హరితహారం లక్ష్యాలను పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-07-21T05:50:27+05:30 IST

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిర్దేశించిన హరితహారం లక్ష్యాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

హరితహారం లక్ష్యాలను పూర్తిచేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌

సిరిసిల్ల, జూలై 20 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిర్దేశించిన హరితహారం  లక్ష్యాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. బుధవారం  కలెక్టరేట్‌లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారం లక్ష్యాలను వేగంగా పూర్తి చేయడానికి షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు అందజేయాలని అన్నారు. స్ర్టెచ్‌ల వారీగా లక్ష్యం, బాధ్యులకు ప్లాంటేషన్‌ను అప్పగించాలన్నారు. ఎవెన్యూ, బ్లాక్‌ పాంటేషన్‌ ట్రీ పార్కులపై దృష్టి పెట్టాలన్నారు. మున్సిపాలిటీల పరిధిలో నదుల బఫర్‌ జోన్‌లు, చెరువుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చి వేయాలన్నారు. భవిష్యత్‌లో అక్రమ కట్టడాలు జరగకుండా నిఘా పెట్టాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీఎస్‌బీపాస్‌లో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. మున్సిపాలిటీల్లో సీజన్‌ వ్యాధులు ప్రబలకుండా మంగళ, శుక్రవారాలతోపాటు బుధవారం   డ్రైడే నిర్వహించాలన్నారు. తాగునీటి ట్యాంక్‌లను క్లీన్‌ చేసి క్లోరినేషన్‌ చేయాలని, నీటిని పరీక్షించే శాంపిళ్ల సంఖ్యను పెంచాలన్నారు. నిరుపయోగంగా ప్రమాదకరంగా ఉన్న బావులను, బోరు బావులను పూడ్చివేయాలన్నారు. సిరసిల్ల మున్సిపల్‌ పరిధిలో ఉన్న శాంతినగర్‌, రగుడు, పెద్దూర్‌లోని డబుల్‌ బెడ్‌రూం పనులను పూర్తి చేయాలన్నారు. అర్భన్‌ పారెస్ట్‌  పార్క్‌, ఎస్‌టీపీ, బస్తీ దవాఖానా పనులు, వేములవాడలో సమీకృత మార్కెట్‌, డంపింగ్‌ యార్డుల పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అంతకుముందు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులతో జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, మరమ్మతుపై సమీక్షించారు. అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్లు సమ్మయ్య, శ్యాంసుందర్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-21T05:50:27+05:30 IST