కిస్తీ కట్టాల్సిందే

ABN , First Publish Date - 2020-07-08T10:05:44+05:30 IST

కరోనా, లాక్‌డౌన్‌ తర్వాత ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. జిల్లాలో ఆటో, ట్యాక్సీ రవాణా ఇంకా కుదురుకోలేదు.

కిస్తీ కట్టాల్సిందే

ఫైనాన్స్‌ కంపెనీల వేధింపులు

కుదురుకోని ఆటో, ట్యాక్సీ రవాణా

ఆర్థిక ఇబ్బందుల్లో ఆటో యజమానులు

వాహనాలు జప్తు చేస్తున్న కంపెనీల నిర్వాహకులు

 

కరోనా పలురంగాలపై ఆధారపడిన వారి జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఆటో నడిపి దానిపై వచ్చే నగదుతో జీవనం సాగించే వారు కరోనా, లాక్‌డౌన్‌తో కడు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌తో రోడ్డెక్కని ఆటోలతో ఆదాయం పూర్తిగా కోల్పోయారు. ప్రస్తుతం సడలించినా కరోనా భయంతో ఆటో ఎక్కేవారు కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆటోల కిస్తీలు కట్టాల్సిందేనని ఫైనాన్స్‌ కంపెనీల నిర్వాహకులు ఆటో యజమానులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆదాయం లేక.. కుటుంబ జీవనమే కనాకష్టంగా ఉన్న పరిస్థితుల్లో కిస్తీలు ఎలా కట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, గుంటూరు): కరోనా, లాక్‌డౌన్‌ తర్వాత ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. జిల్లాలో ఆటో, ట్యాక్సీ రవాణా ఇంకా కుదురుకోలేదు.  ఆటోలు, ట్యాక్సీలు రోడ్లపైకి వస్తున్నా ఎక్కేవారు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆటో, ట్యాక్సీల నెలవారీ వాయిదాలు, త్రైమాసిక పన్నులు, ఇన్సూరెన్స్‌, అద్దెలు ఇలా రకరకాల చెల్లింపులు కట్టలేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాల ప్రకటనలతో మూడు నెలలపాటు ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనలు, ఆటో, కార్ల వాయిదాల చెల్లింపుల విషయంలో కొంత మిన్నకున్నారు. కానీ, ప్రసుతం వారంతా వాయిదాలు చెల్లించాల్సిందేనని పట్టుపడుతున్నారు. కొందరు ఒకడుగు ముందుకేసి వాహనాలను సీజ్‌ చేసేందుకు వెనుకాడటం లేదు.


జిల్లావ్యాప్తంగా దాదాపు 70వేలకు పైగా కుటుంబాలు ఆటోలే ఆధారంగా బతుకుతున్నాయి. గుంటూరులో 15 వేల మందికిపైనే ఆటోలపై ఆధారపడ్డారు. చాలామంది యువకులు గ్రామాల నుంచి జిల్లాలోని పట్టణాలకు వచ్చి ఆటోలను నడుపుతూ కుటుంబాలు పోషిస్తున్నారు. ఫైనాన్స్‌పై ఆటోలు కొనుగోలు చేసిన వారు కరోనా ఆంక్షలతో రోజు గడవడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో వాయిదాలు చెల్లించాల్సిందేనని ఫైనాన్స్‌ కంపెనీల నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నారు. రోజువారీగా అద్దెకు ఆటోలు తీసుకుని నడిపే డ్రైవర్లలో ఇప్పటికే చాలామంది సొంత ఉళ్లక వెళ్లగా మిగిలిన వారు కుటుంబ పోషణ చేసుకోలేక, కిస్తీలు కట్టలేక నానా ఇక్కట్లు పడుతున్నారు. 


బతుకులు తలకిందులు

కరోనాతో బతుకులు ఇక్కట్ల పాలయ్యాయి. కుటుంబాన్ని నడపలేక, ఇంటి అద్దెలు కట్టలేక నానాయాతన పడుతున్నాం. ఈ తరుణంలో ఫైనాన్స్‌ కంపెనీలు కిస్తీల కోసం వేధిస్తున్నాయి. బండిని సీజ్‌ చేస్తామంటున్నారు. బ్యాంకులు ఈఎంఐలు సర్దుబాటు చేసినట్లుగా తమకు అవకాశం కల్పిస్తే కొంత తేరుకుంటాం. ప్రభుత్వమే ఆదుకోవాలి. 

- ఎం జయరాజ్‌, గుంటూరు


ఆదాయం లేదు

కరోనా ఆంక్షలతో మునుపటిలాగా ప్రయాణికులను ఎక్కించుకోలేకపోతున్నాం. దీంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. మరో పక్క రోజురోజుకు ఆయిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి.  దీంతో బండి తిప్పడమే కష్టంగా ఉంది. కానీ ఫైనాన్స్‌ కంపెనీలు కిస్తీలు కట్టకపోతే బండి తీసుకుపోతామంటూ గంటకోసారి ఫోన్‌ చేసి వేధిస్తున్నారు. 

- పీ ప్రకాష్‌, గుంటూరు

Updated Date - 2020-07-08T10:05:44+05:30 IST