‘రియల్’ దందాలో పేలుతున్న గన్స్.. సంతలో సరుకుల్లా దొరికేస్తున్నాయ్..!

ABN , First Publish Date - 2022-03-02T18:23:40+05:30 IST

నగర శివారులో మరోసారి కాల్పుల మోత మారుమోగింది. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు..

‘రియల్’ దందాలో పేలుతున్న గన్స్.. సంతలో సరుకుల్లా దొరికేస్తున్నాయ్..!

  • రూ. 2 వేల నుంచి రూ. 20 వేలకే లభ్యం 
  • పొరుగు రాష్టాల నుంచి తెచ్చుకుంటున్న కొందరు
  • నగర శివారులో పేలింది అక్రమ ఆయుధమే..?

హైదరాబాద్‌ సిటీ : నగర శివారులో మరోసారి కాల్పుల మోత మారుమోగింది. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరు రియల్టర్లపై కాల్పులు జరిపి హత్య చేసిన నిందితులను గుర్తించకపోయినా, వారు వినియోగించిన ఆయుధం మాత్రం అక్రమమే అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. లెసైన్స్‌డ్‌ ఆయుధమున్న వారు నేరుగా కాల్పులు జరిపే అవకాశాలు తక్కువగా ఉండటంతో రియల్టర్లపై కాల్పులకు కంట్రీమేడ్‌ ఆయుధమే వాడి ఉంటారని భావిస్తున్నారు. దీంతో అక్రమ ఆయుధాల ఉనికి మరోసారి నగరంలో బహిర్గతమైంది. సంతలో సరుకులా లభిస్తున్న అక్రమ ఆయుధాలకు ఇతర రాష్ట్రాల గ్యాంగులు సరఫరా చేసిన ఘటనలను పోలీసులు గతంలో గుర్తించారు. రియల్‌ వ్యాపారంలో వీటి వినియోగం ఎక్కువగా బయటపడటం గమనార్హం. కొందరు అడ్డదారుల్లో ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టేటస్‌ కోసం కొందరు, భయాందోళనలకు గురి చేసేందుకు మరికొందరు ఆక్రమంగా ఆయుధాలను సమకూర్చుకుంటున్న ట్లు తెలుస్తోంది.


ఈజీగా ఆయుధాలు..

సిటీ కల్చర్‌లో తుపాకీ స్టేట్‌సగా మారింది. ఒకప్పుడు ప్రముఖులకు, ప్రాణభయం ఉన్న వారికి మాత్రమే పలు రకాలుగా ఆరా తీసిన తర్వాత లైసెన్సు లభించేది. ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో సుమారు 7 వేల లెసెన్స్‌డ్‌ వెపన్స్‌ ఉన్నాయి. ఇంకా వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ఆయుధ లైసెన్స్‌ల జారీ ప్రక్రియ కఠినతరం చేసి, తప్పని సరి పరిస్థితుల్లో మాత్రమే గన్‌ లైసెన్స్‌ మంజూరు చేస్తున్నారు. దీంతో వెపన్‌ అవసరం ఉన్న కొందరు బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలలో ఈజీగా తుపాకులను కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు. మరికొందరు నేరుగా అక్కడికే వెళ్లి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో రూ.2 వేల నుంచి రూ.20 వేల లోపే వెపన్‌ లభిస్తోందని ఇటీవల చిక్కిన నిందితుల గ్యాంగ్‌ చెప్పడం గమనార్హం. 


గతంలో ఓ గ్యాంగ్‌ ఏకంగా వాట్సా్‌పలోనే పిస్టల్‌ అమ్మకానికి ఉంచి పట్టుబడిన విషయం తెలిసిందే. మరొకరు రెండేళ్ల పాటు గన్‌లను దాచిపెట్టి చివరకు సోదరున్నే హతమార్చాడు. రియల్‌ దందాలో ఉన్న ఆ వ్యక్తి నేరుగా బిహార్‌ నుంచి ఓ తపంచా కొనుగోలు చేసి  బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫిర్యాదు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.


ఖాళీ జాగా కనిపిస్తే.. 

