చేతికొచ్చిన పంట.. చేనులోనే నిల్వ

ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST

అనేక అష్టకష్టాలు పడి వేసవిలో జొన్న పంటను సాగుచేసినా పంట కొను గోళ్లపై అధికారులకు పట్టింపే లేకపోవడంతో రైతులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చేతికొచ్చిన పంటను చేనుల్లోనే నిల్వ చేసుకుంటూ కొనుగోలు కేం ద్రాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.

చేతికొచ్చిన పంట.. చేనులోనే నిల్వ

జిల్లాలో ప్రారంభంకాని జొన్న పంట కొనుగోళ్లు 

వెంటాడుతున్న అకాల వర్షాలు

అత్యవసరాల పేరిట దళారులకు విక్రయిస్తున్న రైతులు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

ఆదిలాబాద్‌, మే9 (ఆంధ్రజ్యోతి): అనేక అష్టకష్టాలు పడి వేసవిలో జొన్న పంటను సాగుచేసినా పంట కొను గోళ్లపై అధికారులకు పట్టింపే లేకపోవడంతో రైతులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చేతికొచ్చిన పంటను చేనుల్లోనే నిల్వ చేసుకుంటూ కొనుగోలు కేం ద్రాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 34వేల 160 ఎకరాల్లో జొన్న పంట సాగైంది. ఈ సారి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, సరి పడా నీటితడులు అందడంతో దిగుబడులు ఆశా జనకం గానే వస్తున్నాయి. దీంతో ఎకరాన 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కాన జిల్లాలో 5లక్షల క్వింటాళ్లకు పైగానే దిగుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ పంట చేతికొచ్చిన సమయం లోనే కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంతో సగం పంట దళారుల పాలవుతునే ఉంది. ఏటా సగం పంట అమ్మిన తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం అధికారులకు అలవాటుగానే మారింది. రైతుల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దళారులు అందినకాడికి దండుకోవడంతో రైతు లు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. పంటవేసిన తర్వాత మూడు నాలుగు మాసాల సమయం ఉన్నా.. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జాప్యం కావడం వెనుక పాలకులు, అధికారుల నిండూ నిర్లక్ష్యం కనిపి స్తోంది. చేతికొచ్చిన పంటను అమ్ముకునే దారిలేక, నిల్వ చేసుకునే వసతి లేక అన్నదాతలు ఆందోళనకు గురవుతుంటే అధికారులు మాత్రం మొద్దు నిద్రలోనే కనిపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు అందలేవంటూ మార్కెటింగ్‌ అధికారులు కాలయాపన చేయడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 

దిగుబడులు వచ్చినా దిగులే..

చేతికొచ్చిన పంటను చేనులోనే కుప్పలుగా పోసి అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతు లు పడరాని పాట్లు పడుతున్నారు. రాత్రి, పగలు పంట చేనుల్లోనే పంటకు కాపలగా పడికాపులు కాస్తున్నారు. నిత్యం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంట కుప్పలపై పాలథిన్‌ కవర్లు వేసిన ఈదురు గాలుల బీభత్సవానికి చెదిరిపోయి పంట దిగుబడులు తడిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పగలంతా పంటను ఆరబోయడం, సాయంత్రం సమయంలో కుప్పలుగా చేసి పాలథిన్‌ కవర్లు కప్పడం రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. పంట చేతికొచ్చినా అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో ఎదురు చూడాల్సి వస్తోంది. 

క్వింటాలుకు రూ.వెయ్యి నష్టం..

రైతులు అత్యవసరాల పేరిట పంటను అమ్మేసుకోవ డంతో ఒక్కో క్వింటాలుకు రూ.1000 నుంచి రూ.1100  వరకు నష్టం వస్తోంది. క్వింటాలు జొన్న పంటకు ప్రభు త్వం మద్దతు ధరగా రూ.2620గా ప్రకటించింది. కానీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో బయ ట మార్కెట్‌లో క్వింటాలుకు రూ.1500 నుంచి రూ.1600 వరకు రైతులు పంటను అమ్మేసుకుంటున్నారు. అకాల వర్షాలకు తడిసిన పంటను నాణ్యత లేదన్న కారణంగా వెయ్యి రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. కరోనా పరిస్థితులతో పొరుగున ఉన్న మహారాష్ట్రకు వెళ్లి పంటను అమ్ముకునే కనిపించడం లేదు. దీంతో దళారులు ఇంటికే వచ్చి రైతు లను మభ్యపెడుతూ తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా బహిరంగం గానే జరుగుతున్న సంబంధిత అధికారులు, పాలకులు మాత్రం పట్టించుకున్నట్లే కనిపించడం లేదు. ఏది ఉచితం ఇవ్వకున్న పండించిన పంటలకు సరైన మద్దతు ధర, మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తే సరిపోతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

ఏటా ఇదే తంతు..

అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏటా ఇదేతంతూ కనిపి స్తోంది. పంటల సాగు విస్తీర్ణం అధికారులకు ముందే తెలిసిన ముందు చూపులేక పోవడంతో రైతులు నష్ట పోవాల్సి వస్తోంది. పంట వేసిన తర్వాత సుమారు 3, 4 మాసాల పాటు సమయం ఉంటుంది. కానీ ప్రతిసారి పంట కొనుగోళ్లలో జాప్యం జరుగుతూనే ఉంది. ముందు చూపుతో పంట చేతికొచ్చే సమయానికే కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేసి ఉంటే  రైతులు నష్టపోయే అవకాశం ఉండదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవ డంతో మద్దతు ధరను ప్రకటించిన ఎలాంటి ప్రయోజనం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర రూ.2620 కాగా దళారులు మాత్రం రూ.1500 నుం చి రూ.1600లకే పంటను కొనుగోలు చేస్తున్నారు. ఇలాం టి పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే రైతులకు ఎంతోమేలు జరిగే అవకాశం ఉం టుంది. ఎన్నో ఏళ్లుగా రైతు సంఘాల నాయకులు సాగు లో అనుభవజ్ఞులైన రైతులు ప్రభుత్వానికి ఈవిషయమై ఎన్ని సార్లు చెప్పినా అధికారుల తీరు మాత్రం మారడం లేదంటున్నారు.

Updated Date - 2021-05-09T05:30:00+05:30 IST