వారసత్వపు ఒత్తిడి లేదు..

ABN , First Publish Date - 2022-01-13T05:30:00+05:30 IST

తల్లి వైపు నుంచి చూస్తే- తాత సూపర్‌ స్టార్‌ (హీరో కృష్ణ).. మామ (మహేష్‌) మరో సూపర్‌స్టార్‌.. ఇక కుటుంబమంటారా? తండ్రి వైపు నుంచి చూస్తే- నాయనమ్మ మాజీ మంత్రి (గల్లా అరుణ).. తాత (గల్లా రామచంద్రనాయుడు) ప్రపంచప్రఖ్యాతి గాంచిన వాణిజ్యవేత్త..

వారసత్వపు ఒత్తిడి లేదు..

తల్లి వైపు నుంచి చూస్తే- తాత సూపర్‌ స్టార్‌ (హీరో కృష్ణ).. మామ (మహేష్‌) మరో సూపర్‌స్టార్‌.. ఇక కుటుంబమంటారా? తండ్రి వైపు నుంచి చూస్తే- నాయనమ్మ మాజీ మంత్రి (గల్లా అరుణ).. 

తాత (గల్లా రామచంద్రనాయుడు) ప్రపంచప్రఖ్యాతి గాంచిన వాణిజ్యవేత్త.. 

తండ్రి గుంటూరు ఎంపీ (గల్లా జయ్‌దేవ్‌)... అలాంటి వారసత్వం ఉన్న గల్లా అశోక్‌- ‘హీరో’ 

సినిమాతో సంక్రాంతికి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘అందరం చాలా టెన్షన్‌గా ఉన్నాం.. కానీ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకమూ ఉంది’’ అంటున్న జయదేవ్‌, పద్మావతి, అశోక్‌లను- 

‘నవ్య’ పలకరించింది..


అశోక్‌ నటుడు ఎలా అయ్యాడు?

పద్మావతి: అశోక్‌ చిన్నప్పుడు నాన్నగారి- ‘పండంటి సంసారం’ సినిమాలో నటించాడు. కెమెరా అంటే ఎటువంటి బెరుకూ ఉండేది కాదు. ఆ తర్వాత మహేష్‌- ‘నాని’ సినిమాలో కూడా నటించాడు. ఈ రెండూ వేసవి సెలవుల్లో సరదాగా చేసినవే! అశోక్‌ ఏడో తరగతిలోనే చదువుకోవటానికి సింగపూర్‌ వెళ్లిపోయాడు. నటన మీద ధ్యాస పోయి చదువులో పడ్డాడనుకున్నాం. కానీ సింగపూర్‌లో కూడా థియేటర్‌ ఆర్ట్స్‌ను ఒక పాఠ్యాంశంగా తీసుకున్నాడు. ‘‘డ్రామా క్లాసులో బాగా చేస్తున్నాడు... మంచి నటుడు అవుతాడు’’ అని థియేటర్‌ టీచరు చెప్పేవారు. తనకు నటనపైనే ఆసక్తి ఉందని మాకు అప్పుడే అర్థమయింది. అయితే చదువు కూడా ముఖ్యమే కదా. మా ఒత్తిడి మీద చదువుకోవటానికి అమెరికా వెళ్లాడు. అక్కడ కూడా రేడియో, ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ కోర్సు చేశాడు. భారత్‌కు వచ్చిన తర్వాత చెన్నైలో ఒక ఏడాది ఫైట్స్‌ నేర్చుకున్నాడు. సత్యానంద్‌గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. 

జయదేవ్‌: మాది బిజినెస్‌ ఫ్యామిలీ. పద్మ వాళ్లది సినిమా ఫ్యామిలీ. అశోక్‌ మా కంపెనీ 

(అమర్‌రాజా)లో ఇంటర్న్‌షిప్‌ చేశాడు. నా ఎన్నికల్లో కూడా పనిచేశాడు. అశోక్‌కు నటన సహజంగా వచ్చేసింది. అందుకే అశోక్‌ను తెర మీద చూస్తుంటే- ‘ఇది ఇతనికి తొలి చిత్రం’ అనిపించదు. అశోక్‌ నటనను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ‘ఎవరికి నచ్చిన పనిని వారు చేయాలనేది’ మా కుటుంబ సిద్ధాంతం. అందుకే తను నటించటానికి ఒప్పుకున్నాం..

అశోక్‌: నాకు చిన్నప్పటి నుంచి చదువు కన్నా నటనంటేనే ఇష్టం. సింగపూర్‌లో కానీ అమెరికాలో కానీ నా ఫోకస్‌ అంతా నటనమీదే ఉండేది. అమ్మనాన్న కూడా ప్రొత్సహించారు. 


మీరే స్వయంగా బ్యానర్‌ పెట్టి ఎందుకు సినిమా తీయాల్సి వచ్చింది?

