Abn logo
Jul 23 2020 @ 00:53AM

మసీదుగా ‘హాజియా సోఫియా’

టర్కీలో పదిహేనువందల ఏళ్ళ ఘనచరిత్ర గల ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ‘హాజియా సోఫియా’ మసీదుగా రూపాంతరం చెంది, రేపటినుంచి ప్రార్థనలకు సన్నద్ధమవుతోంది. శుక్రవారం ప్రార్థనల్లో పాలుపంచుకోవాల్సిందిగా దేశాధ్యక్షుడు ఎర్డొగాన్‌ పలు విదేశీ ప్రముఖులను ఆహ్వానించారు. కరోనా జాగ్రత్తల మధ్య జరిగే ఈ ప్రార్థనల్లో అనేక ముస్లిం దేశాధినేతలూ మతపెద్దలు సహా పదిహేనువందల మంది పాల్గొనవచ్చునని అంచనా. ఎనభైయేళ్ళుగా మ్యూజియంగా ఉన్న ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాన్ని మసీదుగా మార్చేక్రమంలో చేపట్టిన చిన్నచిన్న మరమ్మత్తులను అటుంచితే, ఆనాటి రోమన్‌ క్రైస్తవ చిహ్నాలు, కుడ్యచిత్రాలు, వర్ణచిత్రాలు ప్రార్థనల సందర్భంలో కనిపించకుండా భారీ తెరలు ఏర్పాటు చేశారు. ఒక్క మేకు కొట్టకుండానే అనుగుణమైన మార్పులు చేసినట్టు ఎర్డగాన్‌ ప్రభుత్వం చెబుతోంది. ఒట్టోమన్‌ కాలాన్ని ప్రతిబింబించే అల్లికలూ, చిహ్నాలున్న స్వదేశీ రగ్గుల మీద ప్రార్థనలు జరగబోతున్నాయి. 


టర్కీ చర్యపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంస్థలు, చర్చిలు తీవ్ర ఆందోళన వెలిబుచ్చాయి. పోప్‌ ఫ్రాన్సిస్‌ సహా అనేకులు దీనిని విపరీత చర్యగా అభివర్ణించారు. మానిన గాయాల్ని తిరిగిరేపుతున్నారని కొందరు అన్నారు. ఎర్డొగాన్‌ నిర్ణయం విభిన్నమతాల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు పెంచుతాయని ప్రపంచ చర్చిల మండలి వ్యాఖ్యానించింది. యునెస్కో దాని ప్రపంచ వారసత్వ హోదాని పునఃపరిశీలించబోతున్నట్టు ప్రకటించింది. హాజియా సోఫియా విషయంలో ఎవరు ఏమి చెప్పినా వింటాననీ, అయితే, నిత్యప్రార్థనలు జరిగే మసీదుగా మార్చాలన్న నిర్ణయం మాత్రం దేశ సార్వభౌమాధికారానికి సంబంధించినదని ఎర్డగాన్‌ తేల్చేశారు. మా దేశంలో మీరు నిర్మించిన వందలాది చర్చిలు, ఇతరత్రా భారీ కట్టడాలను మేము ఎంతో భద్రంగా కాపాడుకొచ్చాం. యూరప్‌లోనూ, బాల్కన్స్‌లోనూ మా చారిత్రక కట్టడాలు ఎన్ని మిగల్చారో చెబుతారా? అంటూ తన నిర్ణయాన్ని ప్రశ్నించిన వారిని ఆయన నిలదీస్తున్నాడు. ఆరోశతాబ్దంలో బైజాంటిన్‌ రాజు ఆధ్వర్యంలో నిర్మితమై, వెయ్యేళ్ళపాటు చర్చిగా ఉన్న ఈ అద్భుత కట్టడం, ఆ తరువాత 1454లో ఒట్టోమన్‌ సుల్తాన్‌ అలనాటి ఈ కాన్‌స్టాంటినోపుల్‌ నగరాన్ని జయించిన తరువాత మసీదుగా మారిపోయింది. ఐదువందల ఏళ్ళపాటు మసీదుగా ఉన్న దీనిని ఆధునిక టర్కీ నిర్మాత ముస్తఫా కెమల్‌ అటాటర్క్‌ మతకోణంలో చూడలేదు. ఐదేళ్ళపాటు దానిని మూసివేసి, దేశంలో ఆధునికతను, లౌకికవిలువలను ప్రవేశపెట్టే క్రమంలో 1930లో ఒక మ్యూజియంగా తెరిచాడు. అలనాటి చరిత్రలకు అద్దంపడుతూ, క్రైస్తవ–ముస్లిం సహజీవనానికి నిదర్శనంగా ఈ కట్టడం ఏటా లక్షలాదిమంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఇస్తాంబుల్‌ నగరానికే శోభతెచ్చింది.


ఇటీవలి కాలంలో ఈ కట్టడాన్ని మసీదుగా తిరిగిమార్చేయాలన్న డిమాండ్‌ ఊపందుకోవడానికి ప్రధాన కారణం ఎర్డగోన్‌. ఆయన అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అటాటుర్క్‌ పునాదులు వేసిన లౌకికవాద, ప్రజాస్వామిక విలువలను ధ్వంసం చేస్తూ పాలనలో మతాన్ని ప్రధానం చేశాడు. తదనుగుణమైన విలువలతో రాజ్యాంగాన్ని తిరగరాసి, అత్యంత శక్తిమంతుడైన దేశాధ్యక్షుడిగా అవతరించాడు. సమస్త వ్యవస్థలపై ఆయన ఆధిపత్యం సాగుతున్న స్థితిలో హాజియా సోఫియా మసీదుగా తప్ప మ్యూజియంగా కొనసాగేందుకు వీల్లేదంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పడంలో విశేషమేమీ లేదు. తీర్పు వెలువడిన వెంటనే దానిని మతవ్యవహారాల శాఖకు అప్పగించి ఆయన తన ఎన్నికల హామీని నెరవేర్చుకున్నాడు.


హాజియా సోఫియా టర్కీలోని మతవాదుల దృష్టిలో అలనాటి ఒట్టోమన్‌ సామ్రాజ్య ప్రాభవానికి నిలువెత్తు నిదర్శనం. ఇస్తాంబుల్‌, అంకారాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓటమిపాలైన ఎర్డగాన్‌ తన ఓటుబ్యాంకును సుస్థిరపరచుకొనే క్రమంలో దీనిని తిరిగి మసీదుగా చూడాలనుకుంటున్నవారి కోర్కె నెరవేర్చాడు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలో పెద్ద సంఖ్యలో వినిపిస్తున్న గొంతుకలను ఆయన ఖాతరుచేయలేదు. పతనమైన ఆర్థిక వ్యవస్థ, విస్తరిస్తున్న కరోనా కష్టాల మధ్య ఈ మత ఆయుధాన్ని ప్రయోగించాడు. మధ్యయుగాల్లో తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకొనే క్రమంలో విజేతలు పరాజితుల మత చిహ్నాలను ధ్వసం చేయడం, రూపురేఖలు మార్చడం సర్వసాధారణం. ఆధునిక కాలంలోనూ అదే సూత్రాన్ని అమలు చేస్తున్న ఎర్డొగాన్‌ రాజకీయంగా ఎంత బావుకుంటారో కానీ, టర్కీకి మాత్రం తీరని అన్యాయం చేస్తున్నారు. గతాన్ని తవ్వితీసి సమాజాన్ని చీల్చడమే కాక, కొత్తగాయాలతో దేశానికి ఉన్న మంచిపేరు తుడిచిపెట్టేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement