మహిళల చేతికి ‘మహానగరం’

ABN , First Publish Date - 2021-05-08T05:39:52+05:30 IST

ఊహించినట్టే జరిగింది. వరంగల్‌ మహా నగర పాలక సంస్థ మేయర్‌గా రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక తీవ్ర ఉత్కంఠ రేపిన డిప్యూటీ మేయర్‌ పదవి రిజ్వానా షమీమ్‌కు దక్కింది.

మహిళల చేతికి ‘మహానగరం’

జీడబ్ల్యుఎంసీ మేయర్‌గా గుండు సుధారాణి ఏకగ్రీవ ఎన్నిక
డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్‌
పోటీ లేకుండానే ఎన్నిక
రెండు పదవుల్లో మహిళలు... బల్దియా చరిత్రలో ప్రథమం
కొవిడ్‌ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వేడుక
సామూహికంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్పొరేటర్లు
కరోనా బారిన పడిన 9మంది వర్చువల్‌గా ప్రమాణం
నూతన సారథులను అభినందించిన మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌, గంగుల


వరంగల్‌ సిటీ, మే 7 : ఊహించినట్టే జరిగింది. వరంగల్‌ మహా నగర పాలక సంస్థ మేయర్‌గా రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక తీవ్ర ఉత్కంఠ రేపిన డిప్యూటీ మేయర్‌ పదవి రిజ్వానా షమీమ్‌కు దక్కింది. బల్దియా చరిత్రలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను ఇద్దరు మహిళలు చేపట్టడం ఇదే ప్రథమం. గత నెల 30న జరిగిన జీడబ్ల్యుఎంసీ ఎన్నికల్లో 66 డివిజన్లకు గాను టీఆర్‌ఎ్‌సకు 48 డివిజన్లు దక్కగా, బీజేపీకి 10, కాంగ్రె్‌సకు 4 సీట్లు దక్కిన విషయం విదితమే. దీంతో టీఆర్‌ఎస్‌ ఎలాంటి పోటీ లేకుండానే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను కైవసం చేసుకుంది. దీంతో జీడబ్ల్యుఎంసీపై వరుసగా రెండోసారి ‘గులాబీ’ జెండా ఎగిరినట్లయింది.

వరంగల్‌ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణలోని ఇండోర్‌ స్టేడియం ప్రాంగణంలో శుక్రవారం తొలుత సభ్యుల ప్రమాణ స్వీకారం, అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక జరిగింది.  అదనపు కలెక్టర్‌, ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సంధ్యారాణి ప్రమాణ స్వీకారం చేయించారు.  రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పరిశీలకుడిగా ఐఏఎస్‌ అఽధికారి కిషన్‌, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు తదితర అధికారులు పాల్గొన్నారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఎంపీ పసునూరి దయాకర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, అరూరి రమేష్‌, చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్య హాజరయ్యారు. కొవిడ్‌ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో హాజరు, బందోబస్తు, పకడ్బందీ చర్యలను అధికార యంత్రాంగం చేపట్టి కార్యక్రమాన్ని పూర్తి చేసింది.   

కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం
జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో గెలిచిన 66  మంది కార్పొరేటర్లుగా బాధ్యతలు చేపట్టారు. కొవిడ్‌ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సంధ్యారాణి మధ్యాహ్నం 3గంటలకు సభ్యులందరి చేత సామూహిక ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం కార్పొరేటర్లుగా నియమితులైనట్లు అధికారికంగా ప్రకటించారు. కొందరు హిందీ, ఇంగీషులో ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా బారిన పడిననూతన కార్పొరేటర్లు బొంగు అశోక్‌, దేవరకొండ విజయలక్ష్మి, తూర్పాటి సులోచన, గద్దె బాబు, ఓని స్వర్ణలత, మహ్మద్‌ ఫుర్ఖాన్‌, మరుపల్ల రవి, గుండు చందన, షర్తాజ్‌ బేగంలు వీడియో కాల్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. వీరి వద్దకు పీపీఈ కిట్లు ధరించిన లైజన్‌ ఆఫీసర్లు వెళ్లి ఈ తంతు పూర్తి చేయించారు. ప్రమాణ స్వీకార ప్రక్రియ 3:25 గంటలకు ముగిసింది. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత కాంగ్రెస్‌, బీజేపీ కార్పొరేటర్లు మేయర్‌, డిప్యూటీ ఎన్నికలో పాల్గొనకుండా బయటకు వచ్చేశారు. మొత్తం కార్యక్రమం 3 గంటల నుంచి 4 గంటల వరకు... అంటే గంట వ్యవధిలో ముగిసింది.

