కోటాకు పట్టాభిషేకం

ABN , First Publish Date - 2021-03-29T05:35:59+05:30 IST

కోటా డోరియా... రాజస్తాన్‌ సంప్రదాయ చేనేత. ధరిస్తే సౌకర్యంగా... తేలిగ్గా... హాయిగా గాలి తగిలేలా ఉంటుంది. భారత్‌లోని వేడి వాతావరణానికి సరిగ్గా సరిపోయే మన్నికైన వస్త్రం ఇది. అంతేకాదు... ఆడవారు... మగవారు... ఎవరికైనా ఎలాగైనా ఉపయోగించుకొనే వీలున్న మెటీరియల్...

కోటాకు పట్టాభిషేకం

నాడు పెట్టుబడి... పాతిక వేలు. నేడు టర్నోవర్‌... నాలుగు కోట్లు. సంప్రదాయ కోటా డోరియాకు ఆధునిక హంగులద్ది... ఆరేళ్లలో అనితరసాధ్యమైన లక్ష్యాన్ని అందుకున్నారు పారిశ్రామికవేత్త అంజలీ అగర్వాల్‌. మూలనపడ్డ మగ్గాలను కదిలించి... నేతన్నలకు నిరంతర పని గంటలు కల్పించారు. అంతే కాదు.. ఆమె విక్రయించే వస్త్రాలలో దాదాపు 60 శాతం కొనుగోలు చేసేది మన తెలుగు రాష్ట్రాల మహిళలు కావటం ఒక విశేషం. ఆమె తన ప్రస్థానం గురించి నవ్యకు ప్రత్యేకంగా వివరించారు. 


కోటా డోరియా... రాజస్తాన్‌ సంప్రదాయ చేనేత. ధరిస్తే సౌకర్యంగా... తేలిగ్గా... హాయిగా గాలి తగిలేలా ఉంటుంది. భారత్‌లోని వేడి వాతావరణానికి సరిగ్గా సరిపోయే మన్నికైన వస్త్రం ఇది. అంతేకాదు... ఆడవారు... మగవారు... ఎవరికైనా ఎలాగైనా ఉపయోగించుకొనే వీలున్న మెటీరియల్‌. ‘‘దీనిని స్థానికంగా ఎసీ మెటీరియల్‌ అని పిలుస్తారు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ప్రిఫర్‌ చేస్తుంటారు. నా చిన్నప్పటి నుంచి కూడా వీటినే వాడేదాన్ని. అయితే ఇతర ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా వాడేవారు కారు. కోటా డోరియా చీరలైతే అందరికీ తెలిసినవే కానీ... దుపట్టాలు, చుడీదార్ల, సల్వార్‌ సూట్స్‌ కొన్ని ప్రాంతాలలోనే పరిమితంగా దొరికేవి’’ అంటారు అంజలీ అగర్వాల్‌. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివి.. ఐబీఎంలో మంచి ఉద్యోగం చేసే అంజలీ కోటా వస్త్రాలను విక్రయించే ఆన్‌లైన్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి ఒక కారణముంది.  ‘‘దాదాపు ఏడేళ్ల క్రితం.. ఆఫీసుకు ఎప్పుడూ కోటా సల్వార్‌ సూట్స్‌ ధరించి వెళ్లేదాన్ని. వాటిని చూసిన సహోద్యోగులు, స్నేహితులు తమకూ ఆ చేనేతలు కావాలని అడిగేవారు. నేను రాజస్తాన్‌లోని కోటాలోనే పుట్టి పెరిగాను. దాంతో అక్కడికి వెళ్లినప్పుడల్లా వారి కోసం ఆ దుస్తులు కొని తెచ్చేదాన్ని. అన్ని ప్రాంతాల్లో విరివిగా దొరికే వెరైటీ కాకపోవడంవల్ల రాను రాను అడిగేవాళ్లు ఎక్కువైపోయారు. ఒక్కదాన్నే ఎంతమందికని తేగలను? నా సూట్‌కేస్‌ సరిపోయేది కాదు. అప్పుడు వీటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది’’ అంటారు అంజలి. 


ఆరంభంలో సవాళ్లెన్నో...