పద్మావతి: అశోక్‌ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ‘‘మీ అబ్బాయితో సినిమా చేస్తాం’’ అని చాలామంది అడిగారు. కొన్ని కథలు విన్నాం. నచ్చలేదు. చాలా మంది కొత్త దర్శకులు వచ్చారు. అశోక్‌కు కొత్త. దర్శకుడు కూడా కొత్త అయితే ఇబ్బంది అవుతుందని ఆ ఆలోచన కూడా డ్రాప్‌ చేసుకున్నాం. చివరకు మనమే ఎందుకు నిర్మించకూడదనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలో ఆదిత్య శ్రీరాం వచ్చి కొన్ని కథలు చెప్పాడు. తను తీసిన మూడు సినిమాలూ మాకు నచ్చాయి. దాంతో ఒక కథను ఎంపిక చేసుకొని ‘హీరో’ మొదలుపెట్టాం. 

జయదేవ్‌: చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘అమర్‌రాజా’ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆ బ్రాండ్‌ బ్యానర్‌లో వచ్చే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఈ సినిమాకు సంబంధించిన మొత్తం పనంతా పద్మ చూసుకుంది. 


కొవిడ్‌ సమయంలో ఇబ్బంది అవ్వలేదా?

పద్మావతి: 2019 నవంబర్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. 2020 మార్చిలో కొవిడ్‌ వచ్చింది. అప్పటికి 50 శాతం షూటింగ్‌ పూర్తయింది. కొవిడ్‌ కొద్దిగా తగ్గిన తర్వాత మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టాం. సెకండ్‌ వేవ్‌ రావటంతో మళ్లీ ఆపేయాల్సి వచ్చింది. సినిమా పూర్తయిపోయింది.. విడుదల చేద్దామనుకొనే సమయానికి మళ్లీ కొవిడ్‌ మొదలయింది. అయినా సరే సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. నా చిన్నప్పుడు సంక్రాంతికి నాన్నగారి (కృష్ణ) సినిమా తప్పనిసరిగా విడుదలయ్యేది. ఆ తర్వాత కొన్నేళ్లు మహేష్‌ సినిమా విడుదలయ్యేది. ఈసారి అశోక్‌ సినిమా విడుదలవుతోంది. అందుకు చాలా ఆనందంగా ఉంది.

 

ఘట్టమనేని కుటుంబంలో సూపర్‌స్టార్స్‌ ఉన్నారు. ఆ వారసత్వం కొనసాగించాలనే ఒత్తిడి ఉందా? 

అశోక్‌: ‘హీరో’ షూటింగ్‌ మొదలుపెట్టకముందు ఆ ఒత్తిడి ఉండేది. తాత, మామలకు వీరాభిమానులున్నారు. వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే కథ, స్ర్కిప్ట్‌లపై ఎక్కువ శ్రద్ధ పెట్టా. ‘వచ్చాడు.. వెళ్లాడు’ అని మన గురించి అనుకోకూడదనే ఆలోచన చాలా ఒత్తిడికి గురిచేసేది. అయితే ఒక్కసారి సెట్‌లో అడుగుపెట్టాక ఇవేవీ నా మైండ్‌లో లేవు. ఒత్తిడి అంతా పోయింది. 

జయ్‌దేవ్‌: అమర్‌రాజా వైపు నుంచి పద్మకు అందిన సాయం తక్కువే! కృష్ణగారి కుటుంబానికి ఇండస్ట్రీలో ఉన్న గుడ్‌విల్‌ ఎంతో సహకరించింది.  మహే ష్‌, రానా, సురేష్‌, రాఘవేంద్రరావుగారు, ఆదిశేషగిరిరావుగారు.. ఇలా అనేకమంది ఇన్‌పుట్‌ ఇచ్చి, సహకరించారు. దీని వల్ల పని సులభమయింది. 

పద్మావతి: నేను చాలా కాలం చెన్నైలో ఉన్నా. సహజంగానే నాకు ఇండస్ట్రీలో స్నేహితులు చాలా తక్కువ. అయినా ఎంతో మంది ముందుకు వచ్చి సాయం చేశారు. దీని వల్ల ఒత్తిడి తగ్గింది.

 

‘హీరో’ను ఓటీటీకి ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదా?

పద్మావతి: నాకు వచ్చింది. కానీ అశోక్‌- ‘‘ఇంత కష్టపడి.. పెద్ద బడ్జెట్‌తో తీశాం. ఇది థియేటర్లలోనే విడుదల చేయాలి.. అవసరమైతే వెయిట్‌ చేద్దాం’’ అన్నాడు. జయ్‌దేవ్‌ కూడా తననే సపోర్టు చేశాడు. 

జయ్‌దేవ్‌: ఓటీటీలో రిలీజ్‌ చేస్తే డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. కానీ అశోక్‌కు మార్కెట్‌ ఏర్పడాలంటే థియేటర్‌లోనే విడుదల కావాలి. 

అశోక్‌: ఆ విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. దర్శకుడు శ్రీరాం- పెద్దతెరను దృష్టిలో ఉంచుకొనే ప్రతి ఫ్రేమ్‌ తీశాడు. ఓటీటీకి అనుకుంటే- సినిమా తీసే విధానమే మారిపోయి ఉండేది. 


