ఓరుగల్లులో గూండా రాజ్‌!

ABN , First Publish Date - 2021-01-25T08:00:25+05:30 IST

కళల కాణాచి.. సిరుల మాగాణి అయిన ఓరుగల్లులో గూండారాజ్‌ నడుస్తోంది. సెటిల్మెంట్ల దందాకు తెరలేపిన ఓ కార్పొరేటర్‌ చేస్తున్న అరాచకాలు పాత రాతి యుగాన్ని తలపిస్తున్నాయి. అంగబలం..

ఓరుగల్లులో గూండా రాజ్‌!

ఓ కుటుంబానికి కార్పొరేటర్‌ వేధింపులు

మహిళల నిర్బంధం.. బలవంతంగా సంతకాలు

ఇంటిల్లిపాది పేర్లు రాసి.. కరపత్రాలు విడుదల

చేయని అప్పు చేశారంటూ ఇంటిపై రాతలు

అధికార పార్టీకి భయపడుతున్న పోలీసులు

అధికారులకు ట్వీట్‌ చేసినా.. స్పందన శూన్యం


కొమురయ్య భార్య, కోడలిని సదరు కార్పొరేటర్‌ ఓ కార్యాలయానికి పిలిపించి, అక్కడ ఓ గదిలో పెట్టి నిర్బంధించాడు. కొమురయ్య మనవడిని చంపేసి.. వారసుడు లేకుండా చేస్తామని కత్తితో మహిళలను బెదిరించాడు.


వరంగల్‌ రూరల్‌,  (ఆంధ్రజ్యోతి): కళల కాణాచి.. సిరుల మాగాణి అయిన ఓరుగల్లులో గూండారాజ్‌ నడుస్తోంది. సెటిల్మెంట్ల దందాకు తెరలేపిన ఓ కార్పొరేటర్‌ చేస్తున్న అరాచకాలు పాత రాతి యుగాన్ని తలపిస్తున్నాయి. అంగబలం.. అర్థబలంతో వ్యవస్థనే తన గుప్పిట్లో పెట్టుకుని బరితెగిస్తున్నాడు. అతనికి వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను కనీసం చూస్తే ఏమవుతుందోననే భయాందోళనలో పోలీసులు ఉన్నారు. ‘‘మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే.. లాగులు తడవాలి’’ అని స్వయానా సీఎం కేసీఆర్‌ చెప్పినా.. ఆ కార్పొరేటర్‌ పేరెత్తితే.. షీటీమ్స్‌ కూడా పత్తాలేకుండా పోతుంది. మహిళల్ని నిర్బంధించి, బలవంతంగా సంతకాలు తీసుకున్నా.. చర్యలు లేవు. డీజీపీ, మంత్రి కేటీఆర్‌కు బాధితులు ట్వీట్‌ చేసినా.. స్పందన శూన్యం. అలా ఆ కార్పొరేటర్‌ చేయని అప్పును తగిలించి ఓ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశాడు. ఆ కుటుంబ సభ్యుల పేర్లతో కరపత్రాలు ముద్రించి.. పరువును బజారుకీడ్చాడు. వారి ఇంటిపై ఎర్రటి పెయింట్‌తో అడ్డగోలు రాతలు రాయించాడు.వరంగల్‌ నగరంలోని రెవెన్యూకాలనీకి చెందిన ఎడ్ల కొమురయ్య ఆర్‌అండ్‌బీలో డీఈఈగా పనిచేసి 2018లో రిటైర్‌ అయ్యారు. 


ఆయన కుమారుడు నరేశ్‌ తన మిత్రుడితో కలిసి.. తెలంగాణ ట్రాన్స్‌కోకు ఇసుక సరఫరా చేసే సబ్‌-కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నగదు లావాదేవీలన్నీ నరేశ్‌ ఖాతా ద్వారా జరిగేవి. గత ఏడాది వరకు నరేశ్‌ వ్యాపారం సాఫీగా సాగినా.. లాక్‌డౌన్‌తో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో.. నరేశ్‌ మిత్రుడికి అతడి స్నేహితులతో ఆర్థికపరమైన తగాదాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నరేశ్‌ నెట్‌బ్యాంకింగ్‌ నుంచి మరో వ్యక్తికి ఆర్థిక లావాదేవీలు జరిగాయి. దీనితో నరేశ్‌కు సంబంధం లేకున్నా.. అతడే బాధ్యత వహించాలంటూ ఒత్తిళ్లు మొదలయ్యాయి. అప్పు తీసుకున్నట్లు నరేశ్‌ పేరిట ఎలాంటి పత్రాలు లేకపోవడంతో.. వారంతా నరేశ్‌ తండ్రి కొమురయ్యను టార్గెట్‌గా చేసుకున్నారు.ఈ వివాదంపై గత ఏడాది సెప్టెంబరులో సిద్దిపేట ప్రాంతంలో పంచాయితీ నిర్వహించారు. పంచాయితీ పెద్దలుగా ఉన్నవారు నరేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. అతడి జోలికి వెళ్లొద్దంటూ..నరేశ్‌ మిత్రుడిని బాధ్యుడిగా గుర్తించారు.


కార్పొరేటర్‌ రంగప్రవేశంతో..

