ఏళ్ల తరబడి సా...గుతూ..

ABN , First Publish Date - 2021-04-14T06:09:01+05:30 IST

బృందావన్‌ గార్డెన్స్‌లోని నార్ల ఆడిటోరియం, ఆర్టీసీ బస్టాండు ఎదురు గల రెడ్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి.

ఏళ్ల తరబడి సా...గుతూ..
అసంపూర్తిగా నిలిచిన బస్టాండు ఎదురు గల రెడ్‌ట్యాంక్‌

నార్ల ఆడిటోరియం, రెడ్‌ ట్యాంకులకు మోక్షమెప్పుడో?

అరకొరా పనులతో అంతే వదిలేశారు..

ఆయా నిర్మాణాలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి

గుంటూరు (కార్పొరేషన్‌) ఏప్రిల్‌ 13: బృందావన్‌ గార్డెన్స్‌లోని నార్ల ఆడిటోరియం, ఆర్టీసీ బస్టాండు ఎదురు గల రెడ్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ పనులను పక్కన పడేశారు. ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ నిర్మాణాలు నిలిచిపోవడంతో పాలకుల పనితీరుకు ఈ భవనాలు అద్దం పడుతున్నాయి. బృందావన్‌ గార్డెన్స్‌, గుంటూరు నగర మాజీ మేయర్‌ కొల్లి శారద తండ్రి నార్ల వెంకటేశ్వరరావు పేరుతో ఆడిటోరియం నిర్మాణానికి అప్పట్లో భూమి పూజ చేశారు. అయితే ఈ పనులు కేవలం శ్లాబ్‌తోనే నిలిచిపోయాయి. గత 22 ఏళ్లుగా ఈ ఆడిటోరియం నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. గతంలో ఈ ఆడిటోరియం నిర్మాణానికి రూ.80 లక్షల ఖర్చు అవుతోందని అధికారులు అంచనా వేశారు. అందులో రూ.40 లక్షలను కుటుంబ సభ్యులు చెల్లించారు. ఈ పనులు కేవలం పైకప్పు వరకు మాత్రమే వచ్చాయి. నిర్మాణపు అంచనాలు పెరిగినందువలన ఈ పనులు నిలిపివేస్తున్నట్లు అప్పట్లో జీఎంసీ అధికారులు తెలిపారు.  అఽధికారులు నిర్లక్ష్యంగా ఉండటంతో దాతలు ఇచ్చిన నిధులు కూడా మట్టిపాలయ్యాయి. గతంలో జీఎంసీ అధికారులకు మాజీ మేయర్‌ కొల్లి శారద పలుమార్లు నార్ల ఆడిటోరియం నిర్మాణ పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమె మాటలను పాలకపక్షం, అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రస్తుత నార్ల ఆడిటోరియం నిర్మాణం అనేకచోట్ల పగుళ్లు వచ్చి ప్రారంభానికి ముందే శిఽథిలావస్థకు చేరుకునే పరిస్థితి వచ్చింది.  

 రెడ్‌ట్యాంక్‌ నిర్మాణ పనులు

గుంటూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురు గల రెడ్‌ట్యాంక్‌ నిర్మాణ పనులు కూడా నిరుపయోగంగా నిలిచిపోయాయి. ఇందులో మెగా షాపింగ్‌ మాల్స్‌ నిర్మాణం చేపట్టి పెద్దఎత్తున అద్దెలకు ఇచ్చి తద్వారా ప్రజలకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ కేటాయించేందుకు కేటాయించారు. కాగా ఈ నిర్మాణ పనులు కూడా గడిచిన 20 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన నిలిచిపోయాయి. ఒకప్పుడు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ తీర్మానం ద్వారా ఈ నిర్మాణాలు చేపట్టాలని తొలుత భావించినప్పటికీ అమలుకు నోచుకోలేదు. అప్పట్లో అరాకొరాగా పనులు ప్రారంభించారు. తరువాత ఆ పనులను మరిచారు. దీంతో గుంటూరు నగరానికి జీఎంసీ తరఫున జరగాల్సిన మెగా కాంప్లెక్స్‌ నిర్మాణం ఆదిలోనే ఆగిపోయింది. ఇప్పటికీ దాని నిర్మాణ పనులు పట్టించుకున్న వారే లేకుండా పోయారు. నూతన పాలకవర్గం స్పందించి నార్ల ఆడిటోరియం, రెడ్‌ట్యాంక్‌ నిర్మాణ పనులను త్వరిగతతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 



Updated Date - 2021-04-14T06:09:01+05:30 IST