గురువులకు గురువు

ABN , First Publish Date - 2021-05-31T06:02:16+05:30 IST

ఉత్తర భారతదేశంలోని వ్యవస్థీకృత ప్రభుత్వాలకు, 1398లో జరిగిన తైమూర్‌ దండయాత్ర చరమ గీతం పాడింది. వాటిమూలంగా అక్కడ నిరసనలు, ఊచకోతలు, విధ్వంసాలు....

గురువులకు గురువు

ఉత్తర భారతదేశంలోని వ్యవస్థీకృత ప్రభుత్వాలకు, 1398లో జరిగిన తైమూర్‌ దండయాత్ర చరమ గీతం పాడింది. వాటిమూలంగా అక్కడ నిరసనలు, ఊచకోతలు, విధ్వంసాలు... ముఖ్యంగా ఆరాధన స్థలాల్లో విచ్చలవిడిగా సాగాయి. గురునానక్‌ అటువంటి సంకట సమయాల్లోనే లాహోర్‌ నుండి నలభై మైళ్ల దూరంలో ఉన్న నాన్‌ కానా సాహిబ్‌ గ్రామంలో 1469లో జన్మించాడు. దానిని డేరాబాబా నానక్‌ అని కూడా పిలుస్తున్నారు. అతని తండ్రి గ్రామ కరణం, పేరు లాలా కల్యాణ రాయ్‌, తల్లి తృప్తా దేవి. ఖత్రి (వర్తక/వైశ్య) కులానికి చెందినవారు. ఆ దంప తులకు ఇద్దరు పిల్లలు కొడుకు నానక్‌, కూతురు నానకి. 


బాల్యం నుండీ ఏ ప్రాపంచిక విషయాలూ గురునానక్‌ను ఆకర్షించలేదు. జీవితం గురించి తెలుసుకోవాలన్న తపన మాత్రం ముందు నుండీ ఎక్కువే. అరబ్బీ ఫారసీ మొద లైన భాషలు నేర్పించినా, ఏ విధమైన శ్రద్ధా వాటిల్లో చూపించకపోవడంతో, మార్పు వస్తుందన్న ఆశతో, కొన్నాళ్లు పశువులకాపరిగా కూడా తండ్రి అతనిని పెట్టాడు. 16ఏళ్ల ప్రాయంలో సులక్షణితో వివాహం జరిపించాడు. అతనికి ఇద్దరు కొడుకులు- శ్రీచంద్‌, లక్ష్మీదాస్‌. గృహస్థుగా ఉంటూ దేశసంచారం, ధ్యానం, దైవాన్ని కీర్తిస్తూ, అతని చుట్టూ సంఘటనలకు స్పందిస్తూ కవిత్వం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారితో కాలక్షేపం చేస్తూనే కాలం గడిపేవాడు. నవాబ్‌ దౌలత్‌ ఖాన్‌ లోధీ కార్యాలయంలో గణకుడుగా చేరినా, అదీ అతనికి సంతృప్తిపరచ లేదు. దొరికిన జీతంలో కావలిసినంత మాత్రమే ఉంచుకొని, మిగిలినదంతా పేదలకు పంచేవాడు. హిందువులు ముస్లిముల మధ్య సహోదరత్వాన్ని బోధించాడు. తన చుట్టూ సమాజాన్ని అందులోని అసమానతల్ని బాగా గమనించిన వాడు కావడంతో, వాటిని ప్రామాణికంగా చెప్పగలిగాడు.


గురునానక్‌ కవిత్వం రోజువారీ దినచర్యల నుండి తీసుకున్న ప్రతీకల, ప్రతిబింబాల కోశాగారం. సక్రమ మార్గంలో జీవితం నడిచేందుకు, దాని మూలంగా గొప్ప ఫలసాయాన్ని పొందేందుకు ఉపయోగపడే అనేక ప్రతీకల్ని, తోటపని పొలం పనుల నుండి, తీసుకున్నాడు. తన భాషలో సంస్కృతం, ఫారసీ సైతం వాడినా, అతను వాడిన పంజాబీ భాష మాత్రం అప్పట్లో ప్రచలితంగా ఉన్న లెహెందీ మాండలికమే. ఆ తరువాత అనువాదకులు అతని ఆధ్యాత్మిక సందేశాన్ని అందరికీ అందించే ప్రయత్నంలో, ఆ భాషని సరళీకరించారు. 


