అనుకున్నట్లే.. గుంటూరు కలెక్టర్ బదిలీ

ABN , First Publish Date - 2021-01-27T05:27:03+05:30 IST

అనుకున్నట్లుగానే ప్రభుత్వం కలెక్టర్..

అనుకున్నట్లే.. గుంటూరు కలెక్టర్ బదిలీ
కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌

ఎట్టకేలకు కలెక్టర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం 

ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు

ఇన్‌చార్జిగా జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) దినేష్‌కుమార్‌

ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌


గుంటూరు(ఆంధ్రజ్యోతి): అనుకున్నట్లుగానే ప్రభుత్వం కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ను ఎట్టకేలకు బదిలీ చేసింది. ఆయన్ని ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు జేసీ(రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌కి ఇన్‌చార్జిగా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలను కొత్తగా నియమించబోయే కలెక్టర్‌ నేతృత్వంలో నిర్వహిస్తారా లేక జాయింట్‌ కలెక్టర్‌తోనే పూర్తి చేయిస్తారా అన్నది రెండు రోజుల్లో తేలనున్నది. గత ఏడాది మార్చిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్‌ ఎన్నికల సందర్భంలో పల్నాడులో అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ఆయా సంఘ టనలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి పెద్దఎత్తున ఫిర్యా దులు వెళ్లాయి.


మాచర్లలో పరిస్థితిని పరిశీ లించేందుకు వచ్చిన టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావుపై హత్యాయత్నం జరిగింది. ఆ సంఘటనలతో కలెక్టర్‌ని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ వెంటనే కరోనా లాక్‌డౌన్‌ రావడం, ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వులని ప్రభుత్వం విభేదించింది. కలెక్టర్‌, మాచర్ల సీఐని కూడా బదిలీ చేయకుండా అలానే కొనసాగిస్తూ వచ్చింది. తాజాగా పంచాయతీ ఎన్ని కల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 29 నుంచి పంచాయతీ ఎన్నికలు జిల్లాలో నాలుగు విడతల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ని బదిలీ చేయాల్సిందిగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మంగళవారం సాయంత్రం వరకు కలెక్టర్‌గా శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ కొనసాగారు. కాగా రాత్రి 9 గంటల సమయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ కలెక్టర్‌ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు కలెక్టర్‌గా నియమించేందుకు ముగ్గురు అధికారుల పేర్లను సిఫార్సు చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించింది.  

Updated Date - 2021-01-27T05:27:03+05:30 IST