38 ఏళ్ల నుంచి గల్ఫ్‌లో గోస..

ABN , First Publish Date - 2021-01-21T06:56:07+05:30 IST

ఏజెంట్‌ దురాగతానికి... కాంట్రాక్టు పెళ్లి పేరిట జరిగిన మోసం కారణంగా ఓ మహిళ 38 ఏళ్ల నుంచి యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌)లో నరకం అనుభవిస్తోంది.

38 ఏళ్ల నుంచి గల్ఫ్‌లో గోస..

1983లో కాంట్రాక్టు పెళ్లికి బలైన బాధితురాలు

స్వదేశానికి రప్పించాలని వేడుకోలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఏజెంట్‌ దురాగతానికి... కాంట్రాక్టు పెళ్లి పేరిట జరిగిన మోసం కారణంగా ఓ మహిళ 38 ఏళ్ల నుంచి యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌)లో నరకం అనుభవిస్తోంది. మహబూబ్‌నగర్‌, టెన్‌ బోయపల్లి గేట్‌ ప్రాంతానికి చెందిన మర్యమ్‌ స్వదేశానికి వచ్చేందుకు పడరాని పాట్లు పడుతోంది. తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియదు.. నా అనే వాళ్లు అసలు ఉన్నారో లేదో తెలియని దుస్థితిలో అక్కడ ఇళ్లలో పని చేస్తూ జీవితాన్ని సాగిస్తోంది. 11 ఏళ్ల క్రితం యూఏఈలో తన సోదరి ఉందని ఇక్కడ ఉన్న ఆమె సోదరికి ఓ వ్యక్తి ద్వారా సమాచారం అందింది. అప్పటి నుంచి మర్యం ఆచూకీ కోసం సోదరి వెతుకుతూనే ఉంది. 

1983లో మహమ్మద్‌ హుస్సేన్‌ అనే ఏజెం ట్‌ మర్యమ్‌ తల్లిదండ్రులను ఒప్పించి యూఏ ఈ రాసల్‌ఖైమా ప్రాంతానికి చెందిన అరబ్‌కు కాంట్రాక్ట్‌ పెళ్లి చేయించాడు. ఫోన్‌, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు లేని కాలంలో ఎక్కడికి  వెళ్తున్నానో కూడా తెలియని పరిస్థితుల్లో మర్యమ్‌ యూఏఈలో అడుగు పెట్టింది. కొన్ని రోజులపాటు అరబ్‌షేక్‌ ఇంట్లో ఉన్న ఆమెకు చిత్ర హింసలు తప్పలేదు. స్వదేశానికి వెళతానంటే ఒప్పుకోని అరబ్‌ షేక్‌ ఆమె పాస్‌పోర్టు తీసుకుని, ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. అప్పటి నుంచి పాస్‌పోర్టు లేకుండానే మర్యం యూఏఈలోని వివిధ నగరాల్లో తిరుగుతూ, వేర్వేరు ఇళ్లల్లో పని చేస్తూ బతుకుతోంది. ప్రస్తుతం ఆమె ఫుజీరాలో ఉంటోంది. 1983 నుంచి 2010 వరకు ఆమెకు, ఇక్కడ కుటుంబానికి ఎలాంటి సంబంధమూ లేదు. 2010లో ఓ దూరపు బంధువు తారసపడి, ఆమె దుస్థితిని హైదరాబాద్‌లో ఉన్న ఆమె సోదరి షాజహాన్‌కు సమాచారం ఇచ్చాడు. ఆమె కూడా సోదరిని కలవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె వద్ద పాస్‌పోర్టు లేకపోవడం, షాజహాన్‌ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లలేక దిక్కుతోచని స్థితి. ఎక్కడికి వెళ్లాలో.. ఎవరిని సంప్రదించా లో తెలియని పరిస్థితిలో ఆమె సోదరి కోసం ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్‌ను సంప్రదించింది. బాధితురాలు కన్నీటితో వేడుకుంటూ తనను, స్వదేశానికి రప్పించేలా ఏర్పాట్లు చేయాలని అంజదుల్లాఖాన్‌కు వీడియో పంపించింది. ఆమె పరిస్థితిని గ్రహించిన అంజదుల్లాఖాన్‌.. మర్యమ్‌ను గుర్తించి రక్షించి స్వదేశానికి రప్పించాలని కోరుతూ విదేశాంగ శాఖకు లేఖ రాశారు. 

Updated Date - 2021-01-21T06:56:07+05:30 IST