కరోనా కష్టకాలంలో ‘గురుదక్షిణ’

ABN , First Publish Date - 2021-09-05T06:03:21+05:30 IST

కరోనాతో ఉద్యోగాలు కోల్పోయి కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న గురువులను పూర్వ విద్యార్థులు ఆదుకున్నారు

కరోనా కష్టకాలంలో ‘గురుదక్షిణ’
నిత్యావసర సరుకులతో టీచర్లు, సిబ్బంది

తిరుపతి(విద్య), సెప్టెంబరు 4: అక్షరాలు దిద్దించారు. జ్ఞానాన్ని అందించారు. సేవా స్ఫూర్తిని నింపారు. విలువలు నేర్పించారు. ఉన్నతికి బాటలు పరిచారు. అలాంటి గురువులు కరోనాతో ఉద్యోగాలు కోల్పోయారు. కుటుంబ పోషణకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఘటన బీటెక్‌ పూర్తిచేసిన నీలే్‌షకుమార్‌ అనే పూర్వ విద్యార్థిని కలచివేసింది. తిరుపతిలోని సురేంద్రారెడ్డి రాయలసీమ పబ్లిక్‌ స్కూల్‌లో చదివిన ఈయన తన స్నేహితులైన విష్ణువర్ధన్‌నాయుడు, ఽధూరి నిహారిక, గాదిరాజు శ్రావణ్‌, లోకేశ్‌, చిన్న కన్నా, భవాని, సౌమ్య, మైలు ప్రవీణ్‌, స్వప్న వడ్లమూడి, అమూల్యరెడ్డితో కలిసి కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు అండగా నిలిచి ‘గురుదక్షిణ’ ఇవ్వాలని భావించారు. ‘అభిమన్యు ది హోప్‌, భీష్మ ది సేవియర్‌’ పేర్లతో కొంత నగదుతోపాటు నెలకు సరిపడా నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, వైద్యసహాయం లాంటివి అందించారు. ఆ తర్వాత పాఠశాలల్లో పనిచేసే బోధనేతర ఉద్యోగులకూ భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో ‘సైలెంట్‌ హెల్ప్‌’ నినాదంతో ముందుకొచ్చారు. ఇలా ఈ యువబృందం తిరుపతి, విజయవాడ, నెల్లూరు, విశాఖతోపాటు హైదరాబాద్‌లో దాదాపు 560 కుటుంబాలకు సాయం అందించింది. 

Updated Date - 2021-09-05T06:03:21+05:30 IST