Abn logo
Oct 18 2020 @ 10:40AM

ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం

Kaakateeya

ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మార్గంలో దుకాణాల తొలగింపు

చిరు వ్యాపారులపై ‘మహా’ ప్రతాపం

నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత

తెల్లవారుజామున జీవీఎంసీ, పోలీస్‌ సంయుక్త ఆపరేషన్‌

యాభై, అరవై ఏళ్లుగా ఉంటున్న తమను ఉన్నఫలంగా రోడ్డునపడేశారంటూ బాధితుల ఆక్రోశం 

రాజకీయకక్ష సాధింపేనని ఆరోపణ

తొలగింపులను ఆపాలంటూ ఎక్స్‌కవేటర్‌ ముందు ఎమ్మెల్యే వెలగపూడి బైఠాయింపు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి):

సమయం : తెల్లవారుజామున నాలుగు గంటలు

    స్థలం : ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ రోడ్డు

...వంద మంది గ్రేటర్‌ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది రెండు ఎక్స్‌కవేటర్‌లు, మూడు లారీలతో అక్కడకు చేరుకున్నారు. వారికి సహాయంగా మరో వంద మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది, రోప్‌ పార్టీ సభ్యులు వచ్చారు. అక్కడ రహదారి పక్కనున్న ఒక్కో షెడ్‌లోకి టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది వెళ్లి, నిద్రపోతున్న వారిని లేపి బయటకు తీసుకురావడం ప్రారంభించారు. మరికొందరు ఇంట్లోని సామగ్రి బయటకు తెచ్చి పడేయడం ప్రారంభించారు.మరోవైపు ఎక్స్‌కవేటర్‌ ఒక్కో షెడ్‌ను కూల్చివేస్తోంది. కాసేపటికి తమ గూడు చెదిరిపోతుందనే విషయం అర్థమవ్వడంతో నివాసితులు అందరూ గుండెలు బాదుకుంటూ...కొంత సమయం ఇస్తే తామే ఖాళీ చేస్తామని వేడుకున్నారు. అయినా అధికారులు కనికరం చూపకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు సమాచారం అందిం చారు. ఆయన క్షణాల్లో అక్కడకు చేరుకుని ఎక్స్‌కవేటర్‌కు అడ్డంగా బైఠాయించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. 


ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల రహదారిలో... నీటి పారుదల శాఖకు చెందిన స్థలంలో సుమారు 26 షెడ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆరు దశాబ్దాలుగా అక్కడ కొనసాగుతున్నాయి.కొంతమంది తమ షెడ్‌ ముందుగదిలో జెరాక్స్‌ మిషన్‌, పాన్‌షాప్‌, టీ కొట్టు వంటివి ఏర్పాటుచేసుకుని, వెనుక గదిలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. అయితే వీరంతా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు అనే భావన స్థానిక వైసీపీ నేతల్లో ఉంది. దీంతో అవన్నీ ఆక్రమణలేనని, తొలగించాలని జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అక్కడకు చేరుకుని తొలగింపు చర్యలు ప్రారంభించారు. ఈ సమయంలో షెడ్లలో ఉన్నవారంతా  ఉన్నఫలంగా తమను రోడ్డునపడేస్తే ఎక్కడ తలదాచుకుంటామంటూ గుండెలవిసేలా రోదించారు. దుకాణాల తొలగింపు చేపట్టొందంటూ కోర్టు కొన్నాళ్ల కిందట ఒక ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చిందంటూ ఒక దుకాణ దారుడు...పోలీసులకు, జీవీఎంసీ అధికారులకు వాటి ప్రతులను చూపించినా పట్టించుకోకపోవడం విశేషం.


ఎక్స్‌కవేటర్‌కు అడ్డంగా ఎమ్మెల్యే వెలగపూడి

ఆక్రమణల తొలగింపు విషయం తెలిసి ఎమ్మెల్యే వెలగపూడి అక్కడకు చేరుకున్నారు. ఎక్స్‌కవేటర్‌కు అడ్డంగా బైఠాయించి తొలగింపు చర్యలను నిలిపివేయాలని కోరారు. రాజకీయంగా ఏదైనా వుంటే తనతో చూసుకోవాలని, అమాయకులపై ప్రతాపం చూపడం తగదన్నారు. ఆక్ర మణలు తొలగించాలనుకుంటే ముందుగా నోటీసు ఇవ్వాలని, అదేమీ లేకుండా తెల్లవారుజామున  షెడ్లను కూల్చివేయడం దారుణమన్నారు. అయినా పోలీసులు వలయంగా ఏర్పడి వెలగపూడిని నిర్బంధించి, తొలగింపు ప్రక్రియ పూర్తిచేశారు. ఇదే ప్రాంతంలో పూర్తిగా నివాసం కోసం ఏర్పాటుచేసుకున్న రెండు షెడ్లను మాత్రం కూల్చివేయకుండా విడిచిపెట్టడం విశేషం.


Advertisement
Advertisement