కనపడటం లేదు.. వినపడటం లేదు!

ABN , First Publish Date - 2021-05-19T09:22:30+05:30 IST

‘‘మీరు నాకు కనిపించడం లేదు! చీకటి పడిపోయింది’’... నచ్చని ప్రశ్న అడిగిన మీడియా ప్రతినిధులకు గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పిన సమాధానమిది! ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు...

కనపడటం లేదు.. వినపడటం లేదు!

  • గుంటూరు అర్బన్‌ ఎస్పీ వింత జవాబు
  • ‘అధికార’ మీడియాకు ఓపిగ్గా వివరణలు

గుంటూరు, మే 18: ‘‘మీరు నాకు కనిపించడం లేదు! చీకటి పడిపోయింది’’... నచ్చని ప్రశ్న అడిగిన మీడియా ప్రతినిధులకు గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పిన సమాధానమిది! ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ‘సీబీఎన్‌ ఆర్మీ’కి చెందిన ఇద్దరిని అరెస్టు చేసి... వారిని స్వయంగా ఎస్పీయే మీడియా ముందు హాజరుపరిచారు. కేసు వివరాలను వెల్లడించారు. కరోనా మ్యూటెంట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లో భయాందోళనలు సృష్టించారంటూ అందిన ఫిర్యాదుపై అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే మ్యూటెంట్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. ఆయనపై ఇటీవల టీడీపీ నాయకులు అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిత్రమేమిటంటే... ‘గుంపుగా వచ్చారు’ అంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసు పెట్టారు. మంత్రి అప్పలరాజుపై ఇచ్చిన ఫిర్యాదును లీగల్‌ ఒపీనియన్‌కు పంపామని తెలిపారు. ఈ నేపథ్యంలో, మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేశారా అని మంగళవారం అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.


అది  వినపడనట్లుగా ఆయన దాటవేసే  ధోరణి ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులు మళ్లీ బిగ్గరగా అడగడంతో... ‘‘లైట్‌ ఫెయిల్‌ అయ్యింది! మీరు నాకు కనపడటం లేదు’’ అని ఎస్పీ బదులిచ్చారు. మీడియా ప్రతినిధులు మరోసారి అదే ప్రశ్న అడగ్గా... ‘‘నాకు కనపడటం లేదు! మీరడిగేది వినపడటం లేదు’’ అంటూ వెళ్లిపోయారు. అంతకుముందు వరకు సీబీఎన్‌ ఆర్మీ యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకులకు సంబంధించి వైసీపీ అనుకూల చానల్‌, పత్రికల విలేకరుల అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన ఎంతో ఓపికగా, వివరంగా సమాధానాలు ఇవ్వడం గమనార్హం. మంత్రిపై కేసు మాటేమిటిని అని ప్రశ్నించగా... ఆయనకు ఏమీ కనిపించలేదు, వినిపించలేదు! ‘‘మీకు కొన్ని చానళ్లు, కొందరు విలేకరులే కనిపిస్తారు’’ అంటూ మీడియా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేసినా... పట్టించుకోకుండా వెళ్లిపోయారు.

Updated Date - 2021-05-19T09:22:30+05:30 IST