పనులెట్లా!?

ABN , First Publish Date - 2022-01-22T05:54:36+05:30 IST

పనులెట్లా!?

పనులెట్లా!?

జీడబ్ల్యూఎంసీని పీడిస్తున్న ఉద్యోగుల కొరత

టౌన్‌ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, ప్రజాఆరోగ్యం విభాగాల్లో పోస్టులు ఖాళీ 

ఉన్న వారిపై కొండంత భారం  

సంక్షేమ పథకాల పనిభారం అదనం

నియామకాలపై పాలకుల నిర్లక్ష్యం  

పాలన, అభివృద్ధిపై పర్యవేక్షణ కరువు


జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), జనవరి 21 : వరంగల్‌ మహానగర పాలక సంస్థలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఏళ్ల తరబడి నియామకాలు లేవు. నగరం విస్తరిస్తోంది. డివిజన్ల సంఖ్య 66కు పెరిగింది. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రతిపాదికన ఉండాల్సిన ఉద్యోగుల నియామకాలు లేవు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా 1200 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ సగం మంది కూడా లేరు. దీంతో ఉన్న ఉద్యోగులపై అధిక భారం పడుతోంది. 


ఇటీవలే ప్రభుత్వం రిటైర్‌మెంట్‌ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. లేకుంటే మరి కొందరు సిబ్బంది రిటైర్‌ అయ్యేవారే. వయస్సు మీద పడడంతో వీరంతా అదనపు భారాన్ని మోయలేకపోతున్నారు. ఉద్యోగుల కొరత వల్ల అభివృద్ధి పనులు, ప్రజల సమస్యల పరిష్కార చర్యలకు అవరోధం ఏర్పడుతోంది. ప్రధాన విభాగాలైన ప్రజారోగ్యం, ఇంజినీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ విభాగాలలో ఉద్యోగుల కొరత నెలకొంది. సాంక్షన్‌ పోస్టులు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి భర్తీ కావడం లేదు. దీనిపై ప్రస్తుత పాలకవర్గం దృష్టి పెట్టాల్సి ఉంది.  


టౌన్‌ ప్లానింగ్‌

అత్యంత కీలకమైన టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్ని కూడా ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కీలక పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు డిప్యూటీ సిటీప్లానర్ల పోస్టులో ఒక్కరే ఉన్నారు. మూడు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఉన్న ఏసీపీ, ఇన్‌చార్జి ఏసీపీలపై అదనపు భారం పడుతోంది. ఇక అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు నలుగురిలో ఒకరే ఉన్నారు. పెరిగిన డివిజన్ల సంఖ్య ఆధారంగా డీపీసీ, ఏసీపీల పోస్టులను రెండింతలు చేయాల్సి ఉంది. ఇక టీపీబీవోలుగా 9మంది ఉండగా, ప్రస్తుతం ఒకరే ఉండడం గమనార్హం. 8 పోస్టులు భర్తీతో పాటు మరిన్ని పోస్టులు అదనంగా భర్తీ చేయాల్సి ఉంది. టౌన్‌ ప్లానింగ్‌లో ఉద్యోగుల కొరత ఉండడం వల్ల బిల్డింగ్‌ పర్మిషన్లు, క్షేత్రస్థాయి పరిశీలనలో, పర్యవేక్షణలు ఇతరత్రా సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. పోస్టులు భర్తీ చేయకుండా జాప్యానికి తమను నిందించడం సరికాదని ప్రస్తుత ఉద్యోగులు అంటున్నారు. ఉన్న పనిభారమే అధికమైన క్రమంలో ఇన్‌ఛార్జి బాధ్యతలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. 


భర్తీకాని బయోలజిస్టు పోస్టు

ప్రజారోగ్యంలో భాగమైన అర్బన్‌ మలేరియా, బయోలజిస్టు పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత సీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. దోమల నివారణ, అంటూ వ్యాధులు ప్రబలకుండా తీసుకునే చర్యలలో అర్బన్‌ మలేరియా కీలక పాత్ర పోషిస్తుంది. కానీ బయోలజిస్టుతో పాటు హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లను అదనంగా భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. 


ప్రజారోగ్య విభాగం

జీడబ్ల్యూఎంసీలో ప్రజారోగ్య విభాగం కీలకమైనది. ఉద్యోగుల కొరత కారణంగా పారిశుధ్యం, ప్రజల ఆరోగ్యం ఇతరత్రా సేవలు అంతంత మాత్రమే అవుతున్నాయి. సీఎంహెచ్‌వోగా డాక్టర్‌ రాజారెడ్డి ఉన్నారు. 66 డివిజన్లు ఉన్న క్రమంలో మరో ఇద్దరు అసిస్టెంట్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్ల అవసరం ఉంది. ఈ రెండూ సాంక్షన్డ్‌ పోస్టులే. కానీ భర్తీ కావడం లేదు. ఇద్దరు ఏఎంహెచ్‌వోలు ఉంటేనే నగర పారిశుధ్యం ఇతరత్రా సేవలు పకడ్బందీగా ఉంటాయి. క్షేత్రస్థాయిలో నిత్య పర్యవేక్షణ జరుగుతుంది. అదే విధంగా ప్రస్తుతం శానిటరీ సూపర్‌వైజర్లు కూడా ఇద్దరే ఉన్నారు. మరో 6 పోస్టులు అవసరం ఉంది. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు 13 మంది మాత్రమే ఉన్నారు. ఒక్కో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఐదు డివిజన్లు చూసుకోవాల్సి వస్తుంది. ఈ కారణంగా డివిజన్లలో పారిశుద్య సేవలు కుంటుపడుతున్నాయి. 66 డివిజన్లు ఉన్న నగరానికి అదనంగా మరో 10 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్ల అవసరం ఉంది. 