డబ్బు, స్థానికంగా పలుకుబడి ఉన్న వారు రియల్‌ ఎస్టేట్‌ దందాలకు దిగుతున్నారు. గతంలో క్రయవిక్రయాలు జరిగిన భూములు ఖాళీగా ఉంటే వాటిలో గద్దల్లా వాలిపోతున్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, మొయినాబాద్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, మహేశ్వరం, షాద్‌నగర్‌,  కుత్బుల్లాపూర్‌, కీసర, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌ తదితర మండలాల్లో భూవివాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అడ్డగోలుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. లేని వివాదాలను సృష్టిస్తున్నారు. వీటిని తామే పరిష్కరిస్తామంటూ ముందుకు వస్తున్నారు. అఽధికారులు, పోలీసులు, రాజకీయ నేతలతో సంబంధాలు పెట్టుకుని ఈ దందా చేస్తున్నారు.


కిరాయి ముఠాలు.. 

కొందరు రియల్టర్లు తమ దందాకు అడ్డువస్తే ఏదో కేసులో ఇరికించడం, హత్యలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ఇందుకోసం కిరాయి ముఠాలను రంగంలో దించుతున్నారు. మంగళవారం జరిగిన హత్యల వెనుక సుపారి గ్యాంగ్‌ ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాయింట్‌ బ్లాంక్‌లో కాల్పులు జరిపిన తీరును బట్టి రాటుదేలిన ముఠానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ జంట హత్యలు వెనుక నయూమ్‌ ముఠా పాత్ర ఉందనే అనుమానాలను కూడా వ్యక్తం కావడంతో పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నారు. 


గతంలోనూ.. 

నగర శివారు ప్రాంతాల్లో  రియల్‌ ఎస్టేట్‌ భాగస్వాముల మధ్య కూడా విభేదాలు తలెత్తి హత్యలు జరిగాయి. గత ఏడాది బాలాపూర్‌లో ఇద్దరు రియల్టర్ల మధ్య జరిగిన విభేదాలు కారణంగా అమాయకుడు బలయ్యాడు. సుపారి తీసుకున్న వాళ్లు చంపాల్సిన వ్యక్తిని కాకుండా అదే రంగు షర్ట్‌ వేసుకున్న మరొకరిని కత్తులతో పొడిచి హత్యచేశారు. 2019లో పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ భాగస్వాముల మధ్య గొడవ జరిగి మహ్మద్‌సాదీ అనే వ్యక్తిని హత్యచేశారు.  2019 డిసెంబర్‌లో ఓల్డ్‌ బోయినపల్లిలో భూవివాదంలో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. చివరికి వీరి అండతో ఓ వర్గం వారు మరో వర్గంపై దాడిచేశారు. అయితే ఆ సమయంలో అడ్డువచ్చిన అమాయకుడైన వాచ్‌మన్‌కు నిప్పంటించారు.


ఇటీవల జరిగిన ఘటనలు

- పాతబస్తీలో ఓ వ్యక్తి పొరుగు వ్యక్తిని బెదిరించడానికి తన వద్ద తుపాకీతో గాల్లో కాల్పులు జరపడంతో అప్పట్లో కేసు నమోదైంది. 

- మూసాపేటకు చెందిన వ్యక్తికి సంబంధించిన స్థలం ఎవరో కబ్జా చేశారని తెలిసి అక్కడకు వెళ్లాడు. అక్కడున్న వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీని గురిపెట్టి బెదిరించాడు. 

- ఫలక్‌నుమా పీఎస్‌ పరిధిలోనూ భూ వివాదంలో తల దూర్చిన ఓ వ్యక్తి రివాల్వర్‌ను చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. 

- కడుపు నొప్పితో బాధపడుతున్న పాతబస్తీకి చెందిన యువతిని నిమ్స్‌ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా, ఆమె శరీరంలో బుల్లెట్‌ దర్శనమిచ్చింది. 

- పాతబస్తీలో పలుకుబడి ఉన్న ఓ రియల్‌ వ్యాపారి ఏకంగా మరో వ్యాపారిపై కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచాడు.  

