రంగంలోకి ర్యాపిడ్‌ రియాక్షన్‌ టీమ్స్‌

ABN , First Publish Date - 2020-04-05T09:36:44+05:30 IST

కరోనా నియంత్రణకు జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ర్యాపిడ్‌ రియాక్షన్‌ టీమ్‌(ఆర్‌ఆర్‌టీ)లకు రూపకల్పన చేశారు.

రంగంలోకి ర్యాపిడ్‌ రియాక్షన్‌ టీమ్స్‌

కరోనా నియంత్రణకు జీవీఎంసీ చర్యలు

నగర పరిధిలో 60 ప్రత్యేక బృందాలు

ప్రతి ఐదు వార్డులకు ఒకటి...

ప్రతి బృందంలో వైద్యుడు, మరో ముగ్గురు సిబ్బంది

అనుమానిత కేసుల గుర్తింపు ప్రధాన బాధ్యత

నేటి నుంచి విధులకు..

 

విశాఖపట్నం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణకు జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ర్యాపిడ్‌ రియాక్షన్‌ టీమ్‌(ఆర్‌ఆర్‌టీ)లకు రూపకల్పన చేశారు. జీవీఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ పక్కాగా అమలయ్యేలా చూడడం, ప్రజలు భౌతిక దూరం పాటించేలా చేయడం, కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులను గుర్తించి, వారిని ఆస్పత్రులకు తరలించడం వంటి బాధ్యతలను ఆయా బృందాలు చూస్తాయి. వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌, పాడేరు సబ్‌కలెక్టర్‌తో కలిసి శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ పరిధిలో 60 బృందాలను ఏర్పాటు చేశారు.


ఒక్కో బృందంలో వైద్యుడితోపాటు ఆరోగ్య కార్యకర్త(మగ), వాహనం డ్రైవరు, టౌన్‌ప్లానింగ్‌ నుంచి ఒకరిని నియమించారు. జీవీఎంసీ పరిధిలో ప్రతీ ఐదు వార్డులను ఒక్కో బృందానికి అప్పగించారు. ఒక షిఫ్టులో 20 బృందాలు చొప్పున మూడు షిప్టుల్లో ఆయా బృందాలు పనిచేస్తాయి. ఆయా బృందాలు తమకు కేటాయించిన ఐదు వార్డుల్లో ప్రజలు గృహనిర్భందంలో ఉండడం, అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు భౌతికదూరం పాటించేలా చూడడం, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించాల్సి ఉంటుంది. అలాగే తమ పరిధిలోని ఏదో ఒక వార్డు సచివాలయంలో ఆఫీస్‌ ఏర్పాటు చేయాలి. అక్కడికి ఫోన్‌ ద్వారా వచ్చిన సమాచారం స్వీకరించడం, ప్రజల అనుమానాలను నివృత్తిచేయడం, అలాగే సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.


  వీరందరికీ  ఆదివారం నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ శాస్త్రిని జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశించారు. బృందాల్లో నియమించిన వైద్యులుగానీ, ఇతర సిబ్బంది గానీ వెంటనే రిపోర్టు చేయకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తిరుపతిరావు హెచ్చరించారు. ఆంధ్రామెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ మాట్లాడుతూ బృందంలోని సభ్యులంతా పరస్పర సహకారంతో పనిచేసి కరోనాకు అడ్డుకట్ట వేయాలని  సూచించారు. ఈ సమావేశంలో పాడేరు సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, డీటీసీ రాజారత్నం, అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి, టౌన్‌ప్లానింగ్‌ డీసీపీలు ప్రభాకర్‌, రాంబాబు, జోనల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-05T09:36:44+05:30 IST