ఇంట్లోనే వహవా...లీమ్‌

ABN , First Publish Date - 2020-04-25T06:43:19+05:30 IST

రంజాన్‌ నెల మొదలయిందంటే చాలు... ఏ హోటల్‌ కెళ్లినా హలీమ్‌ ఘుమఘుమలు వచ్చేవి. పోషకాలు పుష్కలంగా లభించే హలీమ్‌ను ప్రాంతాలకు అతీతంగా అందరూ ఇష్టపడతారు.

ఇంట్లోనే వహవా...లీమ్‌

రంజాన్‌ నెల మొదలయిందంటే చాలు... ఏ హోటల్‌ కెళ్లినా హలీమ్‌ ఘుమఘుమలు వచ్చేవి. పోషకాలు పుష్కలంగా లభించే హలీమ్‌ను ప్రాంతాలకు అతీతంగా అందరూ ఇష్టపడతారు. లాక్‌డౌన్‌ మూలంగా ఈ ఏడాది హలీమ్‌ రుచి చూసే అవకాశం లేకుండా పోతోంది. అయితే కాస్త కష్టమైనా ఇంట్లోనే హలీమ్‌ను తయారుచేసి ఇంటిల్లిపాది ఆ రుచిని ఆస్వాదించవచ్చు. ఎప్పుడూ ఒకే రుచులు టేస్ట్‌ చేసే బదులు,

ఈ రంజాన్‌ మాసంలో ఇంట్లోనే హలీమ్‌ రుచిని ట్రై చేయండి. 





చికెన్‌ హలీమ్‌

కావలసినవి: బోన్‌లెస్ చికెన్‌ - అరకేజీ, గోధుమ రవ్వ - పావుకేజీ, యాలకులు - మూడు, లవంగాలు - ఆరు, దాల్చినచెక్క - చిన్నముక్క, ఉల్లిపాయలు - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు, పెసరపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - నాలుగు, మిరియాల పొడి - అర టీస్పూన్‌, పొట్లీ మసాల - ఒక ప్యాకెట్‌, గరం మసాల - ఒక టీస్పూన్‌, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, సాజీర - పావు టీ స్పూన్‌, పెరుగు - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, నెయ్యి - కొద్దిగా, నిమ్మకాయ - ఒకటి.


తయారీ:

కుక్కర్లో శుభ్రం చేసుకున్న చికెన్‌ ముక్కలు, సెనగపప్పు, పెసరపప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, కొద్దిగా పుదీనా, రెండు పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు వేయాలి. పొట్లీ మసాలను ఒక సన్నటి బట్టలో మూటకట్టి వేయాలి. ఇప్పుడు నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.

ఆవిరి పోయాక మూత తీసి గోధుమ రవ్వ వేసి కలుపుకోవాలి. మళ్లీ నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.

ఆవిరి తగ్గాక మూత తీసి పొట్లీ మసాల మూటను తీసేయాలి. తరువాత మిశ్రమాన్ని గ్రైండర్‌లో వేసి పేస్టు మాదిరిగా పట్టుకోవాలి.

స్టవ్‌పై ఒక పాన్‌పెట్టి నూనె వేయాలి. కాస్త వేడి అయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, సాజీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసి వేగించాలి.

తరువాత కారం, మిరియాల పొడి, గరం మసాలాపొడి వేసి కలుపుకోవాలి. కాసేపయ్యాక పెరుగు వేయాలి.

గ్రైండ్‌ చేసిన చికెన్‌ మిశ్రమం, తగినంత ఉప్పు వేసి చిన్నమంటపై ఉడికించాలి. చివరగా నెయ్యి వేసి దింపుకోవాలి.

వేగించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం పిండుకొని సర్వ్‌ చేసుకోవాలి.


గత నాలుగైదు దశాబ్దాలలో రంజాన్‌ మాసంలో హలీమ్‌ లేకపోవడం ఇదే మొదటిసారి. 


మటన్‌ హలీమ్‌

కావలసినవి:బోన్‌లెస్‌ మటన్‌ - ఒక కేజీ, కందిపప్పు - పావు కప్పు, సెనగపప్పు - పావు కప్పు, పెసరపప్పు - పావు కప్పు, ఎర్రపప్పు - పావు కప్పు, పొట్టు తీయని మినప్పప్పు - పావు కప్పు, మినప్పప్పు - పావు కప్పు, మినుములు - పావు కప్పు, బియ్యం - అర కప్పు, గోధుమలు - ముప్పావు కప్పు, పసుపు - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగైదు, దాల్చిన చెక్క పొడి - పావు టీ స్పూన్‌, నిమ్మకాయ - ఒకటి, బిర్యానీ మసాల పొడి-రెండు టీస్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట. 

