అగ్రరాజ్యంలో బీభత్సం

ABN , First Publish Date - 2021-01-08T07:23:46+05:30 IST

మరో 13 రోజుల్లో కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం జరగనున్న తరుణంలో అమెరికాలో అరాచ కం రాజ్యమేలింది. నవంబరులో జరిగిన

అగ్రరాజ్యంలో   బీభత్సం

  • కేపిటల్‌ భవనంపై ట్రంప్‌ అనుచరుల దాడి.. కాంగ్రెస్‌ సమావేశాలను అడ్డుకునే యత్నం
  • స్వయంగా ప్రోత్సహించిన ట్రంప్‌
  • 4 గంటలపాటు హింసా విధ్వంసాలు
  • సొరంగంలో, టేబుళ్ల కింద దాక్కున్న సభ్యులు
  • కాల్పుల్లో ఒకరు, వైద్యం అందక ముగ్గురి మృతి
  • అరాచకవాదుల్ని తరిమేశాక  మళ్లీ సమావేశం
  • 46వ అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నిక ధ్రువీకరణ
  • ఓడిపోయా.. అధికారం అప్పగిస్తా: ట్రంప్‌
  • ట్రంప్‌ తీరుపై అమెరికాలో ఆగ్రహావేశాలు
  • ఆయనపై అభిశంసనకు కాంగ్రెస్‌ యోచన


అగ్రరాజ్య చరిత్రలో కనీవినీ ఎరుగని కల్లోలం... అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌- చివరకు ఓ విలన్‌లా మారారు.. తిరుగుబాటు చెయ్యండని మద్దతుదారులను స్వయంగా రెచ్చగొట్టారు. అంతే... వారు విశృంఖలంగా చెలరేగిపోయారు. దేశ ప్రజాస్వామ్య సౌధంపై దాడి చేశారు. కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు జరుగుతున్న - ప్రతినిధుల సభ, సెనెట్‌ల సంయుక్త సమావేశంపై విరుచుకుపడ్డారు. ప్రాణభయంతో సభ్యులు పరుగులు తీశారు. సొరంగ మార్గంలో దాక్కున్నారు. టేబుళ్లు, బల్లల కింద దూరారు. గదుల్లోకి వెళ్లి బతికి బట్టకడతామా.. అని తల్లడిల్లిపోయారు.




క్షణ క్షణం... భయం.. భయం... నాలుగ్గంటల పాటు సాగిన ఈ అరాచకపర్వంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు, వైద్యసాయం అందక మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయంగా, మాయని మచ్చగా మిగిల్చిన ఈ విద్రోహ దాడి ప్రపంచదేశాలను స్థాణువుల్ని చేసింది. స్వయానా ఓ సిటింగ్‌ అధ్యక్షుడు అల్లర్లను రెచ్చగొట్టడం 200 ఏళ్ల అమెరికన్‌ చరిత్రలో ఇదే ప్రథమం.


ఈ ‘తిరుగుబాటు’తో  అమెరికా ప్రజాస్వామ్యంలోని బేలతనం, డొల్లతనం మరోమారు ప్రస్ఫుటమయ్యాయి.. చివరకు ఈ అల్లర్లను అదుపులోకి  తెచ్చాక కాంగ్రెస్‌ సమావేశమై బైడెన్‌ ఎన్నికకు ఆమోదముద్ర వేసింది. అప్పటికే నలువైపుల నుంచీ విమర్శల రాళ్లు మీద పడుతుండడంతో ట్రంప్‌ తోకముడిచారు... ఓటమిని ఒప్పుకున్నారు.




