Feb 23 2021 @ 17:03PM

గుమ్మడికి షాకిచ్చిన ఎన్టీఆర్

యువరత్న బాలకృష్ణ ఈ రోజు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భీష్ముడి గెటప్‌లో ఉన్న తన స్టిల్స్‌ని మీడియాకి రిలీజ్ చేశారు. చాలా మంది ఆ స్టిల్స్ చూసి అచ్చు పెద్దాయన గెటప్‌లాగే ఉందని చాలా ముచ్చట పడ్డారు. బాలకృష్ణకి మొదటినుంచీ పెద్దాయన చేసిన పాత్రలంటే మహా మక్కువ. అందుకే మొన్న ఎన్టీఆర్ బయోపిక్ తీసినప్పుడు కొన్ని గెటప్పులు వేసుకున్నారు. బాలకృష్ణ భీష్ముడి గెటప్ వేసుకుంటేనే చాలా మంది విడ్డూరపడ్డారు. అలాంటిది ఎన్టీఆర్ 1962లో వచ్చిన భీష్మలో అంటే దాదాపుగా ఆయన అప్పటికి చాలా యంగ్‌గా ఉన్నప్పుడే భీష్ముడి పాత్రను ధరించి అందరికీ షాకిచ్చారు. అప్పడు షూటింగ్‌లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. భీష్మలో కర్ణుడిగా నటించిన గుమ్మడి షూటింగ్‌కి వచ్చారు. మేకప్ వేసుకుని, గెటప్ కూడా పూర్తయి కూర్చున్నారు. అదే మొదటిరోజు షూటింగ్ గుమ్మడికి. ఎన్టీఆర్ గురించి ఎదురు చూస్తున్నారు. షాట్‌కి పిలుపూ రాలేదు. ఎన్టీఆర్ కూడా రాలేదు. సరేనని దర్శకుడు బిఎ సుబ్బారావు దగ్గరకి వెళ్ళి ఎన్టీఆర్ ఇంకా రాలేదు, ఎప్పుడొస్తారని ప్రశ్నించారు. దానికి బిఎ సుబ్బారావు నవ్వి, అదిగో అక్కడే కూర్చున్నాడుగా రామారావు అని చెప్పారు. గుమ్మడి ఆశ్చర్యపోయారు. 

అక్కడో కిరీటం పెట్టుకోని ఓ ముసలాయన కూర్చున్నాడు. ఈయన్ని ఎన్టీఆర్ అంటారేంటి అని గుమ్మడి సందేహం. దగ్గరగా వెళ్ళి చూస్తే నిజంగా ఆయన ఎన్టీఆరే. గుమ్మడి తన కళ్ళను తానే నమ్మలేకపోయారు. ఎన్టీఆర్ అంత గొప్పగా భీష్మపాత్రకి సరిపోయారు. తర్వాత రిలీజై, గుమ్మడితో పాటు యావదాంధ్ర ప్రేక్షకులను నివ్వెరపోయేలా చేశారు. అదీ ఎన్టీఆర్ ఘనత.