జీడబ్ల్యుఎంసీ ఎన్నికలకు నమోదైన ఓటర్ల తాజా సంఖ్య 6 లక్షల 52వేలు

ABN , First Publish Date - 2021-04-09T07:01:06+05:30 IST

జీడబ్ల్యుఎంసీ ఎన్నికలకు నమోదైన ఓటర్ల తాజా సంఖ్య 6 లక్షల 52వేలు

జీడబ్ల్యుఎంసీ ఎన్నికలకు నమోదైన ఓటర్ల తాజా సంఖ్య 6 లక్షల 52వేలు
జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో ఓటర్ల ముసాయిదా ప్రదర్శన, ముసాయిదాలోని లోపాలను కమిషనర్‌కు వివరిస్తున్న వివిధ రాజకీయ పార్టీల నేతలు

పురుషులు 3,22,918, మహిళలు 3,29,872

ముసాయిదా విడుదల చేసిన అధికారులు

అభ్యంతరాలు సమర్పించాలని కమిషనర్‌ సూచన

14న తుది జాబితా వెల్లడి

ఓట్లు గల్లంతయ్యాయంటూ ఫిర్యాదుల వెల్లువ


వరంగల్‌ సిటీ, ఏప్రిల్‌ 8 : గ్రేటర్‌ వరంగల్‌లోని 66 డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల ముసాయిదాను జీడబ్ల్యూఎంసీ ప్రకటించింది. షె డ్యూల్‌ మేరకు గురువారం ప్రధాన కార్యాలయంతో పాటు ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈనెల 9 నుంచి 11 వరకు ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 12, 13వ తేదీ ల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి. తదుపరి 14న ఫైనల్‌ నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. ముసాయిదా విడుదల నేపథ్యంలో కమిషనర్‌ పమేలా సత్పతి జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్‌ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఓటర్ల గల్లంతు, మార్పులు, చేర్పులు, డబుల్‌ ఓట్లు తదితర అంశాలకు సంబంధించి అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. 


అభ్యంతరాలు తెలిపిన పార్టీలు

ఓటర్ల ముసాయిదాపై కమిషనర్‌తో జరిగిన సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డివిజన్లలో ఆయా బ్లాకుల వారీగా ఓటర్ల గల్లంతు, మృతి చెందిన ఓటర్లను తొలగించకపోవడం, బోగస్‌ ఓట్లు తదితర లోపాలను లేవనెత్తారు. అనేక డివిజన్లలో ఓట్లు గల్లంతైనట్లు చెప్పారు. సవరణ లేకపోతే నష్టం జరుగుతుందని తెలిపారు. ఓట్ల గల్లంతు వివరాలను ఆధారాలతో సహా కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై నిశితంగా పరిశీలిస్తామని కమిషనర్‌ పమేలా సత్పతి హామీ ఇచ్చారు. ఎలాంటి లోపాలు లేకుండా ఫైనల్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఈ మేరకు సవరణలు ఉంటాయని స్పష్టం చేశారు.  ఓటర్ల ముసాయిదాలో లోపాలపై తాజా మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు, డివిజన్‌ వాసు లు జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయానికి పరుగు పరుగున వచ్చారు. కార్యాలయంలో ప్రదర్శనకు పెట్టిన వివరాలను చూసుకుంటూ టెన్షన్‌ పడ్డారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పోటీపడ్డారు. 


లెక్కలిలా..

గ్రేటర్‌ వరంగల్‌లో మొత్తం ఓటర్లు 6,52,978. ముసాయిదా వివరాల ప్రకారం పురుషులు 3,22,918, మహిళా ఓటర్ల సంఖ్య 3,29,872, ఇతరులు 176 ఉన్నారు. 44వ డివిజన్‌లో అత్యధికంగా 12,440 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే అతితక్కువగా 47వ డివిజన్‌లో 7,754 ఓటర్లు ఉన్నారు. 57వ డివిజన్‌లో అత్యధికంగా 6,254 మంది పురుషుల ఓటర్లు ఉన్నారు. అతితక్కువగా పురుష ఓటర్లు(3,816) ఉన్న డివిజన్‌ 58. అత్యధికంగా మహిళా ఓటర్లు(6,332) 44వ డివిజన్‌లో ఉన్నారు. అతి తక్కువ  మహిళా ఓటర్లు(3,855) 58 డివిజన్‌లో ఉన్నారు. ఇతరులు(147 మంది ఓటర్లు) అధికంగా ఉన్న డివిజన్‌ 33. 


లోపాలు 

డివిజన్‌కు ఓటర్ల సంఖ్య గరిష్టంగా 10,884, కనిష్టంగా 8,905 ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కొద్దిపాటి హెచ్చుతగ్గులు ఉన్నా పరిగణిస్తారు. అయితే ముసాయిదాలో డివిజన్లలోని ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే కొన్ని లోపాలున్నట్లు స్పష్టమవుతోంది. గరిష్ట ఓటర్ల సంఖ్య కంటే 1,200 ఓట్లు అధికంగా ఉండడం. కనిష్ట సంఖ్య కంటే  తక్కువ ఓటర్లు ఉన్నారు. ఈ లోపాలను సవరిస్తామనేది అధికారులు చెబుతున్నారు. ఫైనల్‌ నోటిఫికేషన్‌ సమగ్రంగా ఉంటుందంటున్నారు. 


816 పోలింగ్‌ కేంద్రాలు

జీడబ్ల్యూఎంసీ ఎన్నిక నిర్వహ ణ కోసం 816 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎం కాకుండా బ్యాలెట్‌ పద్ధతిలోనే ఓటింగ్‌ ప్రక్రి య ఉంటుంది. పోలింగ్‌ సెంటర్ల ముసాయిదాను కూడా అధికారులు ప్రకటించారు. అభ్యంతరాల స్వీకరణ తదుపరి సెంటర్ల ఫైనల్‌ నోటిఫికేషన్‌ను వెల్లడిస్తారు. 


11న అధికారులకు శిక్షణ

ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఉత్తర్వులు జారీచేశారు. 81 మంది రిటర్నింగ్‌ ఆఫీసర్లు. 81 మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లు నియమితులయ్యారు. ఈనెల 11న  వరంగల్‌ ఎల్‌బీ కళాశాలలో శిక్షణ ఉంటుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 


డిస్ట్రిబ్యూషన్‌, కౌంటింగ్‌ సెంటర్‌ పరిశీలన 

ఎన్నిక క్రమంలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు, కౌం టింగ్‌ సెంటర్‌ ఎంపిక కోసం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్‌ పమేలా సత్పతి నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. పెద్దపెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, కాజీపేట ఎన్‌ఐటీ, సుబేదారి ఆర్ట్స్‌ కళాశాల, వరంగల్‌ ప్లాటినం జూబ్లీ స్కూల్‌ను పరిశీలించారు. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ సెంటర్‌గా ఎంపిక కావొచ్చనే అంచనాలున్నాయి. అనంతరం కలెక్టర్‌ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది ఎన్నిక విధుల నిర్వహణను పరిశీలించారు. ఎన్నిక సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. 





Updated Date - 2021-04-09T07:01:06+05:30 IST