గల్లా జయ్‌దేవ్‌

‘‘అశోక్‌ బాలనటుడిగా నటించినప్పుడు మా అమ్మగారు (గల్లా అరుణ) చాలా ఎంకరేజ్‌ చేశారు. మనవడిని సినిమాల్లోకి ప్రవేశపెట్టమని పద్మకు పదేపదే చెప్పేది. అమ్మ అయితే చాలా ఆనందంగా ఉంది. నాన్నగారికి మొదట్లో అంత ఇష్టం లేదు. కానీ ఇప్పుడు సినిమా రంగం గురించి తెలుసుకుంటున్నారు.’’ 

‘‘మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి షికాగోలో ఉండడం వల్ల నేను ఎప్పుడూ సంక్రాంతి సెలబ్రేషన్‌ ్స చేసుకోలేదు. భారత్‌కు తిరిగి వచ్చాకే సంక్రాంతి పండుగను జరుపుకొంటున్నాం. మా అమ్మగారు మా గ్రామంలో సంక్రాంతిని ఘనంగా జరుపుతారు. గ్రామంలో కుటుంబం అంతా కలిసి చేసుకొంటాం. ఎక్కడెక్కడో ఉండే వాళ్లంతా పండగకు ఊరుకి వస్తారు.’’

‘‘నటన.. వ్యాపారం.. రాజకీయాలు.. టీచింగ్‌.. ఇలా ఏ ఫీల్డ్‌లోనైనా ‘ది బెస్ట్‌’ ఇవ్వగలిగినవాడే సూపర్‌స్టార్‌. నేను అశోక్‌కు చెప్పేది కూడా అదే! ‘‘యాక్టర్‌ కావాలనుకుంటే బెస్ట్‌ యాక్టర్‌ అవ్వు... మధ్యలో ఆగిపోవద్దు’’ అని చెప్పా.’’ 


ఆ లోటు తీర్చలేనిది

అన్నయ్య రమేష్‌ లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ‘‘సినిమా ఎప్పుడు వస్తుంది?’’ అని అడుగుతూ ఉండేవాడు. చివరకు అన్నయ్య లేకుండా విడుదల చేయాల్సి వస్తోంది. ఈ విషాదం తరువాత సినిమా వాయిదా వేద్దామనుకున్నాం. నాన్నగారు, బాబాయ్‌ వద్దన్నారు. ‘‘వాడికి సినిమాలంటే ఇష్టం... ఇది మనం ఇచ్చే నివాళి’’ అన్నారు. 

పద్మావతి


పద్మావతి

‘‘నాన్నగారు చాలా క్రమశిక్షణగా ఉండేవారు. ఉదయం ఐదుకు లేచేవారు. శని, ఆదివారాలు మాతోనే గడిపేవారు. స్కూల్లో సంగతులు అడిగి తెలుసుకొనేవారు. శని, ఆదివారాల్లో షూటింగ్‌లు ఉంటే వెళ్లేవాళ్లం. నాన్న ఎప్పుడూ స్ట్రిక్ట్‌గా ఉండేవారు కాదు. నేను మాత్రం పిల్లల విషయంలో స్ట్రిక్ట్‌ అనే చెప్పాలి. పిల్లల వెంటపడి మరి చదివించేదాన్ని.’’ 

‘‘నాకు పెళ్లయినప్పటి నుంచి ఏటా సంక్రాంతికి ఆ ఊరు వెళ్తున్నాం. ‘‘మీరు ఎంత బిజీగా ఉన్నా సంక్రాంతికి మాత్రం ఊరికి రావాలి’’ అని అత్తయ్యగారు చెప్పారు. దాన్ని మేము పాటిస్తూ ఉంటాం. ముఖ్యంగా అక్కడి ఫుడ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తాం. ఈసారి మాత్రం సినిమా రిలీజ్‌ ఉండడంతో వెళ్లడానికి వీలు కావడం లేదు.’’ 

‘‘అశోక్‌కి నటన అంటే ఇష్టమని నాన్నగారికి ముందే తెలుసు. సినిమా అంటే ఇష్టముంది కాబట్టి అశోక్‌ తప్పకుండా సక్సెస్‌ అవుతాడని ఆయన నమ్మకం. అయితే ఫస్ట్‌ సినిమాకు ఏదైనా రీమేక్‌ ఉంటే చూసుకోమని చెప్పారు. కానీ రీమేక్‌ అయితే ఫ్రెష్‌గా ఉండదని మేం భావించాం. అదే నాన్నగారితో చెప్పాం. ‘‘ఈ మధ్యకాలంలో కొత్త డైరెక్టర్లు బాగా తీస్తున్నారు, మంచి నిర్ణయమే తీసుకున్నారు’’ అని అన్నారు. 


సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌ 

ఫొటోలు: లవకుమార్‌ 

Updated Date - 2022-01-13T05:30:00+05:30 IST