గుట్కా గుట్టు రట్టు

ABN , First Publish Date - 2020-12-03T06:32:28+05:30 IST

నగర పరిధిలోగల గాజువాక ఆటోనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గుట్కా తయారీ కేంద్రంపై గాజువాక పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సంయుక్తంగా బుధవారం దాడులు జరిపారు.

గుట్కా  గుట్టు రట్టు
అమ్మకానికి సిద్ధం చేసిన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు


ఒడిశా నుంచి ముడిసరకు దిగుమతి

బ్రాండెడ్‌ పేర్లతో అమ్మకాలు

రూ.21 లక్షల విలువైన సరకు స్వాధీనం


ఆటోనగర్‌ (విశాఖపట్నం), డిసెంబరు 2: నగర పరిధిలోగల గాజువాక ఆటోనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గుట్కా తయారీ కేంద్రంపై గాజువాక పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సంయుక్తంగా బుధవారం దాడులు జరిపారు. భారీఎత్తున ఖైనీ, గుట్కా ప్యాకెట్లను, తయారీకి ఉపయోగిస్తున్న యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి గాజువాక ఏసీపీ రామాంజనేయులురెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాకకు చెందిన వెంకన్న, నారాయణలు గుట్కా తయారీ ద్వారా డబ్బు సంపాదించాలనుకున్నారు. అందుకోసం ఆటోనగర్‌ ‘డి’ బ్లాకులో గల రాజధాని కాటా (తూనిక కేంద్రం) సమీపంలో మూతపడిన ఒక పరిశ్రమకు చెందిన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. గుట్కా, ఖైనీ తయారీకి అవసరమైన ముడి సరకును ఒడిశాలోని బరంపూర్‌ ప్రాంతం నుంచి తీసుకువస్తున్నారు. గుట్కా తయారుచేసి ఇక్కడ ఏర్పాటుచేసుకున్న మూడు అధునాతన ఫొటో ఐడెంటిటీ యంత్రాలతో ప్యాకింగ్‌ చేసి, పారిశ్రామిక ప్రాంతంలోని పాన్‌ దుకాణాలు, కిరాణా షాపులకు గుట్టుగా సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం శ్రీశ్రీనివాసా ఎంటర్‌ప్రైజెస్‌...ఢిల్లీ, మా భైరవి ప్రొడక్ట్స్‌-బరంపురం చిరునామాలతో ‘యాపిల్‌ ఫ్రూట్‌’ పాన్‌మసాలా, ‘ఏటీఆర్‌ టొబాకో’, ‘గోకుల్‌ డీలక్స్‌’ బ్రాండ్‌ల పేర్లు ముద్రించి వున్న కవర్లను వినియోగిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా బియ్యం బస్తాల మాటున ముడి సరకును తీసుకువస్తున్నారు. తయారుచేసిన సరకును తిరిగి అదే బియ్యం బస్తాల మధ్యన దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. పోలీసులు దాడి సందర్భంగా రూ.21 లక్షలు విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు, ముడి సరకు స్వాధీనం చేసుకున్నారు. గాజువాక సీఐ మల్లేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు ఫుడ్‌ సేఫ్టీ అధికారి వేణుగోపాల్‌, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ నందాజీలు గుట్కా తయారీ కేంద్రం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. గుట్కా తయారీ కేంద్రాన్ని సీజ్‌ చేశారు. కాగా పోలీసులు దాడులకు వస్తున్నట్టు సమాచారం అందుకున్న నిర్వాహకులు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న సరకును జాయింట్‌ కలెక్టర్‌ అనుమతుల మేరకు నిర్వీర్యం చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడులలో ఎస్‌ఐలు గణేశ్‌, సూర్యప్రకాశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T06:32:28+05:30 IST