‘‘అన్నీ చూసే, అన్నీ తెలిసిన నదివి నువ్వు, నేను కేవలం చేపని, నీ లోతూ విస్తారం ఎలా తెలుసుకోగలను/ ఎక్కడెక్కడ చూసినా అక్కడక్కడ నువ్వు ఉన్నావు, నేను నీ నుండి విడిపోతే మరణిస్తాను/ జాలరి ఎవరో తెలియదు, వాని వలా తెలియదు/ కానీ దుఃఖం వస్తే, నిన్నే స్మరిస్తాను/ నువ్వు అన్నింటా ఉన్నా, చాలా దూరంలో ఉన్నావనుకుంటాను.’’


నిర్గుణ భక్తికి ముఖ్యమైన ప్రతిపాదకులు కబీర్‌, గురు నానక్‌. దానిని హిందువులు ముస్లిములు సైతం అనుసరిం చారు. కబీర్‌, ఇంకా ఇతర సంత్‌ల ఏకేశ్వరోపాసన వాదాన్నే గురునానక్‌ ప్రభోదించినా, ఇతర అనేక పరిణామాల మూలంగా, అతని బోధనలు ఒక సామూహిక సిక్కు మతం ఆవిర్భవించడానికి కారణమయింది.  


భక్తి ఉద్యమంలో గురునానక్‌ ఒక మార్గదర్శకుడు. ప్రేమ భక్తిని ఎక్కువగా సమర్థించాడు. సిక్కుల పవిత్ర గ్రంథంగా, వారి దేవునిగా భావింపబడే గురుగ్రంథ్‌ సాహిబ్‌ లోని అతని 974 కవితలు చాలావరకు ఛందోబద్ధంగానే ఉన్నాయి. అవి అనేక రాగాల్లో సమకూర్చబడ్డాయి. ‘బారామాహ’ అన్న పన్నెండు నెలల్లో విరహవేదనని, సర్వశక్తిమంతునిలో ఐక్యాన్ని కాంక్షిస్తూ సాగే కవిత్వ పద్ధతిని అతనే మొదటిసారిగా ప్రవేశపెట్టాడు.


బాబరు జరిపిన అమానుష హింస మీద, గురునాక్‌ రాసుకున్న చరణాలివి: ‘‘ఆ రాజులు సింహాలు, వారి మనుషులు వేటకుక్కలు, రాత్రులు రాత్రులు వెంటాడతాయి’’. మతం మీద అతని భావన ఆచరణాత్మకం, నైతికం. ప్రాపంచిక సుఖాలకోసం అర్రులు చాస్తూ అచేతనులవు తారని భావించాడు. యోగులు, పండితులు, ముల్లాలు, ఏ మతంలో ఎలాంటి వారైనా వారికి అది సరైన మార్గం కాదని హెచ్చరించాడు. విగ్రహారాధనని నిరాకరించాడు. తీర్థయాత్రల్ని ప్రోత్సహించలేదు. అవతారాల్ని అంగీకరించ లేదు. సాంప్రదాయివాదాన్ని, కర్మకాండల్ని నిరసించాడు. సామాజిక వంటశాలని లేదా వచ్చినవారందరికీ ఉచిత భోజన ఏర్పాటుని ప్రవేశపెట్టాడు. నిజానికి ఈ ‘‘లంగర్‌’’ పద్ధతిని ముందుగా సూఫీలే లోకప్రియం చేసారు. తరువాత దాన్ని గురునానక్‌ అమలుపరిచాడు.


