టీడీపీ పాదయాత్రపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2020-10-25T10:55:04+05:30 IST

హంద్రీ-నీవా సాధనకోసం రామకుప్పం మండలం నుంచి ఈ నెల 26వ తేదీన టీడీపీ తలపెట్టిన పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

టీడీపీ పాదయాత్రపై ఉత్కంఠ

అడ్డుకుంటామని వైసీపీ అల్టిమేటం

అనుమతి లేదంటూ విపక్ష నేతలకు పోలీసుల నోటీసులు


కుప్పం, అక్టోబరు 24: హంద్రీ-నీవా సాధనకోసం రామకుప్పం మండలం నుంచి ఈ నెల 26వ తేదీన టీడీపీ తలపెట్టిన పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. కుప్పం నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీరు అందించడానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీ-నీవా కుప్పం బ్రాంచి కెనాల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందు ఈ కాలువలో రామకుప్పం వరకు నీళ్లొచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక పనులు ఆగిపోయాయి.  దీంతో హంద్రీ-నీవా సాధనకోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి కుప్పం నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఈ నెల 26వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.


ఈ యాత్ర రామకుప్పం మండలం బైపరెడ్లపల్లె నుంచి మొదలై ఈ నెల 30న కుప్పం మండలంలో ముగిసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ శ్రేణులను అందుకు సమాయత్తం చేశారు. అయితే టీడీపీ పాదయాత్రను అడ్డుకుంటామని ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు భరత్‌ శనివారం ప్రకటించారు. అదేసమయంలో పాదయాత్రకు అనుమతిలేదని కాదని యాత్ర చేపడితే చర్యలు తప్పవని పోలీసులు నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నాయకులకు శనివారమే నోటీసులు జారీ చేశారు. టీడీపీ జిల్లా నాయకులు కూడా పాల్గొంటారని ప్రచారమవుతున్న ఈ పాదయాత్ర చివరకు ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. 

Updated Date - 2020-10-25T10:55:04+05:30 IST