ఆనందమే బ్రహ్మము

ABN , First Publish Date - 2020-08-12T09:03:42+05:30 IST

భృగువు ఒకసారి తన తండ్రియైున వరుణుని వద్దకు వెళ్లి.. బ్రహ్మమును గురించి తెలుపవలసిందిగా కోరుతాడు. అప్పుడు వరుణుడు పుత్రునితో ‘‘దేనివలన ఈ ప్రాణులు, పదార్థాలన్నీ పుడుతున్నాయో,

ఆనందమే బ్రహ్మము

భృగువు ఒకసారి తన తండ్రియైున వరుణుని వద్దకు వెళ్లి.. బ్రహ్మమును గురించి తెలుపవలసిందిగా కోరుతాడు. అప్పుడు వరుణుడు పుత్రునితో ‘‘దేనివలన ఈ ప్రాణులు, పదార్థాలన్నీ పుడుతున్నాయో, దేని వలన పుట్టినవి జీవిస్తున్నాయో, దేని యందు లీనమవుతున్నాయో అది బ్రహ్మము’’ అని చెప్పి, ‘దానిని నీవే తెలుసుకో’ అని చెబుతాడు. అప్పుడు భృగువు బ్రహ్మమును తెలుసుకోవడానికి తపస్సు చేస్తాడు. ఆ తపస్సులో ఆయనకు.. అన్నమే బ్రహ్మమని తెలుస్తుంది. ఎందుకంటే ప్రాణుల శరీరాలన్ని అన్నము వలననే పుడుతున్నాయి. పుట్టిన ప్రాణులన్నీ అన్నము చేతనే పోషింపబడుతున్నాయి. చివరకు అన్నము (మట్టి) యందే కలిసి పోతున్నాయి. కాబట్టి అన్నమునే బ్రహ్మముగా తెలుసుకున్నానని తండ్రిని సమీపించి చెబుతాడు. అప్పుడు వరుణుడు ఆయనను ఇంకా తపస్సు చేయమంటాడు. 

మళ్లీ తపస్సు చేసిన భృగువు.. ఈసారి ప్రాణమును బ్రహ్మముగా తెలుసుకుంటాడు. ఎందుకంటే ప్రాణము వలనే ప్రాణుల శరీరాలు పుడుతున్నాయి. ప్రాణము చేతనే పుట్టినవి జీవిస్తున్నాయి. ప్రాణములందే లీనమవుతున్నాయి. కాబట్టి ప్రాణమే బ్రహ్మముగా ఎరిగినానని చెప్పగా.. ‘‘ఇంకా తపస్సు చెయ్యి. బ్రహ్మము నెరుగుటకు తపస్సే సాధనం’’ అని వరుణుడు చెబుతాడు. ఈసారి తపస్సులో.. ‘మనసే బ్రహ్మము’ అని భృగువుకు తెలుస్తుంది. ఎందుకంటే మనసులోనే సంకల్పాలు కలుగుతాయి. ఇంద్రియాలన్నింటికీ మనసే ఆధారం. సంకల్పాల కారణంగానే జీవులకు శరీరాలు లభిస్తాయి. కర్మఫలాలను అనుభవించడానికి శరీరస్థితి ఏర్పడుతుంది. శరీరం నశించినప్పుడు జీవుడు వాయురూపంలో వెళ్లిపోతాడు. కాబట్టి శరీరోత్పత్తి, స్థితి, లయములకు మనసు కూడా కారణమవుతున్నది. కావున అది బ్రహ్మమని తలచి తండ్రికి ఆ విషయమే చెబుతాడు. అప్పుడు తండ్రి.. ఇంకా తపస్సు చేయాల్సిందిగా సూచిస్తాడు. ఈసారి విజ్ఞానం బ్రహ్మమని భృగువు తలుస్తాడు. విజ్ఞానమంటే నిశ్చయాత్మక జ్ఞానం. అదే బుద్ధి. ఆ విషయం చెప్తే.. ఇంకా తపస్సు చేయమంటాడు వరుణుడు. తపస్సులో మరలయత్నించిన భృగువు ఆనందమే బ్రహ్మముగా తెలుసుకుంటాడు. ‘ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌’ ఆనంద రూపమగు బ్రహ్మమే కారణమని, బ్రహ్మమే కర్త అని రూఢి చేసుకుంటాడు. 


భృగువును వరుణుడు అన్నిసార్లు తపస్సు చేయాల్సిందిగా ఎందుకు ఆదేశించాడంటే.. అసలైన బ్రహ్మము గురించి ఆయన తెలుసుకోవడానికే. భృగువు మొదట అన్నము బ్రహ్మమని ఎరిగినప్పటికీ.. అన్నానికి కారణం ఉంది. బ్రహ్మమంటే కారణం లేనిది. కాబట్టి మరోసారి తపస్సు చేయాలంటాడు. అదే విధంగా ప్రాణం, మనసు, విజ్ఞానం అన్నింటికీ కారణం ఉన్నది. ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి ప్రాణం జనిస్తున్నాయి. మనసు, విజ్ఞానం ఆత్మాశ్రితాలు. కాబట్టి, ఆనంద స్వరూపమైన బ్రహ్మమే ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణమని, బ్రహ్మమునకు ఇంకొక కారణం లేదు అని చివరకు తెలుసుకుంటాడు. ఆనంద స్వరూపమైన బ్రహ్మము నెరిగినవాడు ఆనందంలో ఉండి దానిననుభవిస్తాడు. ప్రపంచంలో ఆనందంగా ఉన్నవాడు తృప్తిగా ఉంటాడు. మనం పొందే ఆనందం ఏదో కారణంచేత కాబట్టి ఆ దొరికిన దానిని బట్టి అది క్షణికమైనది లేదా కొద్దికాలం ఉండేది అవుతుంది. కాబట్టి కారణం లేకుండా ఆనందంగా ఉండడమే మోక్షం అనబడుతుంది. 


జక్కని వేంకటరాజం, 9440021734

Updated Date - 2020-08-12T09:03:42+05:30 IST