తయారీ  

ముందుగా పప్పులను శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టాలి. బియ్యంను కడిగి సెపరేట్‌గా నానబెట్టాలి. గోధుమలను కడిగి ఐదారు గంటలపాటు నానబెట్టుకోవాలి.

నానబెట్టిన పప్పులను కుక్కర్‌లో వేసి, ఉప్పు, పసుపు, కారం వేసి పెద్దమంటపై ఒక విజిల్‌ వచ్చే వరకు ఉడికించాలి. 

తరువాత చిన్నమంటపై పావుగంట ఉడికించాలి.

మటన్‌ను సెపరేట్‌గా ఉడికించాలి. బియ్యంను సెపరేట్‌గా ఉడికించాలి.

ఒక పెద్ద పాత్రలో ఉడికించిన పప్పు, బియ్యం, మటన్‌ వేసి కలుపుకోవాలి.

నానబెట్టిన గోధుమలను చిన్న రోట్లో వేసి దంచుకోవాలి. ఇలా చేయడం వల్ల గోధుమల పైన ఉండే పొట్టు పోతుంది.

ఈ గోధుమలను కుక్కర్‌లో తీసుకుని రెండు కప్పుల నీళ్లు పోసి పెద్ద మంటపై ఒక విజిల్‌ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత చిన్నమంటపై అరగంటపాటు ఉడకనివ్వాలి. 

ఉడికిన గోధుమలను మటన్‌ మిశ్రమంలో కలుపుకోవాలి.

వేగించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ మసాల, దాల్చిన చెక్క పొడి, తగినంత 

ఉప్పు వేసి కలుపుకోవాలి. రెండు, మూడు కప్పుల నీళ్లు పోసి అరగంటపాటు ఉడికించాలి.

చివరగా కొత్తిమీర, వేగించిన ఉల్లిపాయలతో గార్నిష్‌ చేసుకుని వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


వెజ్‌ హలీమ్‌

కావలసినవి: గోధుమ రవ్వ - పావు కప్పు, కొర్రలు - పావు కప్పు, కందిపప్పు - ఒక టీస్పూన్‌, ఓట్స్‌ - పావు కప్పు, పెసరపప్పు - ఒక టీస్పూన్‌, మిరియాలు - ఒక టీస్పూన్‌, లవంగాలు - నాలుగు, దాల్చిన చెక్క - కొద్దిగా, యాలకులు - రెండు, సాజీర - ఒక టీస్పూన్‌, బాదం పలుకులు - నాలుగైదు, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, క్యారట్‌ - ఒకటి, బీన్స్‌ - నాలుగైదు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, పుదీనా - అర కప్పు, కొత్తిమీర - ఒక కట్ట, పసుపు - అర టీస్పూన్‌, పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరిపాలు - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నెయ్యి - కొద్దిగా, నిమ్మకాయ - ఒకటి.

తయారీ:

ముందుగా గోధుమరవ్వ, కొర్రలు, కందిపప్పు, ఓట్స్‌, పెసరపప్పు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, సాజీర, బాదం, మినప్పప్పు, సెనగపప్పును మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. పేస్టు మాదిరిగా కావడం కోసం కొద్దిగా నీళ్లు పోసి పట్టుకోవచ్చు.

పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేగాక కొన్ని తీసి గార్నిష్‌ కోసం పక్కన పెట్టుకోవాలి.

కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి, ఒక టేబుల్‌స్పూన్‌ నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. 

తరువాత క్యారట్‌, బీన్స్‌ వేయాలి. వేగించిన ఉల్లిపాయలు, పెరుగు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి కాసేపు వేగించాలి.

పసుపు, గ్రైండ్‌ చేసి పెట్టుకున్న పేస్టు వేసి, మూడు కప్పుల నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు వేసి మూడు విజిల్స్‌ వరకు ఉడికించాలి.

ఆవిరి పోయాక మూత తీసి కొబ్బరిపాలు పోసి కలుపుకోవాలి. ఒక టేబుల్‌స్పూన్‌ నెయ్యి వేసి రెండు, మూడు నిమిషాలు ఉడికించి దింపుకోవాలి. నిమ్మరసం పిండుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-04-25T06:43:19+05:30 IST