సిద్దిపేటలో పంచాయితీతో సమస్య సద్దుమణిగిపోయిందని కొమురయ్య కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కానీ, అంతలోనే వరంగల్‌ నగరానికి చెందిన అధికార పార్టీ కార్పొరేటర్‌ రంగంప్రవేశం చేశాడు. వివాదాన్ని తాను సెటిల్‌ చేస్తానంటూ ముందుకొచ్చాడు. దాంతో సీన్‌ మారిపోయింది. అతడు కూడా.. నరేశ్‌ పేరిట ఎలాంటి అప్పు పత్రాలు లేకపోవడంతో.. కొమురయ్యను టార్గెట్‌గా చేసుకున్నాడు. కొమురయ్యే ఇసుక వ్యాపారంలో పార్ట్‌నర్‌ అన్నట్లుగా పత్రాలు సృష్టించాడు. అతడికి అప్పు ఇచ్చినట్లు స్టాంపు పత్రాలను తయారు చేశాడు. వాటిపై సంతకాలు చేయాలంటూ వేధించాడు. కొమురయ్య కుమార్తెను సైతం టార్గెట్‌గా చేసుకున్నాడు. సుబేదారి పోలీ్‌సస్టేషన్‌ సమీపంలో ఆమె స్కూటర్‌పై వెళ్తుండగా.. కారుతో ఢీకొట్టించాడు. ‘‘మీ సోదరుడి అప్పు సెటిల్‌ అయ్యేదాకా వేధింపులు తప్పవు’’ అని బెదిరించాడు. దీనిపై ఫిర్యాదు చేసినా షీటీమ్స్‌ పట్టించుకోలేదు.  


మహిళలను నిర్బంధించి సంతకాలు

కొమురయ్య కుటుంబంపై అరాచకాలను కొనసాగిస్తూనే.. సదరు కార్పొరేటర్‌ గత ఏడాది సెప్టెంబరు 7న కొమురయ్య భార్య, కొడలిని నక్కలగుట్ట ప్రాంతంలోని ఓ కార్యాలయానికి పిలిపించి, అక్కడ ఓ గదిలో పెట్టి నిర్బంధించాడు. కొమురయ్య మనవడిని చంపేసి.. వారసుడు లేకుండా చేస్తామని కత్తితో మహిళలను బెదిరించారు. తమకు రూ. 3.20 కోట్లు అప్పు ఉన్నట్లు సంతకాలు పెడితేనే వారిని వదిలిపెడతామంటూ కొమురయ్యకు కబురు పంపాడు. కొమురయ్యతో మూడు స్టాంపు పేపర్లు, 12 ప్రాంసరీ నోట్లపై సంతకాలు పెట్టించుకున్నాకే.. వారిని విడిచిపెట్టాడు. కొమురయ్య కోడలు రమ్య ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయినా.. స్పందన రాలేదు. దీంతో గవర్నర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగినాదీనివెనుక అధికార పార్టీ కార్పొరేటర్‌ ఉన్నాడని తెలుసుకుని ముఖం చాటేశారు.


ప్రేక్షక పాత్రలో పోలీసులు

మహిళల్ని గదిలో పెట్టి నిర్బంధించడం.. బాకీ ఉన్నట్లు బలవంతంగా స్టాంపు కాగితాలు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టించుకోవడంపై కొమురయ్య గత ఏడాది అక్టోబరు 5న పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఒత్తిడితో కేసు నమోదులో తాత్సారం జరిగింది. కొమురయ్య రూ. 6 కోట్లు అప్పు ఉన్నాడంటూ కరపత్రాలు ముద్రించి కాలనీలో పంపిణీ చేయించాడు ఆ కార్పొరేటర్‌. ఇంత జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. కంటితుడుపుగా డిసెంబరులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.


నాలుగు నెలలుగా బయటే ఉన్నా: రమ్య

నాలుగు నెలలుగా బయటే ఉంటున్నా. మహిళలను కాపాడుతామని పోలీసులు చెబుతుంటారు. మమ్మల్ని అర్ధరాత్రి వరకు నిర్బంధించారని ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. గోడలపై, కరపత్రాలపై మా ఫొటోలు వేసి పంచినా పట్టించుకోలేదు. నా ఏడాదిన్నర బాబును కత్తితో పొడిచి.. వారసుడు లేకుండా చేస్తామని బెదిరించారు. చివరకు ట్వీట్లు పెడితే వచ్చిన పోలీసులు కూడా నామమాత్రంగా విచారించి, ఒత్తిళ్లు రావడంతో తప్పుకొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. మా ప్రాణాలు పోయాక స్పందిస్తారా..?


మాకు రక్షణేది: కొమురయ్య

అధికార బలంతో చేయని అప్పును చేసినట్టుగా బలవంతంగా నాతో సంతకాలు చేయించుకున్నారు. వరంగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సుబేదారి పోలీ్‌సస్టేషన్‌కు వెళితే.. వారిపై రాజకీయ ఒత్తిళ్లున్నాయంటూ తప్పుకొన్నారు. మా ఇంటి గోడలపై నోటీసు పేరిట కుటుంబ సభ్యుల పేర్లతో నోటీసు రాసి క్షోభకు గురి చేశారు. మా పరువును తీసేశారు. ఏ సంబంఽధం లేని విషయంలో మమ్మల్ని బాధ్యుల్ని చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రాణ భయంతో ఇల్లు వదిలిపెట్టి తలో దిక్కున ఉంటున్నాం. మా కుటుంబానికి రక్షణ కల్పించాలి.

Updated Date - 2021-01-25T08:00:25+05:30 IST