దుబ్బాకలోనే హరీశ్‌రావు మకాం

ABN , First Publish Date - 2020-09-19T10:09:01+05:30 IST

‘‘మీకు నేనున్నా. మీపై ఈగను కూడా వాలనివ్వను. ఇన్నాళ్లు జరిగిందేదో జరిగింది. ఇకపై అలాంటి పరిస్థితి రానివ్వనంటూ’’ రాష్ట్ర ఆర్థిక

దుబ్బాకలోనే హరీశ్‌రావు మకాం

అభివృద్ధి పనులపై దృష్టి ఫ అసంతృప్తులపై నజర్‌

నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు


దుబ్బాక, సెప్టెంబరు 18: ‘‘మీకు నేనున్నా. మీపై ఈగను కూడా వాలనివ్వను. ఇన్నాళ్లు జరిగిందేదో జరిగింది. ఇకపై అలాంటి పరిస్థితి రానివ్వనంటూ’’ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దుబ్బాకలో మకాం వేసి, అసంతృప్తులకు నచ్చజెప్పే కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రబుల్‌ షూటర్‌గా దుబ్బాకలో తన వ్యూహాలకు పదును పెట్టారు. దుబ్బాక ఉప ఎన్నికను తానే భుజాన వేసుకుని సాగుతున్నానని ఆయన కార్యకర్తల్లో జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ తానే అభ్యర్థిగా దుబ్బాకలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నియోజకవర్గంలోని 19 గ్రామపంచాయతీ భవనాలకు  పరిపాలన అనుమతులను తెచ్చారు. ప్రతీ గ్రామపంచాయతీ భవనాన్ని సుమారు రూ.20 లక్షలతో నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ప్రతీ గ్రామంలో వార్డుకు ఇద్దరు ఇన్‌చార్జులను ఏర్పాటు చేసి పార్టీ కార్యకలాపాలను ఉధృతం చేశారు. వార్డులోని ఇన్‌చార్జుల ద్వారా ప్రతి అంశంపై దృష్టి సారించి, ఆయా వార్డుల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను గమనిస్తున్నారు.


స్వయంగా రంగంలోకి దిగి, చక్కదిద్దే చర్యలు చేపడుతున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్నారు. అసమ్మత్తులు, పార్టీ పరిస్థితిలను తెలుసుకుని, చక్కదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని కిందిస్థాయి కార్యకర్త నుంచి, ఎన్నికల్లో ప్రభావితం చేయగల ప్రముఖులందరితో ఆయన చర్చిస్తూ, తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. దుబ్బాక మండలానికి చెందిన నాయకులను స్వయంగా తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లి, పార్టీ నష్టం జరగకుండా చూడాలని బుజ్జగించారు. నియోజకవర్గంలో విరివిగా పర్యటిస్తూ తనమీద భరోసా పెట్టండి, అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరుతున్నారు. మధ్యలోనే ఆగిన అభివృద్ధి పనులను త్వరితగతంగా పూర్తి చేయించేలా పురమాయిస్తూనే, ఆ అభివృద్ది ఫలాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా వ్యూహరచన చేస్తున్నారు. కొంతమంది నాయకులను రామాయంపేటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌కు పిలిచి సమావేశమయ్యారు. ఆయా గ్రామాల్లో పరిస్థితిపై వారితో చర్చించారు. 

Updated Date - 2020-09-19T10:09:01+05:30 IST