ఈవారం... గో కార్టింగ్‌

ABN , First Publish Date - 2020-11-22T06:06:48+05:30 IST

నగరంలో తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన ఆస్తులు, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) అధికారులు చేపడుతున్న కూల్చివేతల పర్వం ఈ వారం కూడా కొనసాగింది.

ఈవారం... గో కార్టింగ్‌
మంగమారిపేటలో గో కార్టింగ్‌ షెడ్డును కూల్చివేస్తున్న దృశ్యం

సీఆర్‌జెడ్‌ నిబంధనల పేరుతో బీచ్‌రోడ్డులో ఎమ్యూజ్‌మెంట్‌ పార్కు తొలగింపు

తెల్లవారుజాము నుంచి మొదలు

నగరంలో కొనసాగుతున్న కూల్చివేతల పర్వం

టీడీపీ నేతల ఆస్తులు, వ్యాపారాలే లక్ష్యం


విశాఖపట్నం/భీమునిపట్నం, నవంబరు 21: నగరంలో తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన ఆస్తులు, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) అధికారులు చేపడుతున్న కూల్చివేతల పర్వం ఈ వారం కూడా కొనసాగింది. భీమిలి బీచ్‌రోడ్డులో మంగమారిపేట వద్ద గల ‘గో కార్టింగ్‌ క్లబ్‌’ను అధికారులు శనివారం ఉదయం కూల్చివేశారు. కోస్ట ల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని పేర్కొంటూ గో కార్టింగ్‌లోని షెడ్‌లను ఎక్స్‌కవే టర్‌లతో తొలగించారు. ఆరేళ్లుగా కొనసాగుతున్న గో కార్టింగ్‌ను ఇప్పుడు తొలగించడానికి ప్రధాన కారణం టీడీపీ నేతకు చెందినది కావడమేనని ఆరోపణలు వినవస్తున్నాయి.


మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా గుర్తింపు పొందిన బొడ్డేటి కాశీవిశ్వనాథం మంగమారిపేటలో సుమారు 4.5 ఎకరాల భూమిని పదేళ్లకు ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి లీజుకు తీసుకున్నారు. 2014లో అక్కడ ‘గో కార్డింగ్‌ హబ్‌ఫర్‌ యూత్‌’ పేరుతో ఒక ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను ఏర్పాటుచేశారు. నగరవాసులతో పాటు పర్యాటకులు ఈ పార్కును సందర్శిస్తుంటారు. అటువంటిదాన్ని ఇప్పుడు జీవీఎంసీ అధికారులు అకస్మాత్తుగా కూల్చేయడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దానిపై ఉపాధి పొందుతున్న ఎంతోమంది రోడ్డునపడ్డారు. 


అది అక్రమ నిర్మాణం: జీవీఎంసీ

సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా గో కార్టింగ్‌ను ఏర్పాటుచేయడం వల్లే తొలగించామని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ డీసీపీ డి.రాంబాబు తెలిపారు. కాపులుప్పాడ సర్వే నంబరు 299/1, 301/1లో 4.44 ఎకరాల్లో సీఆర్‌జడ్‌ నిబంధనలకు విరుద్ధంగా గో కార్టింగ్‌ ట్రాక్‌ నిర్మించారన్నారు. దీనిపై పలుమార్లు పార్క్‌ నిర్వాహకుడైన ప్రమోద్‌కు నోటీసులు జారీ చేశామన్నారు. చివరగా ఈ నెల 17న కూడా నోటీసు ఇచ్చినప్పటికీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. గతంలో పార్కు వున్న ప్రాంతం పంచాయతీ పరిధిలో వుండగా...కొంతకాలం కిందటే జీవీఎంసీలో విలీనమైందన్నారు. విశాఖ నుంచి భీమిలి వరకూ సాగరతీరంలో సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తున్నామన్నారు. తిమ్మాపురం తీరంలో వున్న రొయ్యిల హేచరీలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. తొలగింపు కార్యక్రమంలో జీవీఎంసీ సిటీ ప్లానర్‌ ప్రభాకర్‌, డీసీపీ రాంబాబు, టీపీవో శ్రీలక్ష్మితోపాటు సిబ్బంది పాల్గొన్నారు. భీమిలి ఎస్‌ఐలు విజయకుమార్‌, రాంబాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటైంది.


ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: గో కార్టింగ్‌ జీఎం

తమకు ఇంతవరకూ జీవీఎంసీ అధికారులు ఒక్కనోటీసు కూడా ఇవ్వలేదని గో కార్టింగ్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రావణ్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఉదయం కూల్చివేతలు జరుగుతున్నాయని తెలిసి, తాము అవాక్కయ్యామన్నారు. ప్రైవేటు వ్యక్తి వద్ద నుంచి జిరాయితీ భూమిని లీజుకు తీసుకుని సుమారు రూ.80 లక్షలతో వినోదాన్ని అందించేలా ఈ పార్కును ఏర్పాటు చేశామన్నారు. హడావిడిగా తెల్లవారుజామున పోలీసులతో వచ్చి కూల్చేయడం దారుణమని వాపోయారు.

Updated Date - 2020-11-22T06:06:48+05:30 IST