హా..క్సిజన్‌

ABN , First Publish Date - 2021-04-30T05:17:42+05:30 IST

జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఈ నెలలో తీవ్రరూపం దాల్చింది. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు మొత్తం 70,689 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో ఈ నెలలోనే 7,474 వెలుగుచూశాయి. మూడు వారాలుగా నిత్యం వందల సంఖ్యలోనే వస్తున్నాయి. తాజాగా బుధవారం అధికారులు ప్రకటించిన గణంకాల ప్రకారం 679 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.

హా..క్సిజన్‌
రిమ్స్‌లో ఆక్సిజన్‌ నిల్వఉంచే సిలిండర్‌ ట్యాంకులు

దినదిన గండం!

పొంచి ఉన్న  ముప్పు

రిమ్స్‌లో భారీగా పెరిగిన ఆక్సిజన్‌  అవసరం

వారంలో రెట్టింపు వినియోగం

రోజూ ట్యాంకర్‌ వస్తేనే గడిచేది

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పెరిగిన వాడకం

నిత్యం భారీగా నమోదవుతున్నపాజిటివ్‌లు

పలుచోట్ల బెడ్‌లు పుల్‌, టీకాల కోసం పరుగులు


ఒంగోలు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): 

కరోనా రెండో వేవ్‌లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రాణవాయువు (అక్సిజన్‌) అవసరం, వాడకం గణనీయంగా పెరిగింది. అయితే అందుబాటులో ఆక్సిజన్‌ లేక బాధితులు విలవిల్లాడుతున్నారు. కొందరు  ప్రాణాలు విడుస్తున్నారు. రాష్ట్రంలో వారం నుంచి ఈ పరిస్థితి తీవ్రంగా ఉండగా ప్రస్తుతం జిల్లాలోనూ కొరత మొదలైంది. జిల్లాలో అధికశాతం ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ (ఐసీయూ) బెడ్లు ఒంగోలులోని రిమ్స్‌లో ఉండగా, ప్రస్తుతం అక్కడ కూడా భయానక పరిస్థితే కనిపిస్తోంది. బెడ్లన్నీ నిండిపోయాయి.  వారంక్రితం కంటే ప్రస్తుతం బాధితుల సంఖ్య రెట్టింపు కాగా, ఆక్సిజన్‌ వాడకం కూడా ఆ స్థాయిలో పెంచాల్సి వస్తోంది. దీంతో నిత్యం ట్యాంకర్‌ వస్తేనే తప్ప రిమ్స్‌లో బాధితులకు ఆక్సిజన్‌ అందివ్వలేని పరిస్థితి నెలకంది. బుధవారం ట్యాంకర్‌ రావడంలో కొంత జాప్యం జరగడంతో సంబంధిత అధికారులు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి మెరుగుపడాలంటే అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

జిల్లాలో  కరోనా సెకండ్‌ వేవ్‌ ఈ నెలలో తీవ్రరూపం దాల్చింది. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు మొత్తం 70,689 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో ఈ నెలలోనే 7,474 వెలుగుచూశాయి. మూడు వారాలుగా నిత్యం వందల సంఖ్యలోనే వస్తున్నాయి. తాజాగా బుధవారం అధికారులు ప్రకటించిన గణంకాల ప్రకారం 679 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. సెకండ్‌ వేవ్‌లో ఇంతసంఖ్యలో కేసులు రావడం ఇదే ప్రథమం. కాగా గురువారం కూడా 639 కేసులు నమోదయ్యాయి. కేసులు సంఖ్య పెరుగుతుండటంతో పాటు, వైరస్‌ తీవ్రత కూడా అధికంగా ఉంటోంది. దీంతో ఆస్పత్రుల్లో చికిత్స కోసం అందులోనూ ఆక్సిజన్‌, వెంటిలేటర్‌పై చికిత్స ఇవ్వాల్సిన వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం పరిశీలిస్తే రెండు వారాల క్రితం ఒంగోలు రిమ్స్‌తో పాటు మరో మూడు ప్రభుత్వ, 11 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతి ఇచ్చారు. వాటిలో 1,800 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. అప్పటికి జిల్లాలో 1,531 యాక్టివ్‌ కేసులు ఉండగా వారిలో 1,100మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందారు. మిగిలిన 431 మంది ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటుండగా, వారిలో కేవలం 15 మంది ఆక్సిజన్‌, ఐదుగురికి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. 


పెరిగిపోతున్న బాధితులు

అదే తర్వాత వారంరోజులకు అంటే ఈనెల 21నాటికి ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే జిల్లాలో ఆ రోజుకు యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,798కి పెరిగింది. వారిలో 2,692 మంది ఇళ్లలోనే ఉండి చికిత్స పొందగా.. 1,066 మంది ఆస్పత్రిలో ఉన్నారు. ఆస్పత్రుల్లో ఉన్న వారిలో 73 మందికి వెంటిలేటర్‌, 498 మందికి ఆక్సిజన్‌ చికిత్స అందించారు. తర్వాత వారం అంటే బుధవారం నాటి ఉన్న గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,682కు చేరింది. అందులో 4,048మంది ఇళ్ల నుంచే చికిత్స పొందుతుండగా.. 1,634 మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. వారిలో 155 మందికి వెంటిలేటర్‌, 881 మందికి ఆక్సిజన్‌ బెడ్‌లపైనా చికిత్స అందిస్తున్నారు. అంటే ఈనెల 13 నాటికి వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ రెండూ కలిపి కేవలం 20మందికి మాత్రమే అవసరం ఉండగా ఆ సంఖ్య 21నాటికి 570కి అలాగే బుధవారం నాటికి ఏకంగా 1,036 మందికి పెరిగింది. రెండు వారాల్లో ఇంత భారీస్థాయిలో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ తో చికిత్స అందించాల్సి వచ్చింది.

