Abn logo
Sep 25 2021 @ 20:19PM

Donald Trump పాలనలో భారతీయులకు షాకులే షాకులు! సంచలనం కలిగిస్తున్న గణాంకాలు!

వాషింగ్టన్: అమెరికాలోకి వలసలు నిరోధించేందుకు అప్పటి దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన యత్నాలు భారతీయులకు ఎటువంటి సమస్యలు తెచ్చిపెట్టాయో కళ్లకు కట్టినట్టు చూపించే గణాంకాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్ఎఫ్ఏపీ) సంస్థ తాజాగా విడుదల చేసింది. అమెరికా కల సాకారం చేసుకునేందుకు భారతీయులు హెచ్-1బీ వీసాపైనే అధికంగా ఆధారపడతారు. అయితే.. ట్రంప్ హయాంలో ఈ వీసా దరఖాస్తుల తిరస్కరణ రేటు అత్యధిక స్థాయికి చేరుకుందని ఎన్ఎఫ్ఏపీ తన నివేదికలో పేర్కొంది. 2020 సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో హెచ్-1బీ వీసా దరఖాస్తుల్లో ఏకంగా 28.6 శాతం తిరస్కరణకు గురయ్యాయని తెలిపింది. ఆ సమయంలో.. ఆమోదం పొందిన దరఖాస్తుల సంఖ్య 38,150 కాగా.. 15,341 పిటిషన్లను అధికారులు తిరస్కరించారని ఎన్ఎఫ్ఏపీ పేర్కొంది. ఇక 2018 ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో ఈ తిరస్కరణ రేటు 24 శాతంగా, 2019లో ఇది 21 శాతంగా ఉన్నట్టు తేల్చింది. 

అదే 2015లో మాత్రం కేవలం 7 శాతం దరఖాస్తులు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. అయితే ట్రంప్ పాలన చివర్లో మాత్రం ఈ తిరస్కరణ పర్వానికి కాస్త అడ్డుకట్ట పడిందని, ఫెడరల్ కోర్టుల జోక్యం కారణంగానే ఇది సాధ్యమైందని ఎన్ఎఫ్ఏపీ పేర్కొంది. 2021 తొలి రెండు త్రైమాసికాల్లో మొత్తం హెచ్-1బీ వీసా దరఖాస్తుల్లో కేవలం 7.1 శాతం పిటిషన్లు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. ‘‘చట్టవ్యతిరేకమైనవిగా కోర్టులు భావిస్తున్న విధానాలను ట్రంప్ ఏకంగా నాలుగేళ్ల పాటు అమలు చేయగలిగారు. ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే.. ప్రభుత్వాన్ని కట్టడి చేయడంలో కోర్టులకు ఉన్న పరిమితులకు ఈ స్థితి అద్దంపడుతోంది’’ అని ఎన్ఎఫ్ఏపీ తన నివేదికలో వ్యాఖ్యానించింది. ఏటా జారీ చేసే హెచ్1-బీ వీసాల్లో 70 శాతం భారతీయులు సొంతం చేసుకుంటున్నారన్న విషయం తెలిసిందే. 

తాజా వార్తలుమరిన్ని...