అటవీశాఖలో వేధింపులు

ABN , First Publish Date - 2021-12-07T05:06:08+05:30 IST

జిల్లా అటవీశాఖలోని కొందరు అధికారుల వేధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇంటి పని చేయకున్నా.. అక్రమ వసూళ్లు తీసుకురాకున్నా.. చెప్పిన పని వినకున్నా కిందిస్థాయి సిబ్బందిని సదరు అధికారులు టార్గెట్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

అటవీశాఖలో వేధింపులు
ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వాచర్‌ రవీందర్‌

- శాఖలో కిందిస్థాయి సిబ్బందిపై కొందరు అధికారుల వేధింపుల పర్వం

- చెప్పిన పని వినకుంటే టార్గెట్‌ చేయడమే ఆ అధికారుల పని

- బలవంతపు వసూళ్లు, ఇంటి పనులు చేయకుంటే వేధింపులే..

- ఓ కిందిస్థాయి సిబ్బందికి జీతం ఇవ్వకపోవడమే కాకుండా విధుల నుంచి తొలగించిన వైనం

- ఆవేదనకు గురై ఆ అధికారి ముందే సిబ్బంది ఆత్మహత్యాయత్నం

- పలువురు మహిళా ఉద్యోగినులపై సైతం మానసిక వేధింపులపై విమర ్శలు

- వేధింపులు తట్టుకోలేక రాష్ట్రస్థాయి అధికారులకు ఆకాశరామన్న ఉత్తరాలు

- గతంలోనూ సదరు అధికారిపై కలెక్టర్‌కు, డీఎఫ్‌వోలకు ఫిర్యాదు


కామారెడ్డి, డిసెంబరు 6(ఆంఽధ్రజ్యోతి): జిల్లా అటవీశాఖలోని కొందరు అధికారుల వేధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇంటి పని చేయకున్నా.. అక్రమ వసూళ్లు తీసుకురాకున్నా.. చెప్పిన పని వినకున్నా కిందిస్థాయి సిబ్బందిని సదరు అధికారులు టార్గెట్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా అటవీశాఖలోని డివిజన్‌, రేంజ్‌ స్థాయిలో కొందరు అధికారులు సంవత్సరాల తరబడి పాతుకుపోయారు. శాఖలో వీరు చెప్పిందే వేదం.. చేసిందే పని అన్నతీరుగా విమర్శలు వస్తున్నాయి. చివరకు బదిలీపై జిల్లా అటవీశాఖధికారిగా ఎవరైన వచ్చారంటే చాలు ఆ అధికారిణి సైతం వారివైపు తిప్పుకుని చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నారనే వాదనే సొంతశాఖ సిబ్బంది నుంచి వినిపిస్తోంది. సదరు అధికారుల వేధింపుల తాళలేకే ఓ సిబ్బంది ఏకంగా జిల్లా కేంద్రంలోని అటవీశాఖ జిల్లా కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే ఆ అధికారుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సదరు అధికారులపై అవినీతి, అక్రమ వసూళ్లపై, వేధింపులపై కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది గతంలో సంబంధిత శాఖ మంత్రితో పాటు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు, అప్పటి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకొలేదని కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డీఎఫ్‌వో కార్యాలయంలోనే సిబ్బంది ఆత్మహత్యాయత్నం

అటవీశాఖలోని డివిజన్‌, రేంజ్‌ స్థాయి అధికారుల వేధింపులు తాళలేక ఓ సిబ్బంది ఏకంగా జిల్లా అటవీశాఖ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం అటవీశాఖలోనే కాకుండా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎల్లారెడ్డి అటవీశాఖ డివిజన్‌ పరిధిలోని బొల్లారం బేస్‌ క్యాంపులో రవీందర్‌ వాచర్‌గా గత కొన్ని సంవత్సరాలుగా తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నాడు. సదరు అధికారులు వాచర్‌గా ఉన్న రవీందర్‌కు శాఖాపరమైన పనులే కాకుండా వ్యక్తిగత పనులు చేయించుకునే వారని ఆయన ఆరోపించాడు. స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా సదరు అధికారి మాంసాహారం తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేసేవాడని ఆవేదనతో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా బయట కార్యాలయానికి సంబంధించిన నిధులను గతంలో తన భార్య అకౌంట్‌లో వేసుకోవాలని డివిజన్‌ స్థాయి అధికారి తరచూ వేధింపులకు పాల్పడే వాడని అన్నారు. తాను నిబంధనలకు విరుద్ధంగా చేయబోనని సదరు అధికారులకు చెబుతూ వచ్చాడు. ఇటీవల సదరు అధికారి ఇంటి పనులు చేయనందున గత 4 నెలల జీతం ఇవ్వకుండా వేధించాడని చివరకు ఉద్యోగం నుంచే తొలగించాడు. దీంతో ఆవేదనకు గురైన సదరు సిబ్బంది రవీందర్‌ సోమవారం ఏకంగా జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పెట్రోల్‌ పొసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. అనంతరం రవీందర్‌ అధికారులపై కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పలువురు మహిళా ఉద్యోగినులపై మానసిక వేధింపులు?