రిమ్స్‌లోనే అధికంగా..

రిమ్స్‌లో మంగళవారం రాత్రి వరకు 83మందికి వెంటిలేటర్‌, 839మందికి ఆక్సిజన్‌ బెడ్లపై చికిత్స నందిస్తుండగా బుధవారం ఆ సంఖ్య మరింత పెరిగింది. పెద్దసంఖ్యలో బాధితులకు రిమ్స్‌లో ఆక్సిజన్‌తో చికిత్స అందించాల్సి రావడంతో ఆ మేరకు వాడకం పెరిగింది. ప్రస్తుతం రోజుకు 10 నుంచి 12 టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతోంది. వాస్తవానికి కరోనాకు ముందు రిమ్స్‌లో ఇన్‌పేషెంట్‌ రోగులకు నెలకు 20 టన్నుల ఆక్సిజన్‌ సరిపోయేది. అప్పట్లో 5 టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న స్టోరేజీ ట్యాంకు ఉండేది. కాగా గతేడాది కరోనా తీవ్రత సమయంలో రోజుకు 7 టన్నుల ఆక్సిజన్‌ అవసరమైంది. దీంతో స్టోరేజీ ట్యాంకులను 20 టన్నులకు పెంచారు. అలాగే అదనంగా ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటు చేశారు. కాగా గతవారం వరకూ రోజువారీ 7 టన్నుల ఆక్సిజన్‌ సరిపోగా ఈవారంలో దాని అవసరం, వినియోగం భారీగా పెరిగింది. ఇంచుమించు రెట్టింపు సంఖ్యలో ఆక్సిజన్‌ అవసరమైన బాధితులు వస్తున్నారు. ప్రస్తుతం రిమ్స్‌లో వెంటిలేటర్‌, అక్సిజన్‌ బెడ్‌లపై చికిత్స పొందుతున్నవారు 790మంది ఉండగా రోజుకు 12 టన్నులు  అవసరం అవుతోంది. 


తగ్గిన ఆక్సిజన్‌ సరఫరా

దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో జిల్లాకు సరఫరా తగ్గింది. గతంలో చెన్నై నుంచి సరఫరా ఉండగా ప్రస్తుతం విశాఖ నుంచి వస్తోంది. సోమవారం నాటికి కొంత ఆక్సిజన్‌ కొరత ఏర్పడగా విశాఖ నుంచి ఒక ట్యాంకర్‌ రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అలా నిత్యం ఒక ట్యాంకర్‌ వస్తేనే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఉన్నతాధికారులు నివేదించగా మంగళవారం కూడా మరో ట్యాంకర్‌ పంపారు. అయితే అప్పటికి నెల్లూరులో ఆక్సిజన్‌  అత్యవసరం కావడంతో దానిని అక్కడికి పంపారు. బుధవారం ఉదయానికి ఇక్కడి రిమ్స్‌లో ఆక్సిజన్‌ కేవలం మూడు టన్నులు మాత్రమే ఉండగా విశాఖ నుంచి ట్యాంకర్‌ రావడం ఆలస్యమైంది. దీంతో మధ్యాహ్నానికి రిమ్స్‌లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.  విషయాన్ని అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు. దీంతో మధ్యాహ్నానికి ఆరు టన్నులు, రాత్రికి మరో 12 టన్నులు ఆక్సిజన్‌ రిమ్స్‌కు చేరడంతో ఊపిరిపీల్చుకున్నారు.


ఏ రోజుకారోజే...

ప్రస్తుతం ప్రతిరోజు ఒక ట్యాంకర్‌ వస్తేనే తప్ప ఇక్కడ బాధితులకు చికిత్స అందే పరిస్థితి కనిపించడం లేదు. గురువారం రాత్రి కూడా ఒక ట్యాంకర్‌ వచ్చింది. కాగా వెంటిలేటర్‌పై చికిత్స చేయాల్సిన బాధితుల సంఖ్య ఎంత పెరిగితే అంతమేర ఆక్సిజన్‌ అవసరం పెరుగుతుండటంతో దినదినగండంగా మారింది. ఇదిలా ఉండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కోసం ఏజెన్సీల నుంచి ఆక్సిజన్‌ కొనుగోలు చేస్తుండగా వారు  కొంతమేర ధరలు పెంచి అమ్ముతున్నట్లు సమాచారం. ఒంగోలులో ఈ పరిస్థితి ఉండగా కందుకూరు, మార్కాపురం, చీరాలల్లోనూ ఆక్సిజన్‌ అందుబాటులో లేక బాధితులు ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.




Updated Date - 2021-04-30T05:17:42+05:30 IST