ఆ ఆలోచనకు ప్రతి రూపమే ‘కోటా డోరియా సిల్క్‌’ (కేడీఎస్‌) సంస్థ. ‘‘ 2014లో వ్యాపార రంగంలో నా ప్రయాణం మొదలైంది. ఒక వ్యాపారం ప్రారంభించడమంటే పెద్ద సవాలే! ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. సరైన వస్త్రాన్ని ఎంచుకోవడం, సేకరించడం, జనానికి నచ్చేలా కొత్త కొత్త డిజైన్లు రూపొందించడం, మార్కెట్‌ను అర్థం చేసుకోవడం, సమయానికి కస్టమర్‌ చేతులో దుస్తులు ఉండేలా చూడడం... ఇలా ఎన్నో సవాళ్లు. రాత్రి మూడు గంటల దాకా పనిచేస్తూ ఫ్యాక్టరీలో ఉండిపోయిన సందర్భాలెన్నో.. ఇలాంటి కష్టాలన్నీ.. ఎవరైనా నా వస్త్రాలను మెచ్చుకుంటే కరిగిపోయినట్లు అనిపిస్తాయి..’’ అంటారామే!  దేశంలో ఎన్నో రకాల వస్త్రాలుండగా కోటా డోరియానే ఎందుకు ఎంచుకున్నారని అడిగితే... ధరిస్తే అందులో ఉండే సౌకర్యమే కారణం అంటారు అంజలి. ‘‘ఆడవారు, మగవారు... ఎవరికైనా ఇట్టే నప్పుతుంది. అదే సమయంలో చూడ్డానికి హుందాగానూ ఉంటుంది. అందుకే ఇంతటి ప్రత్యేకత గల ఫ్యాబ్రిక్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనుకున్నాను. అంతిమంగా ఫ్యాషన్‌ రంగంలో ప్రత్యేకంగా నిలబెట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు తేవాలన్నది నా లక్ష్యం. దానికితోడు కోటా వస్త్రాల నేత పనివారు చాలా తక్కువమంది ఉన్నారు. వాళ్లు కూడా పట్టు చీరలు మాత్రమే నేస్తున్నారు. వాటి జరీ కోసం బంగారు, వెండి దారాలు ఉపయోగిస్తున్నారు. ఇది చాలా ఖరీదైనది. అలాకాకుండా అందుబాటు ధరలో, ఆఫీసులకు వెళ్లే మహిళలు రోజూ ధరించడానికి అనువైన సల్వార్‌ సూట్స్‌, చీరల వంటివి రూపొందింస్తే బాగుంటుందనిపించింది. ఈ ఆలోచనే ‘కేడీఎ్‌స’కు రూపం ఇచ్చింది’’ అని అంజలి చెప్పుకొచ్చారు. 


సంప్రదాయానికి సాంకేతికత... 

అంజలి అగర్వాల్‌ విజయంలో కీలకమైనది సంప్రదాయానికి సాంకేతికతను జోడించడం. ఎందుకలా? ‘‘కోటా డోరియా చాలా సున్నితమైనదే కాదు... ఖరీదైనది కూడా! దానిపై ఎంబ్రయిడరీ వంటివి చేయాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చాలి. సాంకేతికతను జోడించడంవల్ల దాని ప్రత్యేకతను కాపాడుతూనే సరికొత్త రూపాన్ని ఇచ్చినట్టవుతుంది. తయారీ ఖర్చు తగ్గి అందరికీ చేరువవుతుంది’’ అంటున్న అంజలి మొదట తన వ్యాపారాన్ని ఫేస్‌బుక్‌లో ప్రారంభించారు. దాని ద్వారా విపరీతమైన డిమాండ్‌ రావడమే కాదు, వినియోగదారుల అభిరుచులు, అభిప్రాయాలు, మార్కెట్‌ ట్రెండ్స్‌ తెలుసుకోగలిగారు. నెమ్మదిగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో అమ్మకాలు పెంచారు. ఇప్పుడు మొత్తంమీద ‘కేడీఎ్‌స’కు ఐదు లక్షల మందికి పైగా కస్టమర్లున్నారు. టర్నోవర్‌ నాలుగు కోట్ల రూపాయలు దాటింది. ఇది ఒక మహిళగా అంజలి సాధించిన అనితర సాధ్యమైన విజయం. 


చేనేతలకు చేయూత... 

‘కేడీఎస్‌’ బ్రాండ్‌లో కోటా డోరియా చీరలు, ఎంబ్రయిడరీ, అజ్రఖ్‌ కలగలిసిన సూట్‌ మెటీరీయల్‌, బగ్రు, బాగ్‌ ప్రింట్స్‌, టై అండ్‌ డై, మధుబని, కలంకారి తదితర వెరైటీలెన్నో ఉన్నాయి. వాటితోపాటు నేటి తరాన్ని ఆకట్టుకొనేలా డిజిటల్‌ ప్రింట్‌ డ్రెస్‌లు, డోర్‌ కర్టెన్లు, సోఫా కుషన్లు, కవర్లు కూడా రూపొందిస్తుంది సంస్థ. మహిళా సాధికారతకు తొలి ప్రాధాన్యం ఇచ్చే అంజలి ఎంతో మంది చేనేత కళాకారులకు చేయూతనందిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐదు వందల మందికి పైగా మహిళా చేనేత కళాకారులకు ఆమె పని కల్పించారు. ‘కేడీఎస్‌’ రాకతో మూలనపడ్డ వారి మగ్గాలు నిరంతరం ఆడుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన నేతన్నల నుంచి చేనేతలు కొని, వారికి ఉపాధి మార్గం చూపారు. ఆమె టర్నోవర్‌లో అధికమొత్తం తెలుగు రాష్ట్రాల నుంచే సమకూరుతోంది. దుబాయ్‌, ఐరోపా దేశాల నుంచి కూడా ఆర్డర్స్‌ వస్తున్నాయి. త్వరలో హైదరాబాద్‌లో ఒక స్టోర్స్‌ను ప్రారంభిస్తాననే అంజలి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.  