అటవీశాఖలో కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నా సదరు అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రధానంగా డివిజన్‌ స్థాయి అధికారిపై ఈ వేధింపుల పర్వం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుందని విమర్శలు వస్తున్నాయి. జిల్లా అటవీశాఖ కార్యాలయంలోనే కాకుండా డివిజన్‌ స్థాయి, రేంజ్‌ స్థాయి కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళ ఉద్యోగినులతో పాటు క్షేత్రస్థాయిలో ఉద్యోగం చేసే సిబ్బందిపై మానసికంగానే కాకుండా శారీరకంగా వేధింపులకు గురిచేసేవాడని ఆరోపణలు వస్తున్నాయి. గత రెండు నెలల కిందట డివిజన్‌ స్థాయిలోని ఓ ఉద్యోగిని సదరు అధికారి మానసికంగా వేధించడంతో కార్యాలయంలో ఎవరికి చెప్పకుండా, కనీసం కుటుంబీకులకు కూడా చెప్పకుండా ఇతర బంధువుల ఇంటికి తన ఆవేదనను చెప్పుకున్నట్లు తెలిసింది. ఇదే విషయమై బాధితురాలి కుటుంబీకులు సదరు అధికారిని నిలదీసినట్లు సమాచారం. ఉద్యోగిని కుటుంబీకులు సదరు అధికారిపై పోలీసు కేసు పెట్టేందుకు ప్రయత్నించగా ఆ అధికారి వారిని బెదిరించడంతో ఏమి చేయలేక పోయారు. దీంతో కొందరు మహిళా ఉద్యోగులు, సిబ్బంది తమ పేరు రాకుండా ఆకాశరామన్న ఉత్తరాలతో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అప్పటి కలెక్టర్‌గా పనిచేసిన శరత్‌కు సైతం ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడంతో సదరు అధికారి వేధింపుల పర్వం కొనసాగుతునే ఉంది.

వినకుంటే టార్గెట్‌ చేయడమే ఆ అధికారి పని

జిల్లా అటవీశాఖలోని కొందరు అధికారుల పనితీరు వివాదాస్పదంగా మారుతోంది. కిందిస్థాయి సిబ్బందిపై వేధింపులే కాకుండా అక్రమ వసూళ్లు, అటవీ భూముల ఆక్రమణలో పాత్ర, వన్యప్రాణుల వేటలోనూ కొందరు అధికారుల ప్రమేయం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ అక్రమాలపై అధికారులను నిలదీసిన కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బందిని టార్గెట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు తాను చెప్పిన పని చేయకున్నా, ఇంటి పనులు చేపట్టకున్నా, అక్రమ వసూళ్లు చేయకున్నా సిబ్బందిపై వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. సిబ్బందిని బదిలీ చేయడం లేకుంటే ఇతర ఆరోపణలు వారిపై వేసి సస్పెండ్‌ చేయించడం, ఉద్యోగం నుంచి తొలగించడం లాంటివి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. శాఖ నిధులను తన అకౌంట్‌లో వేసుకోలేదని, ఇంటి పనులు చేయలేదని, మటన్‌ తేలేదని వ్యక్తిగత పనులు చేయనందున రవీందర్‌ అనే సిబ్బందిని తొలగించడమే ఇందుకు నిదర్శనం. ఓ మహిళా ఉద్యోగిని నిధుల విషయంలో సదరు అధికారిణి నిలదీసినందుకు విధుల విషయంలో ఒత్తిడి తేవడం మానసిక వేధింపులకు గురి చేయడమే ఆ అధికారి వేధింపులకు నిదర్శనమని ఆ శాఖలోని కొందరు సిబ్బంది చెబుతున్నారు. ఇలా సదరు అధికారులు చెప్పిన పని వినకుంటే టార్గెట్‌ చేయడం, సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెట్టిస్తాడని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారిస్తాం

- నిఖిత, డీఎఫ్‌వో, కామారెడ్డి

అటవీశాఖలోని కొందరు అధికారుల వేధింపులపై కిందిస్థాయి సిబ్బంది ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారణ చేపడుతాం. రవీందర్‌ ఔట్‌ సోర్సింగ్‌ కింద శాఖలో వాచర్‌గా పని చేసేవాడు. ఆయన గడువు కాలం ముగియడంతో విధుల నుంచి తప్పుకున్నాడు. తర్వాత తాను శాఖలో పని చేస్తానంటూ ఒకసారి దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ దరఖాస్తును పరిశీలిస్తున్నాం. ఎఫ్‌డీవో, ఎఫ్‌ఆర్‌వోలపై నా దృష్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఎవరైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తాం.

Updated Date - 2021-12-07T05:06:08+05:30 IST