 వాషింగ్టన్‌, జనవరి 7: మరో 13 రోజుల్లో కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం జరగనున్న తరుణంలో అమెరికాలో అరాచ కం రాజ్యమేలింది. నవంబరులో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక కోర్టు కేసులు, నిరసన ర్యాలీలతో అసహనాన్ని ప్రదర్శించిన డొనాల్డ్‌ ట్రంప్‌ చివరకు హింసా మార్గంలోకి దిగిపోయారు. పాపులర్‌ ఓట్లతో పాటు భారీగా ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు కూడా సాధించిన డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఎన్నికను లాంఛనంగా ధ్రువీకరించేందుకు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం కేపిటల్‌ భవనంలో ప్రతినిధుల సభ, సెనెట్‌ల సంయుక్త సమావేశం మొదలైంది. ఈ సమావేశం తన అధికారం మొత్తంగా పరిసమాప్తమయ్యే ఆఖరిదశ కావడంతో ట్రంప్‌లో వికృతకోణం తొంగిచూసింది.


కేపిటల్‌ భవనానికి తరలిరావాలని అప్పటికే తన యంత్రాంగం ద్వారా అనుచరులకు సమాచారం పంపడంతో వేలాది మంది మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు. వారందరినీ ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్‌ ‘మీ తడాఖా చూపండి’ అంటూ మాఫి యా డాన్‌లా రెచ్చగొట్టారు. ‘మనం మరింత తీవ్రంగా పోరాడాలి. కేపిటల్‌ భవనంలోకి చొరబడాలి. మన(రిపబ్లికన్‌) సెనేటర్లను, ప్రతినిధులను అభినందించాలి. బలంగా పోరాడాలి. లేదంటే ఈ దేశాన్ని బలహీనుల నుంచి తిరిగి మనం సాధించుకోవడం కష్టం. అందరం పెన్సిల్వేనియా ఎవెన్యూ(వైట్‌హౌస్‌ ను కేపిటల్‌ భవనానికి కలిపే మార్గం) మీదుగా మీరంతా మీ బలం చూపాలి’ అని పిలుపునిచ్చారు.


తాను కూడా వారితో కలిసి ఈ తిరుగుబాటులో పాల్గొంటానన్న ట్రంప్‌ దానికి కట్టుబడకుండా తన ఎస్‌యూవీలో తిరి గి వైట్‌హౌ్‌సకు చేరుకుని కేపిటల్‌ హిల్‌ పరిణామాలను టీవీలో వీక్షిస్తూ గడిపారు. ట్రంప్‌ మాటలతో ఆవేశం కట్టలు తెంచుకున్న మద్దతుదారులు ఆయన ఫోటో ఉన్న ప్లకార్డులను, రిపబ్లికన్‌ చిహ్నాలను, అమెరికా జెండాలను చేత బూని ఆయన ప్రసంగం పూర్తికాకముందే వీరావేశంతో కేపిటల్‌ భవనంవైపు దూసుకెళ్లారు. పెద్దగా నినాదాలు చేస్తూ పోలీసు బ్యారికేడ్లను ధ్వంసం చేసి, గోడలు, పోల్స్‌ ఎక్కి భవనంలోపలికి దూకారు. 



విధ్వంసకాండ..

బయటి భీతావహ పరిస్థితిని చట్టసభ సభ్యులకు వివరించిన భద్రతాసిబ్బంది వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడం మొదలెట్టారు. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను, ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీని, ప్రొటెం స్పీకర్‌ చార్లెస్‌ గ్రాస్లీని మొదట సురక్షితమైన గదుల్లోకి చేర్చారు. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లున్న బ్యాలెట్‌ పెట్టెలను కూడా రహస్య ప్రదేశానికి తరలించారు.


ఇది జరుగుతుండగానే ప్రతినిధుల సభ కిటికీ అద్దాలను పగులగొట్టిన అల్లరిమూక లోపలికి తొంగిచూస్తూ బైడెన్‌ను అధ్యక్షుడిగా ధ్రువీకరిస్తే దాడి తప్పదని సభ్యులను హెచ్చరించింది. దాంతో వారు టేబుళ్ల కిందా, బల్లల కిందా దాక్కోవాల్సి వచ్చింది. అలరిమూక ముందుకురాకుండా భద్రతా సిబ్బంది బాష్పవాయువును ప్రయోగించారు. సభ్యులను ఓ భూగర్భ సొరంగమార్గం ద్వారా సురక్షిత ప్రదేశానికి చేర్చారు.  



