సగం రేషన్‌ షాపులకూ చేరని బియ్యం!

ABN , First Publish Date - 2022-01-22T06:38:05+05:30 IST

జిల్లాలో రేషన్‌ బియ్యం నిల్వలు నిండుకున్నాయి.స్టేజీ-1 కేంద్రాలైన ఐరాల,రేణిగుంటల్లోని స్టాకు పాయింట్లు ఖాళీ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా స్టేజీ-1 కేంద్రాలకు, అక్కడి నుంచి జిల్లాలోని 28 స్టేజ్‌-2(ఎంఎల్‌ఎస్‌) కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు.

సగం రేషన్‌ షాపులకూ చేరని బియ్యం!

 -నిండుకున్న బియ్యం నిల్వలు

- పీఎంజీకేవై కోటా సరఫరాకు  రాష్ట్రప్రభుత్వం ఆపసోపాలు


మదనపల్లె, జనవరి 21 : జిల్లాలో రేషన్‌ బియ్యం నిల్వలు నిండుకున్నాయి.స్టేజీ-1 కేంద్రాలైన  ఐరాల,రేణిగుంటల్లోని స్టాకు పాయింట్లు ఖాళీ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా స్టేజీ-1 కేంద్రాలకు, అక్కడి నుంచి జిల్లాలోని 28 స్టేజ్‌-2(ఎంఎల్‌ఎస్‌) కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. బియ్యం కొరత, దానికితోడు సరఫరా జాప్యంతో వచ్చిన బియ్యాన్ని వచ్చినట్లే ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు సర్దుబాటు చేస్తున్నారు.దీంతో ఒక్కో కేంద్రానికి 30టన్నుల సామర్థ్యం గల ఒకటి, రెండు లారీలు మాత్రమే వస్తున్నాయి.ఒక్కో రేషన్‌ కేంద్రానికే రెండు మూడు లారీల స్టాక్‌ అవసరముండడంతో వస్తున్న బియ్యాన్ని అక్కడక్కడా కొంచెంకొంచెంగా సర్దుబాటు చేస్తున్నారు.దీంతో రేషన్‌ అందక వెంటబడుతున్న కార్డుదారులకు సర్దిచెప్పలేక డీలర్లు సతమతమవుతున్నారు.

 జిల్లాలో మొత్తం 2,901దుకాణాల పరిధిలో 11.46లక్షల రేషన్‌ కార్డులున్నాయి. డిసెంబరు, జనవరి కోటాలకు కలిపి 32వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయించినట్లు అధికారిక లెక్కలైతే చెబుతున్నాయి.  కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ అన్నయోజన(పీఎంజీకేవై) పథకం కింద కార్డులోని ఒక్కో సభ్యుడికి అయిదు కేజీల బియ్యం చొప్పున ఉచితంగా అందజేస్తోంది.అయితే రాష్ట్రప్రభుత్వం డిసెంబరులో తన కోటా నిత్యావసరాలను మాత్రమే పంపిణీ చేసి పీఎంజీకేవై కోటాను ఆపేసింది.ఈనెల 18నుంచి డిసెంబరుతో కలిపి జనవరి కేంద్రప్రభుత్వ కోటా బియ్యాన్ని ఇస్తోంది. సాధారణ కోటాకే బియ్యం సరఫరా చేయడానికి ఆపసోపాలు పడుతున్న రాష్ట్రప్రభుత్వానికి రెండు కోటాలు కలిపి సమకూర్చడం తలకుమించిన భారంగా మారింది. జనవరి మొదటివారంలో పంపిణీ చేసిన బియ్యంతో కలిపి ఈ నెలలోనే మూడుకోటాలు ఇచ్చినట్లు అవుతుంది. ఈ పరిస్థితిలో డిమాండ్‌కు తగినట్లు మిల్లర్లు రేషన్‌ బియ్యాన్ని సమకూర్చలేకపోతున్నారు. ఫలితంగా రెండు స్టేజీల్లోనూ నిల్వలు నిండుకున్నాయి. దీంతో మండల కేంద్రాల్లోని గోదాములు మూతపడ్డాయి. అక్కడ వ్యాగన్‌ నుంచి వచ్చిన బియ్యాన్ని లారీలకు సర్దుబాటు చేసి, స్టేజ్‌-2 కేంద్రాలకు పంపుతున్నారు. ఇక్కడ కూడా బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేయకుండా అటు నుంచి అటే లారీలకు మార్చేసి చౌకదుకాణాలకు పంపుతున్నారు. అయినప్పటికీ జిల్లాలో పెద్ద కేంద్రాలైన చిత్తూరు, తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తి పరిధిలోని సగం రేషన్‌దుకాణాలకు కూడా బియ్యం చేరలేదు.వారానికి ముందే కాంట్రాక్టర్లు స్టేజీ-2 నుంచి చౌకదుకాణాలకు బియ్యం రవాణా ప్రారంభించగా, అప్పటికే నిల్వ ఉన్న స్టాకు పూర్తయింది. దీంతో సగం షాపులకు స్టాకు చేరగా,  కొన్ని షాపుల్లో గతనెలలో మిగిలిన ఓబీలతో పంపిణీ ప్రారంభం కాగా, ప్రస్తుతం స్టాకు రాకపోవడంతో మధ్యలో బియ్యం సరఫరా ఆగింది.దీంతో కార్డుదారులు దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని చోట్ల ఇస్తున్నారని, ఇక్కడ మాత్రం ఎందుకు రాలేదని,  రేషన్‌ డీలర్లతో కార్డుదారులు వాదనకు దిగుతున్నారు. రెండుకోటాల బియ్యం కావడంతో అప్పటికే తోలిన బియ్యం ఒకట్రెండురోజుల్లో పూర్తయిపోవడంతో మిగిలిన కార్డుదారులు వెనక్కిపోతున్నారు.బియ్యం సరఫరా గాడిలో పడేంతవరకూ అందుబాటులో వున్న స్టాకును..ఎక్కడా తమకు రాలేదనే మాట లేకుండా అన్ని చౌకదుకాణాలకు ఉన్నంతలో సరఫరా చేయాలంటూ గోదాముల ఇన్‌ఛార్జులకు పౌరసరఫరాలశాఖ అధికారులు  ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-01-22T06:38:05+05:30 IST