భక్తి చేతనే హరి కృప

ABN , First Publish Date - 2020-07-09T08:42:51+05:30 IST

‘‘స్వామీ.. చతుర్విధ పురుషార్థాల్లో దేనియందూ నాకు కోరిక లేదు. సదా నీ పాదపద్మాలను ఆరాధించి, ఆనందంతో జీవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు’’ అని ఈ శ్లోక భావం. జీవన్మరణాత్మకమైన సంసారం

భక్తి చేతనే హరి కృప

  • ధర్మార్థ కామ మోక్షేషునేచ్చామమ కదాచన
  • త్వత్పాద పంకజాస్వాద జీవితం దీయతాంమమ

‘‘స్వామీ.. చతుర్విధ పురుషార్థాల్లో దేనియందూ నాకు కోరిక లేదు. సదా నీ పాదపద్మాలను ఆరాధించి, ఆనందంతో జీవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు’’ అని ఈ శ్లోక భావం. జీవన్మరణాత్మకమైన సంసారం నుంచి.. హరిదాస్యంతో సులభంగా విడివడవచ్చునని భాగవతం చెబుతోంది. భక్తి చేతనే హరి కృప లభిస్తుంది. నారాయణ మంత్రం భయంకరమైన సంసార విషాన్ని హరిస్తుందని నారసింహ పురాణ వచనం. అనన్య భక్తితో భగవంతుని భజించడమే భక్తి యోగం. మన మనసును భగవంతునియందు మేళవింపజేయడమే ప్రార్థన. పవిత్రమైన మనసుతో చేసే ప్రార్థనను దేవుడు అవశ్యం వింటాడు. హృదయంలో మోహం, క్రోధం, దౌష్ట్యాలనే తుఫానులు చెలరేగినప్పుడు ప్రార్థనతోనే ఉపశమనం కలుగుతుంది. ప్రార్థన హృదయ సంబంధమే కానీ దేహ సంబంధం కాదు. శారీరక వైకల్యాలతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రార్థించవచ్చు. ప్రార్థనచే జీవాత్మ పరమాత్మవైపు సాగుతుంది. అలాగని ఏ కర్మలూ చేయకుండా ప్రార్థన చేస్తే సరిపోతుందని కాదు.


‘దిల్‌ మే రామ్‌.. హాత్‌ మే కామ్‌’ అంటారు కబీరుదాసు. లోపల ఈశ్వర స్మరణ బయట స్వధర్మాచరణ ఉండాలి. మనం ప్రార్థించేటప్పుడు భగవంతుడు మన కర్మలను కూడా చూస్తాడు. మనం చేసే ప్రతి కర్మ... భక్తి-జ్ఞానయుక్తంగా ఉండడమే భగవత్పూజ. అదే నిజమైన దైవ పూజ. ‘‘మానవుని అంతరంగంలో ఉండే జ్యోతి జ్ఞానం. దానికి విరుద్ధమైన తమస్సు అజ్ఞానం. వెలుగే దైవం. అందుకే.. ‘‘తమసోమా జ్యోతిర్గమయ’’ అనగా చీకటి నుండి వెలుగులోనికి నన్నుగొని పొమ్ము’’ అనే ఉపనిషత్‌ వాక్యంతో దేవుని ప్రార్థించాలి.


  • దేహావసాన సమయే చిత్తేయద్యదే విభావయేత్‌
  • తత్త దేవ భవేజ్జీవ ఇత్యేవం జన్మకారణమ్‌

‘‘మరణ సమయంలో మనసు దేన్ని భావిస్తోందో అలాంటి జన్మనే జీవి పొందుచున్నాడు. జన్మ కారణమైన రహస్యమిదే’’ అని శ్రుతి వాక్యం. కాబట్టి, అంత్యకాలంలో జీవుని రక్షించేదేదో.. ముందుగానే ఆలోచించి, దాని విషయమై తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాపంచిక విద్యా వైదుష్యంగానీ, అధికారం, సౌందర్యం, కీర్తి ప్రతిష్ఠలు, సంపదలుగానీ.. యమ బాధ నుండి జీవుని తప్పించలేవు. గోవిందుడొక్కడే శరణ్యము. ఆ పరమాత్మను ఎంతగా భజిస్తే అంత శ్రేయస్సును పొందవచ్చు. కల్పవృక్షమే అయినా.. తనను సేవించిన వారికే ఫలాన్నిస్తుంది. ఫలం కలగకపోవడానికి భక్తి లోపమే కారణంగానీ.. ఈశ్వరుని పక్షపాత బుద్ధి కాదని భాగవత ధర్మం. అందుకే ప్రహ్లాదునిలా మనస్ఫూర్తిగా ప్రార్థించు, రాధలా భగవన్నామం గానం చెయ్యి, చైతన్య మహాప్రభువులా పారవశ్యంతో నాట్యం చెయ్యి, వాల్మీకి, తుకారాం, రామదా్‌సలా భగవన్నామం సదాస్మరించు అంటారు స్వామి శివానంద.


మేఘశ్యామ (ఈమని), 8332931376

Updated Date - 2020-07-09T08:42:51+05:30 IST