గ్రేటర్‌ ఎన్నికలపై మహా సందేహం

ABN , First Publish Date - 2020-11-22T05:55:47+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుండడంతో గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధి, ఎన్నికల నిర్వహణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

గ్రేటర్‌ ఎన్నికలపై మహా సందేహం
అనకాపల్లి వ్యూ

‘అనకాపల్లి’ జిల్లా కేంద్రం కానున్న నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో ఉంటుందా? లేదా? అనే అంశంపై భిన్న వాదనలు 

కొత్త జిల్లా కేంద్రంగా కార్పొరేషన్‌/మునిసిపాలిటీ ఏర్పాటుచేయదలిస్తే ఆ ఐదు వార్డులను వదులుకోవలసిందే...

అదే జరిగితే...మళ్లీ వార్డుల పునర్విభజన

జీహెచ్‌ఎంసీ మాదిరిగా జీవీఎంసీ రెండు జిల్లాల్లోనూ ఉంటుందని మరికొందరి అభిప్రాయం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుండడంతో గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధి, ఎన్నికల నిర్వహణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో వున్న అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకానున్నందున...ఆ జోన్‌లోని ఐదు వార్డులను వదులుకోవాల్సి వుంటుందని, దాంతో మళ్లీ వార్డుల పునర్విభజన చేయాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం...గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మాదిరిగా జీవీఎంసీ కూడా రెండు జిల్లాల పరిధిలో వుంటుందని, పునర్విభజన ఏమీ అక్కర్లేదని అంటున్నారు. ఒకవేళ వార్డుల పునర్విభజన చేయాల్సి వస్తే మాత్రం మరో ఏడాదిపాటు జీవీఎంసీకి ఎన్నికలు జరిగే అవకాశం లేనట్టేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 


జీవీఎంసీకి చివరిసారిగా 2007లో ఎన్నికలు జరిగాయి. 2012లో ఎన్నికలు జరగాల్సి వున్నప్పటికీ భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీలతో పాటు ఐదు పంచాయతీల విలీనంపై కోర్టు కేసుల నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇంతలో కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల ప్రక్రియ ఆగిన దశ నుంచి ప్రారంభిస్తారా? లేక కొత్తగా నోటిఫికేషన్‌ విడుదల చేసి, మళ్లీ నామినేషన్లు స్వీకరిస్తారా?...అనే దానిపై ఇప్పటివరకూ అందరూ చర్చించుకున్నారు. ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. పార్లమెంట్‌ నియోజకవర్గం కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ లెక్కన చూస్తే...జీవీఎంసీలో వున్న అనకాపల్లి జిల్లా కేంద్రం కాబోతోంది. 


మళ్లీ వార్డుల పునర్విభజన తప్పదా?

జీవీఎంసీలో అనకాపల్లి మునిసిపాలిటీని విలీనం చేసిన తర్వాత ఈ ఏడాది జనవరిలో ప్రతి 19,410 మంది జనాభాకు ఒక వార్డు వుండేలా పునర్విభజన చేశారు. దీనిపై నోటిఫికేషన్‌ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, స్వల్ప సవరణల తర్వాత 98 వార్డులను నిర్ధారిస్తూ గెజిట్‌ జారీచేశారు. దీని ప్రకారం అనకాపల్లి జోన్‌ పరిధిలో ఐదు (80, 81, 82, 83, 84) వార్డులు ఏర్పాటయ్యాయి. అయితే అనకాపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటై...ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కలిపి కార్పొరేషన్‌గానో, మునిసిపాలిటీగానో ఏర్పాటుచేస్తే...ఆయా వార్డులను జీవీఎంసీ నుంచి తొలగించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మళ్లీ వార్డుల పునర్విభజన చేయాల్సి వుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం వేరే జిల్లాలోకి వెళ్లిపోయినంత మాత్రాన ఆ వార్డులను జీవీఎంసీ పరిధి నుంచి మినహాయించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మూడు జిల్లాల పరిధిలో విస్తరించి వున్న విషయాన్ని ఉదహరిస్తున్నారు.


స్పష్టంగా చెప్పలేమంటున్న అధికారులు

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో వార్డుల పునర్విభజన చేయాల్సి వస్తే మాత్రం మరో ఏడాది పాటు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అనకాపల్లి జోన్‌ వేరే జిల్లాలోకి వెళ్లిపోతే వార్డుల పునర్విభజన చేయాలా? అక్కర్లేదా? అనే విషయంపై స్పష్టంగా ఏమీ చెప్పలేమని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపైనే ఆధారపడి వుంటుందని పేర్కొంటున్నారు. ఒకవేళ కొత్త జిల్లాల  ఏర్పాటు తర్వాతే జీవీఎంసీకి ఎన్నికలు అనుకుంటే...ఏప్రిల్‌లో జనాభా లెక్కలు ప్రారంభమవుతాయి కాబట్టి, మరో ఏడాదిపాటు ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని అన్నారు.

Updated Date - 2020-11-22T05:55:47+05:30 IST