సిద్ధులు, నాథ్‌ యోగులు, స్త్రీని అనేక అనర్థాలకు మూలంగా భావిస్తే, గురు నానక్‌ మాత్రం, సంసార శకటం సవ్యంగా నడిచేందుకు స్త్రీ పురుషుల్ని రెండు సమానమైన ముఖ్యమైన చక్రాలుగా అభివర్ణించాడు: ‘‘స్త్రీ నుండే జననం, స్త్రీ గర్భంలో నుండే పురుషుడు వచ్చాడు, స్త్రీతోనే సంబంధం, స్త్రీతోనే వివాహం/ స్త్రీ మూలానే జగత్తులో స్నేహం, స్త్రీ మూలానే రాబోయే తరాలు/ అతని స్త్రీ మరణిం చినపుడు, ఇంకొక స్త్రీని కోరుకుంటాడు, ఆమెతో బంధితుడవుతాడు/ మరెందుకు ఆమె చెడ్డదవుతుంది? ఆమె నుండే రాజులూ జన్మిస్తారు/ స్త్రీ నుండే స్త్రీ జన్మిస్తుంది, స్త్రీ లేకపోతే ఏమీ లేదు/ స్త్రీ లేకుండా ఉండేది సత్యం మాత్రమే.’’ 


మనిషిని హిందువుగానో, ముస్లింగానో, సిక్కుగానో కంటే, దేవుని సంపూర్ణ శరణులో మానవజాతి సేవలో మంచితనాన్ని సంపాదించేందుకు భూమి మీదికొచ్చిన ఒక జీవంగా చూసాడు. కులాలు మతాలు లాంటి భేదభావాలు దేవునికి లేవని, ఒక సార్వత్రికవాదాన్ని ప్రతిపాదించాడు.  


అతని మరణానికి పూర్వం 1539లో, ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లో, అతని శిష్యుడు లహీనా పేరును అంగద్‌గా మార్చి, అతడిని తన శరీరంలోని భాగం గానే భావించమని చెప్పి, అంగద్‌నే తన ఉత్తరాధికారిగా ప్రకటించాడు. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించడం లాంటిదేనని దానిని చెప్పుకున్నాడు. ఇది ఒక ప్రక్రియలా ఒక గురువు నుండి మరొక గురువుకు మారడం, పదవ గురువు వరకూ, ఒక గురుపరంపరగా, ఆ తరువాత గురుగ్రంథ్‌ సాహిబ్‌ వారి శాశ్వత గురువుగా ప్రకటించే వరకూ కొనసాగింది. గురునానక్‌ తరువాత తొమ్మండుగురు గురువులున్నారు. అందులో మరో అయిదుగురు గురువుల కవిత్వాలను, అయిదవ గురువు, గురు అర్జున్‌ దేవ్‌ ఒక పద్ధతిలో గురుగ్రంథ్‌ సాహిబ్‌లో సంకలన పరిచాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే అపూర్వ గ్రంథం అది. 1708 నుండి అనంతంగా కొనసాగుతున్న పదకొండవ గురువు గురుగ్రంథ్‌ సాహిబ్‌.  


అతని కాలంలో బాధలు, మతాంధత, ద్వేషాలు, తీవ్ర వాదం, అసత్యాలు, నయవంచనలు... అన్నింటినీ అత్యంత సమీపంగా చూసినవాడు కావడంతో అప్పటికే స్థిరపడి ఉన్న ఏ మతమూ అతనిని ఆకర్షించలేదు, వాటి మధ్య ఒక వంతెనలాంటి మతం ఉండాలని భావించాడు. అందులో శాంతి, ప్రేమ, సామరస్యం దేవుని ఆజ్ఞగా కొనసాగాలని కోరుకున్నాడు. అందుకోసం సత్యం, సంవేదన, ధార్మికత, సౌభ్రాతృత్వాన్ని తన బోధనలుగా చేసుకున్నాడు. గురునానక్‌ హిందూ కుటుంబంలో పుట్టినా ముస్లిముల ప్రభావం అతని మీద ఎక్కువ. అయినా అతను హిందు లేదా ముస్లిముల పద్ధతులను అనుసరించడం అతనికి నచ్చలేదు, అతని దేవుని మార్గం అతనిది. అతని దేవుడు వాహే గురు: ‘‘నీకు వేలకొద్దీ కళ్లు, అయినా ఒక్కటీ నీది కాదు, నీకు వేలకొద్దీ రూపాలు, అయినా ఒక్కటీ నీది కాదు/ నీకు వేలకొద్దీ పాదపద్మాలు, అయినా ఒక్కటీ నీది కాదు/ నీకు వేలకొద్దీ వాసనలు, ఒక్కటీ నీది కాదు/ అందరిలోనూ వెలుగు ఉంది, ఆ వెలుగు నువ్వే/ ఆ వెలుగు అందరిలోనూ ప్రకాశవంతంగా వెలుగు తుంది/ నీ రహస్యాలతో నేను మంత్రబద్ధుడనయాను’’