హోలీ... జాగ్రత్తలివి!

రంగుల పండుగ హోలీ రోజున ఒళ్లంతా రంగులమయం అవుతుంది. జుట్టు మొత్తం రంగులతో నిండిపోతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రంగుల వల్ల జుట్టు, చర్మం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. అవేమిటంటే...


  1. హోలీ ఆడే ముందు జుట్టుకు నూనె రాసుకోవాలి. దీనివల్ల జుట్టుపై పడిన రంగు త్వరగా వదులుతుంది. రంగు అంటినా కూడా కురులు దెబ్బతినవు. 
  2. జుట్టును పూర్తిగా కవర్‌ చేస్తూ దుపట్టా కప్పుకోవాలి. దుపట్టా స్టయిల్‌గా ఉండటంతో పాటు జుట్టుకు రక్షణనిస్తుంది. 
  3. ఒంటిపై రంగులు పడకుండా చేతులు పూర్తిగా కవర్‌ చేసే దుస్తులు ధరించాలి. చేతులు, కాళ్లకు బాదం లేదా కొబ్బరినూనె నూనె రాసుకుంటే రంగుల ప్రభావం చర్మంపై పడకుండా చూడొచ్చు. 
  4. సున్నితమైన చర్మం ఉన్నవారు రంగుల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. మరీ తప్పదనుకుంటే రసాయనాలు కలపని రంగులతో హోలి ఆడాలి. 
  5. సాధారణ చర్మం ఉన్నవారు వాటర్‌ప్రూఫ్‌ సన్‌స్ర్కీన్‌ లోషన్‌లో ఒక చుక్క బేబీ ఆయిల్‌ వేసి ముఖానికి రాసుకుంటే చర్మం దెబ్బతినకుండా చూసుకోవచ్చు.
  6. హోలి ఆడడానికి ముందే ముఖానికి ఆయిల్‌ ఫ్రీ మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ రాసుకోవాలి.
  7. హోలీ ఆడటం పూర్తయిన తరువాత జుట్టును వెంటనే శుభ్రం చేసుకోవాలి. దువ్వెనతో వెంట్రుకలకు అంటిన రంగును తొలగించాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. మైల్డ్‌ షాంపూ ఉపయోగించవచ్చు. స్నానం తరువాత హెయిర్‌మాస్క్‌ అప్లై చేసుకోవాలి. పదినిమిషాలయ్యాక చల్లటి నీటితో కడుక్కొని,   హెయిర్‌ సీరం రాసుకోవాలి. 
  8. పొడి రంగులు అంత త్వరగా వదలవు. అందుచేత శరీరానికి ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మరసంతో నెమ్మదిగా మసాజ్‌ చేస్తున్నట్టుగా రాసుకోవాలి. ఒక గంట తరువాత స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మరచిపోవద్దు.
  9. రంగులు శుభ్రం చేసుకున్నాక చేతులకు, పాదాలకు లోషన్‌ రాసుకోవాలి. వీలైతే మరుసటి రోజు మెనిక్యూర్‌, పెడిక్యూర్‌ చేయించుకోవాలి.
  10. చర్మంపై ఎక్కడైనా ర్యాషెస్‌ కనిపిస్తే లాక్టో కాలమైన్‌ లోషన్‌ రాసుకోవాలి. యాంటీ ఎలర్జీ మందులు వేసుకోవచ్చు. అప్పటికీ ర్యాషెస్‌ తగ్గకపోతే చర్మనిపుణులను సంప్రదించాలి.       





‘కేడీఎస్‌’ రాకతో మూలనపడ్డ వారి మగ్గాలు నిరంతరం ఆడుతూనే ఉన్నాయి.  లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన నేతన్నల నుంచి చేనేతలు కొని, వారికి ఉపాధి మార్గం చూపారు. ఆమె టర్నోవర్‌లో అధికమొత్తం తెలుగు రాష్ట్రాల్లోని కోటా డోరియా ఇష్టపడేవారి నుంచే సమకూరుతోంది. దుబాయ్‌, ఐరోపా దేశాల నుంచి కూడా ఆర్డర్స్‌ వస్తున్నాయి.


www.kotadoriasilk.com          

- నవ్యడెస్క్‌

Updated Date - 2021-03-29T05:35:59+05:30 IST