గల్ఫ్ కార్మికుల బోర్డు ఏర్పాటుకై వినోద్ కుమార్‌ను కలిసిన ప్రవాసీయుల బృందం

ABN , First Publish Date - 2021-01-12T23:03:07+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్‌ను రాష్ట్రానికి చెందిన గల్ఫ్ ప్రవాసీయుల ప్రతినిధులు,

గల్ఫ్ కార్మికుల బోర్డు ఏర్పాటుకై వినోద్ కుమార్‌ను కలిసిన ప్రవాసీయుల బృందం

ఆంధ్రజ్యోతి గల్ప్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్‌ను రాష్ట్రానికి చెందిన గల్ఫ్ ప్రవాసీయుల ప్రతినిధులు, ప్రముఖులు కలిశారు. ప్రవాసీయుల సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపాదికన గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వినోద్ కుమార్‌ను విజ్ఞప్తి చేశారు. అమెరికా, పాశ్చాత్య దేశాలలో ఉంటున్న ప్రవాసీయులకు, గల్ఫ్ దేశాలలో ఉంటున్న ప్రవాసీయులకు భారీ వ్యత్యాసం ఉందని అన్నారు. ఆర్థికంగా బలహీనులైన ఎడారి ప్రవాసీయులను ఆదుకునే దిశగా ప్రభుత్వానికి సూచించాలని ప్రవాసీ ప్రతినిధుల బృందం వినోద్ కుమార్‌ను కోరగా ఆయన అందుకు సానుకూలంగా స్పందించినట్లు బృంద సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. 


గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రవాసీయులకు పునరావాసం కల్పించడానికి స్వల్ప వడ్డీ రుణాలు అందించాలని, గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. సురక్షిత వలసలకు , విదేశాల్లో వివిధ కారణాలతో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురావడం, తిరిగి వచ్చిన వారికి ఉపాధి, వైద్య - విద్య హామీలు, బీమాల మీద, నైపుణ్యత మీద దృష్టి పెట్టాలని కోరారు. అదే విధంగా మోసాలకు పాల్పడే ఏజెంట్లకు కఠిన శిక్షలు, జరిమానాలు విధించాలని కూడా విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ జైళ్లలో ఉన్న ప్రవాసీయులకు న్యాయసహాయం అందించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. 


గల్ఫ్ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బోర్డును ఏర్పాటు చేయించడానికి తనవంతుగా ప్రయత్నాలు చేస్తానని ఈ సందర్భంగా వినోద్ కుమార్ హామీ ఇచ్చినట్లు ప్రవాసీయుల బృందం చెప్పింది. వినోద్ కుమార్‌ను కలిసిన బృందంలో మంద భీం రెడ్డి, కోటపాటి నర్సింహా నాయుడు, గంగుల మురళీధర్ రెడ్డి, జనగాం శ్రీనివాస్, ఏముల రమేశ్, జంగం బాలకిషన్, కుంట దశగౌడ్‌లు ఉన్నారు. కాగా.. బోర్డు ఆవశ్యకతను వివరిస్తూ ఈ బృందం గత కొన్ని వారాలుగా అధికార పార్టీ నాయకులను కలుస్తోంది. బోర్డ్ చెర్మన్ పదవిని నర్సింహా నాయుడు ఆశిస్తుండగా ఇతరులు అందులో డైరెక్టర్లుగా పదవులు ఆశిస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది.


Updated Date - 2021-01-12T23:03:07+05:30 IST