Abn logo
Sep 28 2021 @ 10:36AM

పాలకొండ-అన్నవరం మధ్యలో రాకపోకలు బంద్

శ్రీకాకుళం జిల్లా: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో పాలకొండ, అన్నవరం మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు మార్గ మధ్యలో మృతదేహంతో వచ్చిన అంబులెన్స్  నిలిచి పోయింది. దీంతో గ్రామస్తులు ట్రాక్టర్‌తో అంబులెన్స్‌ను తరలించారు. శ్రీకాకుళంలో అనేక గ్రామాల్లో అంధకారం నెలకొంది. అనేక చోట్ల పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


తుఫాన్‌ విలయంతో విజయనగరం జిల్లా అతలాకుతలమైంది. ఈదురుగాలుల బీభత్సానికి వందలాది విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో అంధకారం నెలకొంది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పదుల సంఖ్యలో చెరువులకు గండ్లు పడ్డాయి. నాగావళి, సువర్ణముఖి, వేగావతి, గోస్తనీ నదులు ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 980 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 131 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. తీర ప్రాంతం వణికిపోయింది. మూడు మీటర్ల మేర అలలు ఎగసిపడ్డాయి. 15 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. రైల్వేలైన్‌పై వరద నీరు ప్రవహిస్తోంది.