గల్ఫ్‌ తెలుగు సంఘాల ఆధ్వర్యంలో భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు

ABN , First Publish Date - 2021-08-18T21:48:19+05:30 IST

గల్ఫ్‌లోని తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు సంఘాల ఐక్యవేదిక-కువైత్ ఆధ్వర్యంలో గల్ఫ్‌దేశాల్లోని 8 సంఘాలు వర్చువల్‌గా వేడుకల్లో పాల్గొన్నాయి.

గల్ఫ్‌ తెలుగు సంఘాల ఆధ్వర్యంలో భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు

కువైత్‌ సిటీ: గల్ఫ్‌లోని తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు సంఘాల ఐక్యవేదిక-కువైత్ ఆధ్వర్యంలో గల్ఫ్‌దేశాల్లోని 8 సంఘాలు వర్చువల్‌గా వేడుకల్లో పాల్గొన్నాయి. గల్ఫ్‌లోని తెలుగు సంఘాల వారు 75వ స్వాతంగ్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా పూర్తిగా వర్చువల్ పద్దతిలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కువైత్‌లో భారత రాయబారి సీబీ జార్జి, ప్రత్యేక అతిథిగా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు,  గౌరవ అతిథిగా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి హాజరై గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 5 ఏళ్ల పిల్లల నుంచి 80 ఏళ్ల పెద్దల వరకు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా దేశభక్తి నేపథ్యంతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వ్యాఖ్యాత వెంకప్ప భాగవతులు కార్యక్రమాన్ని వినోదభరితంగా నడిపించి అందరి మన్నలను అందుకున్నారు. అనంతరం తెలుగు సంఘాల ఐక్య వేదిక-కువైత్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు మాట్లాడుతూ గల్ఫ్‌ దేశాల్లోని తెలుగు సంఘాలు ఈ విధంగా 75వ స్వాతంత్ర్య వేడుకలను గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాలు కలిసి నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు కళా సమితి- బహ్రెయిన్‌, తెలుగు కళా సమితి- ఒమన్‌, ఆంధ్ర కళా వేదిక- ఖతర్‌, సౌదీ తెలుగు అసోసియేషన్‌- సౌదీ అరేబియా, తెలుగు కళా స్రవంతి- అబుధాబి, తెలుగు తరంగిణి- రస్‌ అల్‌ ఖైమా, ఫుజైరా తెలుగు కుటుంబాలు- ఫుజైరా తదితర సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్‌గా కుదరవల్లి ఫౌండేషన్, శుభోదయం ఇన్‌ఫ్రా వారు వ్యవహరించారు. మీడియా పార్ట్నర్స్‌గా కువైత్ ఆంధ్రచానెల్ వ్యవహరించింది. సాంకేతిక సహకారం విక్రం సుఖవాసి, ఆర్కే వీడియోగ్రఫీ సింగపూర్ వారు అందించారు. 


కుదరవల్లి సుధాకరరావు గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య గురించి మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న సురభి నాటకరంగానికి చేయూతనివ్వాలనే తలంపుతో ప్రతి నెల ఒక తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో ఒక్క సురభి నాటకాన్ని ప్రదర్శించే విధంగా కార్యాచరణ రూపొందించిన్లు తెలిపారు. దీనిలో భాగంగా జులైలో తెలుగు కళా సమితి- బహ్రెయిన్ ఆధ్వర్యంలో మాయాబజార్‌ను, ఆగస్టులో తెలుగు కళా సమితి- ఒమన్ వారి ఆధ్వర్యంలో పాతాళభైరవి నాటకాన్ని ప్రదర్శించినట్లు తెలియజేశారు. ఇలాగే జనవరి వరకు వివిధ తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే విధంగా గతేడాది జులైలో తానా ఆధ్వర్యంలో జరిగిన తెలుగు సాంస్కృతిక మహోత్సవం, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన మహా కవి సమ్మేళనం, ఇటీవల సింగపూర్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక సమ్మేళనం భేష్ అని సుధాకరరావు అన్నారు. 





Updated Date - 2021-08-18T21:48:19+05:30 IST