గురునానక్‌ జీవిత కాలంలో గురుగ్రంథ్‌ సాహిబ్‌ రూపు దిద్దుకోలేదు. అమృతసర్‌ లోని గోల్డెన్‌ టెంపుల్‌ కూడా లేదు. సిక్కు ఒక మతంగా పూర్తిగా నిలదొక్కుకోలేదు. అయితే అతని బోధనలు, అతని జీవితం, అతను సేకరించిన కవిత్వం, తన తరువాత మరో గురువుకు బాధ్యతల్ని అప్పగించే గురుపరంపర సంప్రదాయం, సిక్కు మతానికి చాలా బలమైన పునాదుల్ని వేసాయి. ఆ తరువాత గురువులు, గురుగ్రంథ్‌ సాహిబ్‌లో చేర్చిన వారి వారి కవితలను, వారి పేరు బదులు గురునానక్‌ పేరుతోనే ప్రకటించుకున్నారు. అది ఏ గురువుదో తెలుసుకుందుకు వీలుగా, మొదటి గురువు రచన మహల్లా 1, రెండవ గురువుది మహలా ్ల2 అని వర్గీకరించుకున్నారు. గురు గ్రంథ్‌ సాహిబ్‌లో గురువులవి కాకుండా చేర్చిన అనేక ఇతర హిందూ, ముస్లిం కవుల కవితలు గురునానక్‌ ఎంతో ప్రయాసకోర్చి సేకరించినవే. 13వ శతాబ్దపు బాబా ఫరీద్‌ సూఫీ కవిత్వాన్ని వారి వంశీకులనుండి సేకరించాడు. సంత్‌ కబీర్‌, సంత్‌ రవిదాస్‌ల దాదాపు సమకాలికుడు కావడంతో వారితో సాన్నిహిత్యంతోపాటు, వారి కవిత్వాన్ని వారి నుండే సేకరించాడు. సంత్‌ రవిదాస్‌ కవిత్వం అతను సేకరించినదే ప్రామాణికంగా మిగిలింది.  


గురునానక్‌ చివరి 30 సంవత్సరాలు భారతదేశంలో దేవుని సందేశాన్ని ప్రభోదిస్తూ గడిపి, పాకిస్తాన్‌లోని రావీనది ఒడ్డున ఉన్న కరతారపూర్‌లో 1539లో తుది శ్వాస విడిచాడు అక్కడి గారునానక్‌ సమాధిని, గురు ద్వారాని సందర్శించేందుకు వీలుగా, ఇటీవలే 9 నవంబర్‌ 2019లో, ఆ ప్రాంతానికి, మన దేశం నుండి మార్గాన్ని ఏర్పాటు చేసి యాత్రికులను అనుమతించారు.


మధ్యయుగం భక్తి కాలంలో, సిక్కు మతం లాంటి, ఒక కొత్త మతసృష్టే జరగడం, అది నిలదొక్కుకొని, ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకోవడం గొప్ప విశేషం. దానికి ఆది గురువు గురునానక్‌. అతని ఆధ్యాత్మిక చూపుతో, సామాజిక దృష్టితో విశ్వ ఐక్యతను అనవరతం ఆకాంక్షించాడు. బహుముఖీన మేధావి, అద్భుత మైన శైలి, శబ్దసంపద, మనోహరమైన పాటలతో, నిపుణుడైన సంగీతకారుడు, గొప్ప తత్వవేత్త, యోగి. బహుముఖాల ఆధ్యాత్మిక దర్శనాల్ని రేఖామాత్రంగానైనా, ఏ భక్తి కవులూ చూపించనంతగా తన కాలంలో చూపించాడు. సిక్కు మత స్థాపనకు కారకుడైన మహా ప్రవక్త. 

ముకుంద రామారావు

99083 47273


Updated Date - 2021-05-31T06:02:16+05:30 IST