-  బారాత్‌లో కూడా గాల్లో కాల్పులు జరిపిన మరో రియల్‌ వ్యాపారి వీడియో కూడా బాగా వైరల్‌ అయింది.  

- ఓ బర్త్‌డే పార్టీలోనూ రివాల్వర్‌తో రియల్‌ వ్యాపారం చేసే యువకుడు డాన్సు చేసిన వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. 


రియల్‌ వ్యాపారి హల్‌చల్‌... 

మేడ్చల్‌ జిల్లా నాగారం మునిసిపాలిటీ రాంపల్లి శివారులో పదెకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. అతడి అనుచరులు మంగళవారం వీరంగం సృష్టించారు. తమ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్లితే.. రాంపల్లి శివారులో పది ఎకరాల భూమిని 2004లో జైహింద్‌గౌడ్‌ అనే వ్యక్తి చర్లపల్లి రాజాలింగారెడ్డి అనే భూస్వామి వద్ద కొనుగోలు చేశారు. ఆ భూమిలో కొంత కాలం వ్యవసాయం చేసి భూమిని రతన్‌ అగర్వాల్‌కు అమ్మారు. అయితే, రాజిరెడ్డి అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆ భూమి తనదేనంటూ అగర్వాల్‌ను బెదిరించాడు. దీంతో అగర్వాల్‌ తనకు భూమి విక్రయించిన జైహింద్‌ గౌడ్‌ వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు. 


జైహింద్‌ గౌడ్‌ సదరు భూమిని తిరిగి తీసుకుని, ఇందుకు ప్రతిగా యాదాద్రిలో పది ఎకరాలను రతన్‌ అగర్వాల్‌కు పట్టా చేశాడు. మొదట అమ్మిన పదెకరాలను వెంచర్‌ చేసి, ప్లాట్లు అమ్మేశాడు. అయితే, సోమవారం రాత్రి రాజిరెడ్డి, అతడి గ్యాంగ్‌తో వచ్చి సర్వే నెంబరు 268 వెంచర్‌లోని 170 ప్లాట్ల హద్దురాళ్లను తొలిగించారు. గేట్‌ తాళాలను పగలగొట్టి కజ్జాకు యత్నించాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గతంలోనూ వీరి మధ్య ఇదే భూమికి సంబంధించిన వివాదాన్ని పోలీసులు పరిష్కరించారు. తాజాగా మరోసారి అనుచరులతో కలిసి వీరంగం వేశాడని వివరించారు. కీసర బందోబస్తు తర్వాత కేసు పరిశీలిస్తామని పోలీసులు నచ్చజెప్పి పంపించారు.


శివార్లలో ‘రక్తచరిత్ర’

నగర శివార్లలో మంగళవారం జరిగిన రియల్టర్ల జంట హత్యల కేసు తీవ్ర కలకలం రేపింది. ముందస్తు ప్రణాళికతో వారిని కిరాతకంగా కాల్చిచంపడం వెనుక కిరాయి ముఠాహస్తం కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. హత్యకు గురైన రాఘవేంద్రరెడ్డి కూడా ఓ కేసులో జైలు శిక్ష అనుభవించినట్లు తెలుస్తోంది. నగర శివార్లలో భూముల ధరలు అమాంతంగా పెరగడంతో రియల్‌ ఎస్టేట్‌ దందాలు కూడా పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో భూవివాదాల్లో రాజకీయనేతలు, మాఫీయా కూడా తలదూర్చుతుండడంతో ఘర్షణలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. సులువుగా డబ్బుసంపాదించేందుకు నేరస్థులు ఈ రంగాన్ని వాడుకుంటున్నారు. నగర, శివారు ప్రాంతాల్లో జరిగే అనేక భూవివాదాలు, సెటిల్‌మెంట్ల వెనుక వీరే ఉంటున్నారు. అలాగే అనేక చోట్ల కొందరు పోలీసులు కూడా భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న బడా నేతలు. అధికారుల బాగోతంపై గత ఏడాది ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో కొందరు తాత్కాలికంగా వెనుకకు తగ్గారు.

Updated Date - 2022-03-02T18:23:40+05:30 IST