అఫ్ఘానీలకు ఆశ్రయంపై అమెరికాకు అవరోధాలు

ABN , First Publish Date - 2021-08-22T13:02:56+05:30 IST

అమెరికా, సంకీర్ణ దళాలకు సహాయపడ్డ అఫ్ఘానీ ప్రజలు మాతృదేశం విడిచి అమెరికాకు పయనమవుతుండగా, వారికి తాత్కాలిక ఆశ్రయాన్ని కల్పించాల్సిందిగా అమెరికా తన మిత్ర గల్ఫ్‌ దేశాలను అభ్యర్ధిస్తోంది. అయితే ఈ విజ్ఞప్తికి వాటి నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రావడం లేదు.

అఫ్ఘానీలకు ఆశ్రయంపై అమెరికాకు అవరోధాలు

శరణార్థుల విమానాలను రానివ్వలేమన్న ఖతర్‌.. 

తాత్కాలిక వసతికి బహ్రెయిన్‌, కువైత్‌, యూఏఈ సమ్మతి

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): అమెరికా, సంకీర్ణ దళాలకు సహాయపడ్డ అఫ్ఘానీ ప్రజలు మాతృదేశం విడిచి అమెరికాకు పయనమవుతుండగా, వారికి తాత్కాలిక ఆశ్రయాన్ని కల్పించాల్సిందిగా  అమెరికా తన మిత్ర గల్ఫ్‌ దేశాలను అభ్యర్ధిస్తోంది. అయితే ఈ విజ్ఞప్తికి వాటి నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రావడం లేదు. అఫ్ఘాన్‌లో అమెరికా సేనల కార్యకలాపాలను పర్యవేక్షించిన సెంట్రల్‌ కమాండ్‌ స్థావరం కలిగిన ఖతర్‌ దేశం అఫ్ఘానీ పౌరులకు ఆశ్రయం కల్పించలేమని తేల్చిచెప్పింది. బహ్రెయిన్‌, కువైత్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అఫ్ఘానీలు అమెరికా లేదా ఏ ఇతర దేశానికైనా వెళ్లదలిస్తే, మార్గంమధ్యలో తాము కేవలం తాత్కాలిక వసతిని మాత్రమే కల్పిస్తామని అవి స్పష్టంచేశాయి. అఫ్ఘానిస్థాన్‌ నుంచి అమెరికన్‌ సేనలు తీసుకొచ్చే విమానాలపై ఖతర్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, శుక్రవారం కాబూల్‌ విమానాశ్రయం నుంచి అఫ్ఘానీల తరలింపునకు అంతరాయం కలిగింది. 


ఈ ప్రతికూల పరిణామం అంతర్జాతీయంగానూ రచ్చకెక్కింది. ఖతర్‌లోని అల్‌ ఉదేద్‌ వైమానిక స్థావరం సామర్థ్యం పూర్తి స్థాయికి చేరుకుందని పేర్కొంటూ.. తమ దేశానికి అమెరికా విమానాల రాకపై ఖతర్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం అమెరికా ఎస్‌ఐ వీసా శ్రేణి దరఖాస్తుదారులకు మాత్రమే తాము తాత్కాలిక ఆతిథ్యం ఇస్తామని స్పష్టంచేసి అమెరికాకు ఖతర్‌ చుక్కలు చూపించింది. ఆ దేశంలో ఉన్న అఫ్ఘానీ శరణార్ధుల సంఖ్య ఎంత అనేది ఇంకా వెల్లడి కానప్పటికీ.. మిగిలిన దేశాలతో పోలిస్తే అక్కడ ఎక్కువమందే తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఖతర్‌లో ప్రస్తుతం తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న అఫ్ఘానీలు.. అక్కడి ఆవాస శిబిరాల్లో కనీస వసతులు కూడా కరువయ్యాయని వాపోతున్నారు. 


ఖతర్‌ నో అనడంతో జర్మనీకి.. 

ఖతర్‌ అభ్యంతరం నేపథ్యంలో శుక్రవారం కాబూల్‌లోని విమానాశ్రయం నుంచి కొందరిని జర్మనీలోని తన స్థావరానికి అమెరికా తరలించింది. మరోవైపు ఈవిషయంలో అమెరికాకు సహకరించేందుకు యూ ఏఈ ముందుకొచ్చింది. అఫ్ఘాన్‌ నుంచి ఇతర దేశాలకు తరలించే 5వేల మంది అఫ్ఘానీ పౌరులకు మా ర్గం మధ్యలో తాత్కాలిక వసతిని కల్పిస్తామని శుక్రవారం రాత్రి ప్రకటించింది. దీంతో అమెరికా కొందరు అప్ఘానీ పౌరులను శనివారం అబుధాబికి తీసుకెళ్లింది. 


బహ్రెయిన్‌ వైమానిక స్థావరం రెడీ.. 

తమ దేశంలోని అల్‌ ఈసా వైమానిక స్థావరాన్ని ఇందుకు వినియోగించుకునేందుకు బహ్రెయిన్‌ అనుమతులు మంజూరు చేసింది. ఐరోపా దేశాలకు వెళ్లే అఫ్ఘానీలకు తమ దేశం సత్రం కాబోదని టర్కీ స్పష్టంచేసినా.. కొంతమంది అమెరికన్లకు తాత్కాలిక వసతిని కల్పిస్తామని చెప్పింది. వీసాలు జారీ అయి అమెరికాకు వెళ్లే వరకు అఫ్ఘానీ మిత్రులకు ఆశ్రయం కల్పించేందుకు ఉక్రెయిన్‌, ఉగాండా, కెనడా సహా పలు దేశాలు ముందుకొచ్చాయి. కువైత్‌, ఉజ్బెకిస్తాన్‌, తజికిస్తాన్‌, కజకిస్తాన్‌ ఇతర దేశాలు ట్రాన్సిట్‌ వసతిని కల్పించేందుకు అంగీకరించాయి. ఇదిలా ఉండగా, అఫ్ఘాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా తాము అక్కడికి వెళ్లలేమని, ఖతర్‌లోనే తాత్కాలిక ఆశ్రయం కల్పించాలని అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వంలోని కీలక నేతలు ఖతర్‌ ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2021-08-22T13:02:56+05:30 IST