ఎన్నిక ప్రక్రియ...
మేయర్‌ ఎన్నిక ప్రక్రియ 3.30 గంటలకు ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన విప్‌గా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి  ఫారం-బి సమర్పించినట్లు ప్రకటించారు. మిగతా పార్టీలెవరూ సమర్పించలేదని ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సంధ్యారాణి ప్రకటించారు. నూతన కార్పొరేటర్లు 66 మంది, ఎక్స్‌ అఫీషియో సభ్యులు 6గురు కలుపుకొని 72 మందిలో 36 మంది సభ్యుల హాజరు ఉంటే కోరమ్‌ ఉన్నట్టుగా భావిస్తామని,  నిర్దేశిత సంఖ్య కంటే అధికంగానే ఉన్నందున  ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

మేయర్‌గా 29వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ గుండు సుధారాణిని 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఇండ్ల నాగేశ్వర్‌ రావు ప్రతిపాదించారు. 18వ డివిజన్‌ కార్పొరేటర్‌ వస్కుల బాబు బలపరిచారు.  ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో 3.39 గంటలకు మేయర్‌గా గుండు సుధారాణి ఎన్నికైనట్లు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించారు. ఈ మేరకు అధికార తంతును పూర్తి చేశారు. డిప్యూటీ మేయర్‌గా టీఆర్‌ఎస్‌ 36వ డివిజన్‌ కార్పొరేటర్‌ రిజ్వానా షమీమ్‌ను 16వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుంకరి మనీషా శివకుమార్‌ ప్రతిపాదించారు. 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోయినపల్లి రంజిత్‌రావు బలపరిచారు.  అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో 3.46 గంటలకు రిజ్వానా షమీమ్‌ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు.  సభ్యులు చేతులు ఎత్తి  అంగీకారం తెలియచేశారు. కొవిడ్‌ బారిన పడిన టీఆర్‌ఎస్‌ సభ్యులు వీడియో కాల్‌ ద్వారా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు చేతులెత్తి మద్దతు తెలియచేశారు.  అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.

6 నెలల్లో కొత్త రూపు: మంత్రి ఎర్రబెల్లి
ప్రమాణ స్వీకారం, ఎన్నిక ప్రక్రియ అనంతరం జీడబ్ల్యూఎంసీ కార్యాలయ ప్రాంగణం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. ఆరు నెలల్లోనే నగరంపై కొత్త పాలకవర్గం మార్కు కనిపిస్తుందని అన్నారు.  ‘ఇప్పటికే నగరం అభివృద్ధితో పరుగులు పెడుతోంది.. ఎన్నికలు ముగిశాయి.. అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించి ఆరు నెలల్లో నగరానికి కొత్త రూపు తెస్తాం.. కొత్త పాలకవర్గ సభ్యులపై కరోనా నియంత్రణ బాధ్యతలు ఉన్నాయి.. ప్రతి డివిజన్‌లో నియంత్రణ చర్యలు చేపట్టడంపై కార్పొరేటర్లు శక్తి మేరకు కృషి చేయాలి.. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి..’ అని ఆకాంక్షించారు.


బృహత్తర ప్రణాళికతో నగరాభివృద్ధి
- గుండు సుధారాణి, జీడబ్ల్యుఎంసీ నూతన మేయర్‌

మేయర్‌గా బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అందరి సహకారం మరువలేను. ప్రతి ఒక్కరి సహకారం, సూచనలతో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తా. బృహత్తర ప్రణాళికతో వరంగల్‌ నగరాభివృద్ధికి కృషి చేస్తాం. ప్రజల సమస్యల పరిష్కారం, నగరాభివృద్ధి అజెండాగా బాధ్యతలు నిర్వహిస్తా.







Updated Date - 2021-05-08T05:39:52+05:30 IST