Abn logo
Sep 27 2021 @ 01:01AM

తప్పిన గులాబ్‌ ముప్పు

ప్రత్తిపాడులో వర్షం కురుస్తున్న దృశ్యం

ఊపిరిపీల్చుకున్న ప్రజలు 

పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం

అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్‌

తీర ప్రాంత మండలాల్లో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

రెండు, మూడు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గులాబ్‌ తుఫాన్‌ ముప్పు తూర్పు గోదావరికి తప్పినట్టే. అయితే వాతావరణం పూర్తిగా మేఘావృతం కావడంతో జిల్లావ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు  కురిసాయి. తుఫాను ముప్పు దృష్ట్యా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఆదేశాలతో యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. శనివారం సాయంత్రానికి కళింగపట్నానికి 500 కిలోమీటర్ల తూర్పు ఈశాన్యంగా కేంద్రీకృతమైన అల్పపీడనం తుఫాన్‌గా మారడంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. కోస్తా తీరం వెంబడి ఉన్న జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా ప్రకటించింది. ముఖ్యంగా కాకినాడ పోర్టు తీరంతో పాటు కోనసీమవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లోని మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. అమలాపురం ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు ఆధ్వర్యంలో    తీర ప్రాంత మండలాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా నిరోధించడంతో పాటు తుఫాను తీవ్రమైతే సంభవించే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. అయితే ఉత్తరాంధ్ర-ఒడిసా తీరం మధ్య ఆదివారం గులాబ్‌ తుఫాన్‌ తీరం దాటడంతో మన జిల్లాకు గండం గట్టెక్కినట్టయింది. తుఫాన్‌ ప్రభావంతో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండల, డివిజన్‌ స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి ఆయా ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టర్‌ కార్యాలయానికి అందిస్తున్నారు. అయితే ఆదివారం జిల్లావ్యాప్తంగా వాతావరణం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తున్నాయి. తుఫాన్‌ తీరం దాటడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

జిల్లాలో వర్షపాతం వివరాలు

కాకినాడ సిటీ, సెప్టెంబరు 26: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 5.4 మి.మీ. సరాసరితో మొత్తం 344.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యు.కొత్తపల్లి మండలంలో 39.6 మి.మీ., అత్యల్పంగా పెద్దాపురం మండలంలో 0.4 మి.మీ. వర్షం కురిసింది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు మిల్లీ మీటర్లలో... శంఖవరం 32.2, రాజవొమ్మంగి 26.2, కోటనందూరు 25.2, చింతూరు 18.2, అడ్డతీగల 17.8, పి.గన్నవరం 16.8, గొల్లప్రోలు 15.2, ప్రత్తిపాడు 14.8, గంగవరం 14.4, తొండంగి 14.4, ఏలేశ్వరం 12.4, కాజులూరు 12.4, కాకినాడ అర్బన్‌ 11.8, ఆత్రేయపురం 10.2,  గోకవరం 8.6, తాళ్లరేవు 7.4, రాజమహేంద్రవరం 7.2, అంబాజీపేట 6.2, నెల్లిపాక 6.2, కాకినాడ రూరల్‌ 5.0, వై.రామవరం 4.4, సీతానగరం 3.8, రౌతులపూడి 3.8, పిఠాపురం 2.0, తుని 2.0, రామచంద్రపురం 1.6, కిర్లంపూడి 1.0, కరప 1.0

ఉప్పాడ తీరం అప్రమత్తం

కొత్తపల్లి, సెప్టెంబరు 26: బంగాళాఖాతంలో తుఫాన్‌ కారణంగా ఉప్పాడ తీరంలోని ఉప్పాడ, కొత్తపట్నం, రంగంపేట, సుబ్బంపేట, సూరాడపేట, నాయకర్‌ కాలనీ, రామిశెట్టిపేట, అమీనబాద్‌, మూలపేట, కోనపాపపేట, పొన్నాడ గ్రామాల ప్రజలను వీఆర్వోలు అప్రమత్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉప్పాడ తీరంలో ఆదివారం ఉదయంనుంచి సాయంత్రం వరకు సముద్రం ప్రశాంతంగానే ఉంది. కొత్తపల్లి తహశీల్దారు కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు తహశీల్దారు ఎల్‌.శివకుమార్‌ చెప్పారు. తుఫాన్‌ సమాచారాన్ని తెలియజేయడం కోసం, సహాయక చర్యలు చేపట్టేందుకు 24  గంటలు సిబ్బందిని నియమించినట్టు ఆయన చెప్పారు.