే! 

Updated Date - 2022-01-25T02:20:40+05:30 IST