యువకుల వేధింపులు.. బస్సాపని డ్రైవర్! మరోదారిలేక ఆ బాలికలు..

ABN , First Publish Date - 2021-01-09T21:38:39+05:30 IST

బస్సులో ఆకతాయిల వేధింపులు తట్టుకోలేని ఇద్దరు బాలికలు బస్సాపండి అంటూ డ్రైవర్‌ను వేడుకున్నారు. వారి వేధింపులు భరించలేకున్నాము..దిగిపోతామంటూ కాళ్లావేళ్లాపడ్డారు. కానీ డ్రైవర్ మాత్రం ససేమిరా అన్నాడు. యువకుల వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో నిస్సహాయ స్థితిలో కూరుకుపోయిన ఆ ఇద్దరు బాలికలు మరోదారిలేక దారుణ నిర్ణయం తీసుకున్నారు.

యువకుల వేధింపులు.. బస్సాపని డ్రైవర్! మరోదారిలేక ఆ బాలికలు..

లక్నో: బస్సులో ఆకతాయిల వేధింపులు తట్టుకోలేని ఇద్దరు బాలికలు బస్సాపండి అంటూ డ్రైవర్‌ను వేడుకున్నారు. వారి వేధింపులు భరించలేకున్నాము..దిగిపోతామంటూ కాళ్లావేళ్లాపడ్డారు. కానీ డ్రైవర్ మాత్రం ససేమిరా అన్నాడు. యువకుల వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో నిస్సహాయ స్థితిలో కూరుకుపోయిన ఆ ఇద్దరు బాలికలు మరోదారిలేక దారుణ నిర్ణయం తీసుకున్నారు. వేగంగా వెళుతున్న బస్సు నుంచి అమాంతం కిందకు దూకేశారు. దీంతో ఒకరి తలకి గాయాలవగా మరొకరి కాలి ఎముక విరిగిపోయింది. మనసును కలిచివేసే ఈ ఉదంతం గురువారం గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరిగింది. 


12వ తరగతిలో ఉన్న బాలికలు ఇద్దరూ రాన్హెరా గ్రామంలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కారు. వారు బీరమ్‌పూర్‌లో దిగాల్సి ఉంది. ఈలోపు..బస్సు ఎక్కిన మరో నలుగురు యువకులు అసభ్య వ్యాఖ్యలు చేస్తూ బాలికలను వేధించ సాగారు. ‘ఈ రోజు బస్సు అస్సలు ఆగదు. భలే మజా చేస్తున్నాం’ అంటూ భీతి గొలిపే కామెంట్లు చేయసాగారు. బీరంపూర్ చేరుకున్నా కూడా డ్రైవర్ బస్సు ఆపేందుకు నిరాకరించి, మరింత వేగంగా ముందుకు తోలాడు. భయంతో వణికిపోయిన ఆ బాలికలిద్దరూ ఒక్క ఉదుటున బస్సులోంచి దూకేశారు. అదృష్టవశాత్తూ ఈ గండం నుంచి ప్రాణాలతోనే బయటపడ్డారు. ఈ దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సు వేరే మార్గంలో వెళ్లాల్సి ఉండటంతో బీరమ్‌పూర్‌లో ఆపడం కుదరలేదని డ్రైవర్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో డ్రైవర్‌ పేరు మాత్రమే ప్రస్తావించారు. దీంతో.. బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుల ప్రస్తావన లేకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం.. డ్రైవర్ బాలికలకు క్షమాపణ చెప్పాడని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని చెప్పుకొచ్చారు. 

Updated Date - 2021-01-09T21:38:39+05:30 IST