ఏవండోయ్‌ నానిగారూ.. త్రివిక్రమ్‌కు ట్విట్టర్‌ ఖాతా లేదండి!

సినిమా టిక్కెట్ల రేట్ల విషయంపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పేరుతో ఓ ట్వీట్‌ నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే! ‘‘చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒకటే టికెట్‌ రేటు అన్నట్లుగానే ప్రతి స్కూల్‌లోనూ ఒకటే ఫీజు, ప్రతి ఆసుపత్రిలోనూ ఒకటే బిల్లు ఎందుకు పెట్టరు? పేదవాడికి విద్యా, వైద్యం కంటే సినిమా ఎక్కువా? అన్నది ఆ ట్వీట్‌ ఉద్దేశం. అయితే ఆ ట్వీట్‌ చేసింది దర్శకుడు త్రివిక్రమ్‌ అని అభిప్రాయపడిన ఏపీ మంత్రి పేర్ని నాని శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆ ట్వీట్‌ గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా త్రివిక్రమ్‌ ట్వీట్‌ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ అంశం గురించి చిరంజీవితోపాటు ఎవరు మాట్లాడిని సీఎం దృష్టికి తీసుకెళ్లడమే నా పని. సినిమాటోగ్రఫీ శాఖ సీఎం చేతిలోనే ఉంది. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ గురించి సినీ ప్రముఖులతో సీఎం చర్చించమంటేనే మాట్లాడానని పేర్ని నాని తెలిపారు. 


త్రివిక్రమ్‌ ట్వీట్‌ విషయం గురించి ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ స్పందించింది. త్రివిక్రమ్‌కు ఎలాంటి సోషల్‌మీడియా ఖాతాలు లేవని.. ఆయనకు సంబంది?ంచిన స్టేట్‌మెంట్స్‌ అన్నీ తమ నిర్మాణ సంస్థ ఖాతా నుంచే వస్తాయని పేర్కొంది. ‘‘దర్శకుడు త్రివిక్రమ్‌కు సంబంధించిన ప్రకటనలన్నీ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌ ట్విటర్‌ ఖాతాల ద్వారానే బయటకు వస్తయి. ఎందుకంటే, ఆయనకు ఏ సోషల్‌మీడియా ఖాతాల్లేవు. ఆయన పేరు, ఫొటోలతో ఉన్న అకౌంట్స్‌ నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్‌ వచ్చినా దయచేసి నమ్మకండి’ అంటూ ఏపీ సీఎంవో, మంత్రి పేర్ని నాని ఖాతాలను నిర్మాణ సంస్థ ట్యాగ్‌ చేసింది. Advertisement