మొబిక్విక్‌పై హ్యాకర్ల పంజా?

ABN , First Publish Date - 2021-03-31T07:13:01+05:30 IST

దిగ్గజ భారతీయ మనీ వ్యాలెట్‌ యాప్‌ మొబిక్విక్‌ యూజర్ల డేటా హ్యాక్‌ అయింది. జోర్దాన్‌కు చెందిన హ్యాకర్లు ఈ చర్యకు ఒడిగట్టినట్లు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులు గుర్తించారు

మొబిక్విక్‌పై హ్యాకర్ల పంజా?

10 కోట్ల మంది యూజర్ల డేటా లీక్‌

పేర్లు, ఇతర వ్యక్తిగత వివరాలు బట్టబయలు

4 కోట్ల మంది క్రెడిట్‌ కార్డుల డేటా కూడా

డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టిన హ్యాకర్లు

నిర్ధారించిన సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు

నిరాధార ఆరోపణలంటున్న మొబిక్విక్‌


న్యూఢిల్లీ, మార్చి 30: దిగ్గజ భారతీయ మనీ వ్యాలెట్‌ యాప్‌ మొబిక్విక్‌ యూజర్ల డేటా హ్యాక్‌ అయింది. జోర్దాన్‌కు చెందిన హ్యాకర్లు ఈ చర్యకు ఒడిగట్టినట్లు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నెలలో.. మొబిక్విక్‌కు చెందిన క్లౌడ్‌ సర్వర్ల నుంచి హ్యాకర్లు ఈ డేటాను తస్కరించినట్లు సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. 8 టెర్రా బైట్ల (టీబీ) సామర్థ్యం ఉన్న 10 కోట్ల మంది యూజర్ల డేటాను హ్యాకర్లు కొల్లగొట్టినట్లు వెల్లడించారు. మొబిక్విక్‌ యాప్‌ను వాడుతున్న వినియోగదారుల పేర్లు, చిరునామా, మొబైల్‌ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, జీపీఎస్‌ లొకేషన్‌, వారి మొబైల్‌ డివైజ్‌ వివరాలు హ్యాక్‌ అయ్యాయని పేర్కొన్నారు. 4 కోట్ల మంది వినియోగదారులకు చెందిన క్రెడిట్‌/డెబిట్‌ కార్డు నంబర్లు కూడా లీక్‌ అయినట్లు తెలిపారు. ‘జోర్దాన్‌ డావెన్‌’ గ్రూప్‌ హ్యాకర్లు ఈ డేటాను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు వివరించారు. వారు కొనుగోలుదారుల నుంచి బిట్‌కాయిన్స్‌ రూపంలో డబ్బు ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఈ ఆరోపణలను మొబిక్విక్‌ ఖండించింది.


ఆరోపణలు రాగానే సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహించామని, ఎక్కడా లోపాలు బయటపడలేదని తెలిపింది. యూజర్లు చేసిన పొరపాట్ల వల్లే డేటా లీక్‌ అయ్యి ఉంటుందని ఆరోపించింది. మొబిక్విక్‌ను 2009లో బిపిన్‌ ప్రీత్‌ సింగ్‌, ఉపాసనా టకూ సంయుక్తంగా స్టార్ట్‌పగా ప్రారంభించారు. నోట్ల రద్దు తర్వాత.. డిజిటల్‌ చెల్లింపులకు డిమాండ్‌ పెరగడంతో దేశీయ యాప్‌ అయిన మొబిక్విక్‌కు ఆదరణ లభించింది. ఆ సంస్థ బీమా, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్సింగ్‌ రంగంలోనూ అడుగు పెట్టింది. వినియోగదారులు, వ్యాపారులకు రుణాలిస్తోంది.

Updated Date - 2021-03-31T07:13:01+05:30 IST