పథకాల ఎంపికలో‘అధికార’ నేతల హస్తం?

ABN , First Publish Date - 2020-06-05T09:15:42+05:30 IST

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ..

పథకాల ఎంపికలో‘అధికార’ నేతల హస్తం?

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతో కాలంగా పార్టీ జెండాలు మోస్తున్నాం, ప్రభుత్వ పథకాలు మాకివ్వకుండా ఎవరికిస్తారు.. అర్హత ఉన్నా, లేకున్నా మా పేర్లు రాయాల్సిందే. పైఅధికారులతో మేం మాట్లాడుకుం టాం అంటూ తమదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. అస లైన లబ్ధిదారులను పక్కనపెట్టి తమ చిత్తానుసారం జాబి తాలు తయారు చేసి దాని ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆల్టిమేటం జారీచేయడం విస్తుగొలుపుతోంది.


అడ్డగోలుగా జాబితాల తయారీ

టైలర్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఒక్కో లబ్ధి దారుడికి ఏడాదికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ఒక్కసారి లబ్ధిదారుడిగా ఎంపికైతే రానున్న నాలుగేళ్లపాటు ఏడాదికి రూ. 10వేలు వస్తాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న అధికార పార్టీ నేతలు, కార్య కర్తలు టైలరింగ్‌తో పరిచయం లేకున్నా తమ పేర్లు, అనుచరుల పేర్లతో జాబితా తయారు చేయించి ఫొటోలు దిగి అర్జీలు దాఖలు చేశారు. తాము చెప్పిన వారినే ఎంపిక చేయాలని ఒత్తిడి తీసుకురావటంతో వలంటీర్లు, సచివా లయ సిబ్బంది, అధికారులు తలలు పట్టుకుంటున్నారు.


చేనేత కార్మికుల ఎంపికలోనూ సిత్రాలెన్నో..

చేనేత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వైఎస్సార్‌ నేతన్నహస్తం పథకం ద్వారా ఏడాదికి ఒక్కో లబ్ధిదారుడికి రూ.24వేలు ప్రభుత్వం అందజేస్తోంది. చేనేత కార్మికుల ఎంపికలోనూ చిత్రవిచిత్రాలు చోటు చేసుకోవడం గమనార్హం. బందరు మండలం చిన్నాపురం పంచాయతీలో 120 చేనేత కుటుంబాలున్నాయి. మరికొంతమంది చల్లపల్లి మండలం మాజేరులో నివాసం ఉంటున్నారు. వాస్తవానికి చిన్నాపురంలో 21 కుటుంబాలు మగ్గాలపై పనిచేస్తుండగా 120 కుటుంబాలను ఈ ఏడాది ఎంపిక చేయడం గమనార్హం. 


జాబితాలో చేర్చినపేర్లన్నీ అర్హులుగా రావడం గమనార్హం. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.2వేలు నుంచి రూ.3వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మాజేరులో నివాసం ఉంటున్నవారిని చిన్నాపురంలో ఉన్నట్లుగా చూపి, చిన్నాపురం వలంటీర్ల లాగిన్‌ ద్వారా లబ్ధిదారుల జాబితాలో చేర్చడం చర్చనీయాంశంగా మారింది. అదేమని వలంటీర్లు ప్రశ్నిస్తే మీకిష్టం ఉంటే పనిచేయండి, లేకుంటే పనిచేయలేమని రాసివ్వండి అంటూ ఓ మహిళా అధికారి తమపై ఒత్తిడి తెస్తున్నట్లు చిన్నాపురం వలంటీర్లు వాపోతున్నారు. చేనేత కార్మికుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు లేవని, ఈ ఏడాది జనవరి నెలలోనే దరఖాస్తుల స్వీకరణ పూర్తయిందని చేనేత జౌళిశాఖ ఏడీ రఘునంద తెలిపారు. 

Updated Date - 2020-06-05T09:15:42+05:30 IST