నగరంలో కర్ఫ్యూ

ట్రంప్‌ నేషనల్‌ గార్డ్స్‌ను కేపిటల్‌ భవనం వద్దకు వెళ్లాల్సిందిగా ఆదేశించడంతో బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అల్లరిమూకను తరిమికొట్టి ఒకటొకటిగా గదులను, కారిడార్లను ఖాళీ చేయించాయి. అంతకుముందే వాషింగ్టన్‌ డీసీ మేయర్‌ మురియల్‌ బౌజర్‌ నగరమంతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు నేషనల్‌ గార్డ్స్‌ అల్లరి మూకల్ని పంపేసి కేపిటల్‌ భవనాన్ని మొత్తం క్లియర్‌ చేశారు. పరిస్థితి మొత్తం అదుపులోకొచ్చాక చట్టసభ సభ్యులంతా తిరిగి సమావేశ గదుల్లోకి చేరుకున్నారు. 


ట్రంప్‌కు పెన్స్‌ షాక్‌

నాలుగు గంటల భీభత్సకాండ తరువాత ఈ రాత్రే మళ్లీ సమావేశమై ప్రక్రియ పూర్తి చేస్తామని స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రకటించారు. అనంతరం ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ నేతృత్వం లో ఉభయ సభల సంయుక్త సమావేశం మొదలైంది. రాష్ట్రాల వారీగా ఎలక్టోరల్‌ ఓట్లను సరిచూశాక దేశ 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ఎన్నికైనట్లు ప్రకటించారు.


మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లలో బైడెన్‌-కమల 306 ఓట్లు సాధించారని, ట్రంప్‌-పెన్స్‌లకు 232 ఓట్లు లభించా యని, అధికారానికి అవసరమైన 270 మార్కును దాటిన బైడెన్‌ దేశాధ్యక్ష బాధ్యతలను ఈనెల 20న చేపడతారని ఆయన డిక్లేర్‌ చేశారు. ట్రంప్‌తో కలిసి తన ఓటమిని ప్రకటించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో గురువారం ఉదయం ట్రంప్‌ తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన జారీ చేశారు. 2024 ఎన్నికల్లోనూ తాను రంగంలోకి దిగొచ్చన్న సంకేతాలను వెలువరించారు. బైడెన్‌ ముందున్నది ముళ్లబాట అని కూడా సంకేతమిచ్చారు.



రాజీనామాల పరంపర

ట్రంప్‌ దిగిరావడానికి ఓ ప్రధాన కారణం.. శ్వేతసౌధంలో ఆయన నియమించిన అనేకమంది ఒకరొకరుగా రాజీనామాలు చేయడం. బుఽధవారంనాడు ఈ తిరుగుబాటు మొదలవగానే రాజీనామాలు ఆరంభమయ్యాయి. ఫస్ట్‌ లేడీ మెలానియా ప్రధాన భద్రతా అధికారి, అమెరికా జాతీయ ఉప భద్రతా సలహాదారు, సోషల్‌ సెక్రటరీ,  డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ, వివిధ విభాగాల సిబ్బంది రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఒబ్రెయిన్‌ రాజీనామాకు సిద్ధపడ్డా కొందరు సిబ్బంది ఆయనను వారించి దేశ భద్రత దృష్ట్యా కొనసాగాలని సూచించారు. దాంతో ఆయన ట్రంప్‌ వైదొలిగాకే తానూ నిష్క్రమిస్తానని ప్రకటించారు. ఈ పరిణామాలతో ట్రంప్‌పై ఒత్తిడి ఒక్కువైంది.