ఇంజనీరింగ్‌ వింగ్‌

నగరాభివృద్ధిలో ఎంతో కీలకమైన ఇంజినీరింగ్‌ విభాగంలోనూ పోస్టుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. మహానగరానికి సీఈ పోస్టు సాంక్షన్డ్‌ అయినా భర్తీ కావడం లేదు. సీఈ పోస్టు భర్తీ చేయాలనే డిమాండ్‌ బలంగా ఉన్నా పాలకవర్గం కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. స్మార్ట్‌సిటీ, మిషన్‌ భగీరథ, హృదయ్‌ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్న మహానగరానికి సీఈ పోస్టు కీలకమైనప్పటికీ విస్మరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సూపరింటెండ్‌ంట్‌ ఇంజనీర్‌కు అదనంగా మరో ఎస్‌ఈ పోస్టు సాంక్షన్‌ అయి ఉంది. కానీ భర్తీ కావడం లేదు. ఫలితంగా ఒకవైపు భారీ ప్రాజెక్టులు, మరోవైపు సాధారణ అభివృద్ధి పనులపై ఎస్‌ఈకి పర్యవేక్షణ, బాధ్యతల నిర్వహణ భారంగా మారింది. ప్రస్తుతం ఉన్న ముగ్గురు ఈఈలకు అదనంగా మరో ముగ్గురు నియమితులైతేనే పకడ్బందీగా సేవలు అందుతాయి. ప్రస్తుతం డీఈలు కూడా ఐదుగురు ఉన్నారు. ఒక్కొక్కరికి 13 డివిజన్ల భారం పడుతుంది. ఈ క్రమంలో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతుంది. పరిష్కార చర్యగా మరో 10 మంది డీఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఏఈల కూడా 11 మంది మాత్రమే ఉన్నారు. మరో 10 ఏఈ పోస్టులు భర్తీ చేస్తేనే డివిజన్లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయి. రెవెన్యూ విభాగంలో 11 మంది ఆర్‌ఐలు మాత్రమే ఉన్నారు. ఒక్కొక్కరిపై ఆరు డివిజన్ల భారం పడుతుంది. బిల్‌ కలెక్టర్ల కొరత కూడా నెలకొంది. ఈ క్రమంలో పోస్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


సంక్షేమ పథకాల భారం

పోస్టులు భర్తీ అదనపు పనిభారాన్ని మోయలేకపోతున్న ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల పనులు భారమవుతున్నాయి. ఏమాత్రం సంబంధం లేని పనులను అదనంగా చేయాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలు, సర్వేలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణలు, శిబిరాల నిర్వహణ ఇలాంటి పనులు మరింత భారమవుతున్నాయని అంటున్నారు. ఒకవైపు విభాగ పనులు మరోవైపు పథకాల పనులతో మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు.


ఉద్యోగులను నిందిస్తే ఎలా?

బల్దియాలోని ప్రతీ విభాగంలో సిబ్బంది కొరత ఉంది. ముఖ్యమైన విభాగాలలో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా విభాగాల్లో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయి. పరిష్కారం చర్యలు జాప్యమవుతున్నాయి. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా పాలకవర్గం అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తెస్తోంది. కౌన్సిల్‌ ఇతరత్రా సమావేశాల్లో వారిని టార్గెట్‌ చేసి నిలదీస్తోంది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా అధికారులు, కిందిస్థాయి ఉద్యోగుల పరిస్థితి మారింది. పోస్టులు భర్తీ చేయకుండా తమను బాధ్యుల్ని చేసి కౌన్సిల్‌, ఇతరత్రా సమావేశాల్లో ప్రజాప్రతినిధులు తమను నిందించడం సరికాదని బల్దియా ఉద్యోగులు అంటున్నారు.


రావాలంటేనే హడల్‌

బల్దియాకు రావాలంటే ఇతర ప్రాంతాల ఉద్యోగులు హడల్‌ అవుతున్నారు. కీలక పోస్టుల్లోని ఉద్యోగులు ఇక్కడి నుంచి బదిలీపై వెళితే ఆ స్థానంలో రావడానికి జంకుతున్నారు. కారణం పనిభారం ఒకటైతే ఇక్కడి రాజకీయ ఒత్తిళ్లు ప్రధానంగా మారయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-01-22T05:54:36+05:30 IST