పెగాసస్‌ జాబితాలో హరగోపాల్‌

ABN , First Publish Date - 2021-07-23T07:39:15+05:30 IST

ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎ్‌సవో రూపొందించిన పెగాసస్‌ స్పైవేర్‌ బాధితుల్లో మరికొన్ని

పెగాసస్‌ జాబితాలో హరగోపాల్‌

  • ఎల్గార్‌ పరిషత్‌ నిందితులు..వారి న్యాయవాదులూ బాధితులే
  • అనిల్‌ అంబానీ, దేశాధ్యక్షులు, ప్రధానులూ 


న్యూఢిల్లీ, జూలై 22: ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎ్‌సవో రూపొందించిన పెగాసస్‌ స్పైవేర్‌ బాధితుల్లో మరికొన్ని పేర్లు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణకు చెందిన ప్రొఫెసర్‌ హరగోపాల్‌తోపాటు.. ఎల్గార్‌ పరిషత్‌ కేసులో నిందితులు, వారి కుటుంబ సభ్యులు, వారి తరఫున వాదిస్తున్న న్యాయవాదుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ, అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌ (ఏడీఏజీ) కీలక అధికారి పేరు కూడా లిస్టులో ఉండడం గమనార్హం.


‘పెగాసస్‌ ప్రాజెక్ట్‌’ పేరుతో పరిశోధన చేపట్టిన ‘ద వైర్‌’ సహా.. 16 సంస్థల అంచనా ప్రకారం ఇప్పటి వరకు 50 వేల మందికి పైగా పెగాసస్‌ బాధితులు ఉన్నారు. ఇప్పటికి 300 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. భీమా-కోరేగావ్‌ ఆందోళనకు సంబంధించి ఎన్‌ఐఏ నమోదు చేసిన ఎల్గార్‌ పరిషత్‌ కేసు నిందితుల్లో చాలా మంది పెగాసస్‌ బాధితుల జాబితాలో ఉన్నారు. వారిలో.. రోనా విల్సన్‌, వెర్నాన్‌ గోన్సాల్వే, ఆనంద్‌ తేల్‌టుంబ్డే, సోమాజేన్‌, గౌతమ్‌ నావ్‌లఖ ఉన్నారు. ఈ కేసు నిందితుల బంధుమిత్రులు, న్యాయవాదుల జాబితాలో వరవరరావు కుమార్తె పవన, సురేంద్ర గాడ్లింగ్‌ భార్య మినాల్‌ గాడ్లింగ్‌, ఆయన న్యాయవాదుల బృందంలోని నిశాల్‌సింగ్‌ రాథోడ్‌, జగదీశ్‌ మేశ్రామ్‌, మారుతి కుర్వాట్కర్‌, సుధా భరద్వాజ్‌ న్యాయవాదులు శాలిని గేరా, అంకిత్‌ గ్రేవాల్‌, ఆనంద్‌ తేల్‌టుంబ్డే మిత్రుడు జైసన్‌ కూపర్‌ ఉన్నారు. ఇతర హక్కుల కార్యకర్తల్లో ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌, ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబ సతీమణి వసంతకుమారి పేర్లు ఉన్నాయి.


కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అనుయాయులు అలంకార్‌ శ్వాసీ, సచిన్‌ రావు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, వీహెచ్‌పీ మాజీ చీఫ్‌ ప్రవీణ్‌ భాయ్‌ తొగాడియా, రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే వ్యక్తిగత కార్యదర్శి ప్రదీప్‌ అవస్థీ, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, మాజీ సీఎం కుమారస్వామి వ్యక్తిగత కార్యదర్శి సతీశ్‌, మాజీ సీఎం సిద్దరామయ్య వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్‌, మాజీ ప్రధాని దేవెగౌడ భద్రతా సిబ్బంది కూడా పెగాసస్‌ బాధితులు కావడం గమనార్హం.


ఏడీఏజీకి చెందిన ఓ కీలక అధికారి, రఫేల్‌ తయారీ సంస్థ దసో ఏవియేషన్‌కు భారత ప్రతినిధి పోసిన వెంకటరావు, బోయింగ్‌ ఇండియా అధినేత ప్రత్యూష్‌ కుమార్‌ తదితరుల ఫోన్లు కూడా పెగాసస్‌ టార్గెట్‌ అయ్యాయి. అయితే.. పారిశ్రామికవేత్తల ఫోన్లలోకి పెగాసస్‌ స్పైవేర్‌ చొరబడిందా? హ్యాకింగ్‌ ప్రయత్నాలే జరిగాయా? అనేది తేలాలంటే.. ఫోరెన్సిక్‌ పరీక్ష నిర్వహించాలని ‘ద వైర్‌’ వివరించింది.


అలాగే మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయెల్‌ ఒబ్రాడర్‌, ఫ్రాన్స్‌ ప్రధాని ఇమాన్యుయెల్‌ మాక్రోన్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఈజిప్ట్‌ ప్రధాని ముస్తఫా మాడ్బౌలీ, ఇరాక్‌ అధ్యక్షుడు బర్హామ్‌ సలీహ్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్‌ రామఫోస తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.


Updated Date - 2021-07-23T07:39:15+05:30 IST