అంతేకాక - రాజ్యాంగంలోని 25వ సవరణను ఉపయోగించిగానీ, అభిశంసించి గానీ అధ్యక్షుణ్ణి పదవీచ్యుతుణ్ని చేయాలని కేబినెట్‌ సభ్యులు, రిపబ్లికన్‌ నేతలు కూడా ఓ దశలో యోచించారు. ఇది తెలిశాక- ట్రంప్‌ అప్రమత్తమయ్యారు. దిగిరాకపోతే సొంతపార్టీ నుంచి కూడా తిరుగుబాటు తప్పదని గ్రహించి అయిష్టంగానే ఆ స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. దీనిపై వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీకి కూడా సమాచారం అందించలేదు.




ఇది హేయం: బైడెన్‌


మధ్యాహ్నం 3:13 సమయంలో ట్రంప్‌ వైట్‌హౌస్‌ నుంచి మరో ట్వీట్‌ చేశారు. ‘హింస వద్దు.. చట్టాన్ని గౌరవించండి’ అని తన మద్దతుదారులకు సందేశం పంపారు. అయితే ఆయన కేపిటల్‌ భవనం విడిచి వెళ్లాల్సిందిగా వారిని కోరకపోవడం విశేషం. ఆ తరువాత రెండు నిమిషాలకు ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్‌ ఓ ట్వీట్‌ చేస్తూ- కేపిటల్‌లోకి ప్రవేశించిన వారంతా దేశభక్తులు’ అని కొనియాడారు. ఇది వివాదాస్పదం కావడంతో కొంతసేపటి తరువాత ఆమె దానిని డిలీట్‌ చేశారు.


సాయంత్రం 4 గంటల వేళ డెలావేర్‌లో ఉన్న జో బైడెన్‌- ఈ హింసను ఖండిస్తూ ఓ ప్రకటన చేశారు. ‘ఇది అసమ్మతి కాదు.. అరాచకం. హేయం.. అవ్యవస్థ. ప్రజాస్వామ్యంపై దాడి. ఖచ్చితంగా ఇది అమెరికన్ల లక్షణం కాదు.. ఇది తక్షణం ఆగాలి. మీరు వెంటనే అల్లరిమూకలకు ఓ సందేశమివ్వండి.. తక్షణం కేపిటల్‌ను వీడాలని చెప్పండి. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా జరిగేట్లు చూడండి’ అని ట్రంప్‌ను కోరారు. 




మీ అభీష్టం నెరవేర్చలేం 

ఎన్నికల ఫలితాలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోర్టుల్లో కేసులూ వేశారు. వారికి ఆ హక్కు ఉంది. కానీ రాజ్యాంగానుసారం వ్యవహరిస్తానని ప్రమాణం చేసిన నేను- తద్విరుద్ధంగా ప్రవర్తించలేను. రిపబ్లికన్‌ ఓటమిని కాదనే హక్కు, అధికారం నాకు లేవు. ఎలక్టోరల్‌ తీర్పును నేను తోసిరాజ     నలేను. హింసతో మీరేమీ సాధించలేరు.

- మైక్‌ పెన్స్‌, ఉపాధ్యక్షుడు 




సరే.. అధికారం అప్పగిస్తా

ఎన్నికల ఫలితాలతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. అయినప్పటికీ ఈనెల 20వ తేదీన సజావుగా అధికార మార్పిడి జరుగుతుంది. కేవలం చట్టబద్ధంగా పడ్డ ఓట్లను మాత్రమే లెక్కించాలన్న మా వాదనపై మున్ముందు కూడా పోరాటం చేస్తాం.  అమెరికా చరిత్రలో నా హయాం ఓ మహత్తరమైనది. అదే సమయంలో అమెరికాను మళ్లీ మహోన్నత దేశంగా చేసేందుకు ఇది ఆరంభం కూడా.. 

  -  ట్రంప్‌, అధ్యక్షుడు


Updated Date - 2021-01-08T07:23:46+05:30 IST