తుఫాన్‌ బీభత్సం

ABN , First Publish Date - 2021-09-29T06:09:04+05:30 IST

గులాబ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు తమ్మిలేరు, ఎర్ర కాలువ సహా వాగులు పొంగుతున్నాయి.

తుఫాన్‌ బీభత్సం
దెందులూరు సమీపంలో హైవేపై వరద నీరు

ఉప్పొంగిన తమ్మిలేరు, ఎర్రకాలువ

సుమారు 50 వేల ఎకరాల్లో నీట మునిగిన పంట

గుండేరు వాగు ఉధృతి.. హైవేపైకి నీళ్లు

కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్‌

ఏలూరు శనివారపుపేట, శ్రీపర్రు కాజ్‌వేలపై తమ్మిలేరు వరద


ఏలూరు సిటీ, సెప్టెంబరు 28 : గులాబ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు తమ్మిలేరు, ఎర్ర కాలువ సహా వాగులు పొంగుతున్నాయి. గుండేరు వాగు ఉధృతికి మంగళవారం దెందులూరు–సత్యనారాయణపురం గ్రామాల మధ్య హైవేపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

 ఎర్రకాల్వ, తమ్మిలేరు ఉధృతి

ఎర్రకాలువ కొంత ఉధృతి తగ్గినా కొంగువారిగూడెం జలాశయం నుంచి సాయంత్రం ఆరు గంటలకు 8,094 క్యూసెక్కులు నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా 14,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం 82.83 మీటర్లు నీటి నిల్వ ఉంది. ఎర్రకాలువ ఉధృతికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జేసీలు బీఆర్‌ అంబేద్కర్‌, హిమాన్షుశుక్లా విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఎర్రకాలువ వరద ప్రవాహాన్ని వారు పరిశీలించారు. 

ఎగువ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో తమ్మిలేరు ఉథృతంగా ప్రవహిస్తోంది. నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు జలాశయం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు 6,488 క్యూసెక్కుల నీరు వస్తుండగా 7,136 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహ ఉఽధృతి పెరిగితే ఏలూరు నగరానికి వరద ప్రమాదం పొంచి ఉన్నట్లే. తమ్మిలేరు ఉధృతంగా ప్రవ హించడం వల్ల పరివాహక మండలా ల్లో పంటలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఏలూరులో శనివార పేట కాజ్‌వేపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించడం తో రాకపోకలు నిలిపివేశారు. కైకలూరు వెళ్లే రహదారిలో శ్రీపర్రు కాజ్‌ వే మునిగిపోయింది.

గుండేరు వాగు ఉఽధృతంగా ప్రవహించడంతో దెందులూరు – సత్యనారాయణపురం మధ్య జాతీయ రహదారి మునిగిపోయింది. వాగు నీటి ప్రవాహానికి వున్న తూరలు ద్వారా నీరు లాగకపోవటంతో.. నీటి ప్రవాహానికి అడ్డంకులను జేసీబీల ద్వారా తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.  

 వరి పంటకు తీవ్ర నష్టం

భారీ వర్షాలకు వరి, మొక్కజొన్న, మినుము, అరటి, కూరగాయలు, ఇతర పండ్ల తోటలు ముంపునకు గురై భారీ నష్టం ఏర్పడనుంది. జిల్లా వ్యవసాయ అధికారుల అంచనా మేరకు 43 మండలాల్లోని 367 గ్రామాల్లో 49 వేల 550 ఎకరాల్లో వరి, 15 ఎకరాల్లో మొక్కజొన్న, 240 ఎకరాల్లో మినుము ముంపునకు గురైనట్టు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ప్రాథమిక అంచనాల మేరకు రూ2.23 కోట్లు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. విద్యుత్‌ శాఖకు సంబంధించి 250 విద్యుత్‌ స్తంభాలు నేలకూలగా, 40 ట్రాన్స్‌ఫార్మర్లు ముంపునకు గురయ్యా యి. 11 కేవీకి సంబంధించి 60 ఫీడర్లు, 33 కేవీకి సంబంధించి 8 ఫీడర్ల పరిధిలో సరఫరాకు అంతరాయా లు ఏర్పడ్డాయి. టి.నరసాపురం, సూరప్పగూడెం, గుణ్ణంపల్లి సబ్‌ స్టేషన్లలోకి నీరు చేరటంతో నష్టం వాటిల్లింది. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అన్ని ప్రాంతాల్లోను సరఫరాను పునరుద్దరించినట్లు ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ జనార్దనరావు తెలిపారు. 

 చింతలపూడిలో అత్యధికం

గడచిన 24 గంటల్లో చింతలపూడి మండలంలో అత్యధికంగా 126.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా సరాసరి 20.2 మి.మీ వర్షం కురిసింది. లింగపాలెం 62.2, జీలుగుమిల్లి 55.6, టి.నరసాపురం 54.4, ద్వారకా తిరుమల 51, కామవరపుకోట 48.2, జంగారెడ్డిగూడెం 47.8, పెదవేగి 42, బుట్టాయిగూడెం 30.2, కొయ్యలగూడెం 27, భీమడోలు 26.4, దెందులూరు 25.4, పెదపాడు 23.4, గోపాలపురం 21.4, నల్లజర్ల 21.4, దేవరపల్లి 20.6 మి.మీ వర్షపాతం నమోదైంది. 

పెరిగిన గోదావరి.. అధికారులు అప్రమత్తం

పోలవరం/ఏలూరు సిటీ,  సెప్టెంబర్‌ 28 : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ రాష్ర్టాల నుంచి వస్తున్న వరద నీరు, సీలేరు, శబరి, ఇంద్రావతి ఉప నదులతో గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 31.597 మీటర్లకు, దిగువన 21.880 మీటర్లకు పెరిగింది. గోదావరిలోకి అదనంగా వస్తున్న 5,19,483 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఆదిరెడ్డి తెలిపారు. అధిక వర్షాల కారణంగా గోదావరికి వరద ప్రమాదం పొంచి ఉందని, కావున లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన  కలెక్టరేట్‌ నుంచి ఐటీడీఏ పీవో, సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గోదావరి స్థాయి పెరిగే అవకాశం ఉండడంతో లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని, శిబిరాల్లో అవసరమైన నిత్యావసర వస్తువులు, పాలు, నీరు, విద్యుత్‌, కూరగాయలన్నీ సిద్దం చేయాలన్నారు. జేసీ(రెవెన్యూ) బీఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారిని నియమించి, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలన్నారు. 

Updated Date - 2021-09-29T06:09:04+05:30 IST