మళ్లీ గల్ఫ్‌బాట

ABN , First Publish Date - 2022-09-20T05:20:26+05:30 IST

జిల్లాకు చెందిన కార్మికులు తిరిగి ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పడుతున్నారు. ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన కార్మికులు కరోనా వైరస్‌ కారణంగా మూడేళ్ల క్రితం తరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. కొవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఉపాధి కోసం గల్ఫ్‌బాట పడుతున్నారు. జిల్లాలో నిత్యం వందల సంఖ్యలో విదేశాలకు పయనం అవుతున్నారు.

మళ్లీ గల్ఫ్‌బాట

కరోనా కారణంగా ఇంటికి చేరిన కార్మికులు

మూడేళ్లుగా ఉపాధిలేక తిరిగి పయనం

జిల్లాలో రోజుకు వందల సంఖ్యలో వలసలు

ఏజెంట్ల చేతిలో మోసపోతున్న కార్మికులు

సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 19: జిల్లాకు చెందిన కార్మికులు తిరిగి ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పడుతున్నారు. ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన కార్మికులు కరోనా వైరస్‌ కారణంగా మూడేళ్ల క్రితం తరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. కొవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఉపాధి కోసం గల్ఫ్‌బాట పడుతున్నారు. జిల్లాలో నిత్యం వందల సంఖ్యలో విదేశాలకు పయనం అవుతున్నారు. కరోనా సమయంలో గల్ఫ్‌లో పనిచేస్తున్న జిల్లాకు చెందిన కార్మికులను ఉన్నఫలంగా తిరిగి ఇంటికి పంపడంతో స్వగ్రామాలకు చేరుకున్నారు. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఇక్కడ ఉపాధి కూడా లేకపోవడంతో గల్ఫ్‌కు తిరిగి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో టూరిస్టు ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో అక్కడి రెస్టారెంట్‌లు, భవన నిర్మాణ రంగాల్లో ఉపాధి ఎక్కువగా ఉంటుంది. అయితే కరోనా సమయంలో వీటికి అంతగా ప్రాధాన్యం లేకపోవడంతో అక్కడి కార్మికులను కంపెనీలు ఇంటికి పంపించాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో రెస్టారెంట్‌లు, భవన నిర్మాణరంగాలు ఊపందుకోవడంతో కార్మికుల ఆవశ్యకత ఏర్పడింది. దీంతో వీసాలు ఎక్కువగా రావడంతో కార్మికులు గల్ఫ్‌ దేశాలు వెళ్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లో కార్మికుల అవసరం ఉండడంతో అక్కడ ఉన్న ప్రధాన కంపెనీలు సైతం ఇక్కడ ఉన్న మ్యాన్‌పవర్‌ కన్సల్టెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుని కార్మికులను కొంతమొత్తంలో డబ్బులు తీసుకుని గల్ఫ్‌కు తీసుకెళ్తున్నాయి. నెలలో సుమారు 500 నుంచి వెయ్యిమంది కార్మికులు జిల్లా నుంచి ఉపాధి కోసం వెళ్తున్నారు. 18 ఏళ్లు నిండగానే పాస్‌పోర్టులు తీసి గల్ఫ్‌కు పయనమవుతున్నారు. రెండు నెలల క్రితం విమాన టికెట్‌ సైతం రూ.35వేల నుంచి 40వేలు ఉండడంతో గల్ఫ్‌ వెళ్లే కార్మికులు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం విమాన టికెట్‌ ధర రూ.20వేల నుంచి రూ.25వేలు ఉండడంతో గల్ఫ్‌కు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఇదే అదునుగా ఏజెంట్ల మోసాలు

గల్ఫ్‌కు పంపిస్తానని ఏజెంట్లు గల్ఫ్‌ కార్మికులకు చుక్కలు చూపిస్తున్నారు. లక్షల్లో డబ్బులు తీసుకుంటూ వీసాలు ఇవ్వక చుట్టూ తిప్పించుకుంటున్నారు. కరోనా అనంతరం గల్ఫ్‌కు వెళ్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇదే అదునుగా భావించిన ఏజెంట్లు గల్ఫ్‌ కార్మికులను మోసం చేస్తున్నారు. వారం పది రోజుల్లో వీసాలు ఇప్పిస్తామనిచెప్పి పాస్‌పోర్టులు, డబ్బులు తీసుకుని వారి చుట్టూ చెప్పులు అరిగేలా తిప్పించుకుంటున్నారు. కొందరు ఏజెంట్లు నకిలీ వీసాలు చేతిలో పెట్టి గల్ఫ్‌ కార్మికులకు చుక్కలు చూపిస్తున్నారు. కొందరిని విసిట్‌ వీసా మీద పంపి అక్కడ పనిచూపించకపోవడంతో తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. కొందరు ఏజెంట్లు నకిలీ వీసాలు తయారుచేసి ముంబైలో కొన్ని రోజుల పాటు ఉంచుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏజెంట్లపై చర్యలు తీసుకోవడంలేదు.

వీసాకు రూ.50వేల నుంచి లక్ష వసూలు

గల్ఫ్‌ కార్మికులు వీసాల కోసం రూ.50వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. కంపెనీ వీసా అయితే కొంతమొత్తంలోనే చెల్లించి కంపెనీ వీసా ఇస్తారు. కానీ కంపెనీ కాకుండా ఏజెంట్లు, సబ్‌ ఏజెంట్ల ద్వారా గల్ఫ్‌కు వెళ్తుండడంతో కమీషన్‌ల ద్వారా రూ.50వేల నుంచి లక్ష రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు.

పనులు దొరకక తిరిగి వెళ్తున్నా..

: నవీన్‌, రెంజర్ల

కరోనాకు ముందు దుబాయి లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేశా. కరోనా దెబ్బతో హోటల్‌ మూతపడడంతో కంపెనీ ఇంటికి పంపించింది. ఇక్కడ పనులు దొరకకపోవడంతో తిరిగి దుబాయి వెళ్తున్నా.

కరోనా వైరస్‌ వ్యాప్తితో తిరిగి వచ్చా..

: నరేష్‌, దుబ్బాక

కొన్ని సంవత్సరాలుగా దుబాయిలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేశాను. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో కంపెనీ ఇంటికి పంపింది. ప్రస్తుతం కరోనా తగ్గడంతో ఉపాధి కోసం మళ్లీ వెళ్తున్నాను.

Updated Date - 2022-09-20T05:20:26+05:30 IST