Abn logo
Aug 2 2021 @ 03:16AM

‘ఉక్కు’ ఉద్యోగులకు ఢిల్లీలో వేధింపులు

రైల్వేస్టేషన్‌ వద్దే అదుపులోకి.. 2 గంటల తర్వాత విడుదల 

హోటల్‌లో గదులు ఇవ్వొద్దని యజమానులపై ఒత్తిడి


 న్యూఢిల్లీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘చలో ఢిల్లీ’ ఆందోళన కోసం ఆదివారం ఢిల్లీ చేరుకున్న ఉద్యోగులను రైల్వేస్టేషన్‌ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఉద్యోగ జేఏసీ ప్రతినిధులను పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లో నిర్భందించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు 2, 3 తేదీల్లో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేసేందుకు అనుమతి పొందారు. అయినప్పటికీ.. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న  రైతుల ఆందోళనకు మద్దతివ్వడానికే వచ్చారన్న కారణంతో స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులను  పోలీసులు విచారణ పేరుతో వేధించారు. ఇక్కడ పరిస్థితులను జేఏసీ నేతలు సీఐటీయూ, ఏఐటీయూసీ జాతీయ నేతలకు ఫోన్లో వివరించారు. వారి జోక్యంతో పోలీసులు స్టీల్‌ ఉద్యోగులను విడుదల చేశారు. ఆతర్వాత హోటళ్లకు వెళ్లగా, అక్కడ నుంచి తమను ఖాళీ చేయించాలంటూ పోలీసులు ఒత్తిడి తెస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. హోటల్‌ యజమానులు ఉద్యోగులను హోటల్‌ నుంచి ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాస్‌ మాట్లాడుతూ తమ పోరాటాన్ని అణచివేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఎంత బెదిరించినా, తమ పోరును ఆపే ప్రసక్తే లేదన్నారు.