Abn logo
Sep 20 2021 @ 00:39AM

గురి చెప్పులు

గిరిగీసుకు కూకోబట్టే

గోతిలో కప్పల్లా అరుస్తోంది కాలం

గొప్పలు కూయొద్దు

తప్పులు గెలికి గెలికి రాచపుండు చేయొద్దు

తప్పిపోకుండా 

ఎవడూ తాటిబుర్రలో ఉచ్చబొయ్యలేడు


నడుస్తున్న బాట

నిటారుగా లేదు

వంపులుంటాయి

వంపు వంపు కాడా రంపులుంటాయి

ఓపిక కూలిందంటే

గుంపులోకి దూరి ఊళలేసే గుంటనక్కలు

గుడ్లప్పగించి కాసుకోనుండాయి


నడిచే దారిలో

ఇటొక చెప్పు

అటొక చెప్పు

దోవంతా ఎలా నడుస్తామో చెప్పు?


తాతలు నడిచి

తండ్రులు నడిచి

మనమంతా నడిచీ నడిచీ 

ఇంతదాంకా నడిచీ

చెప్పులు అరిగిపోయాని ఆందోళనొద్దు

ముళ్ళూ రాళ్లు

గుచ్చుకుంటున్నాయని అడుగు 

                        లాపొద్దు


మనవి కిర్రు చెప్పులు కావు 

జాతి ఎక్కుపెట్టిన గురి చెప్పులు

శతాబ్దాల మోసాలపై గుర్రు చెప్పులు


అరిగిపోయిన చెప్పుల్లో

వొరిగిపోనీ గురి ఉంది

దారిగెలిచేదాకా చెప్పులిడవద్దు

దారిదాటి మన యేటిపక్కన

కయ్య దున్నేదాక కాడిపడేయద్దు


దారెంబటి నడిచినంతసేపూ

కూడుతినే తావ కుమ్ములాటలొద్దు

వోడోడిగిన్నెలో 

వోడిబువ్వ వడ్డించుకుతింటూ

కూటికుండని యే కుక్కయినా నోట కరుచుకుపోతే

కూడబలుక్కుని పోయి నడ్డిరగతన్నాలి


గెవనం బెట్టుకుంటే మంచిది

నడవాల్సిన దూరం ఎంతో లేదు

గలాటాలొద్దు

నెత్తిమీదా నీలి ఆకాశం నిండా

గండు ముక్కుల కొండబారవలెగురుతున్నాయి.

పల్లిపట్టు నాగరాజు

99894 00881