ఏడో విడతకు రెడీ

ABN , First Publish Date - 2021-06-22T05:04:29+05:30 IST

జిల్లాలో ఏడో విడత హరితహారం కార్యక్రమ నిర్వహణకు

ఏడో విడతకు రెడీ
శంషాబాద్‌ మండల పరిధిలోని అటవీశాఖ నర్సరీలో సిద్ధంగా ఉన్న వివిధ రకాల మొక్కలు

  • జిల్లాలో 74.10 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం 
  • సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం 
  • ప్రతి మండలంలో పది ఎకరాల్లో పల్లె ప్రకృతి వనానికి నిర్ణయం
  • అన్ని రకాలకూ ప్రాధాన్యం, నీడనిచ్చేవే కాకుండా పూలు, ఫలాల ఇచ్చేవి కూడా
  • మొక్కల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
  • సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు బాధ్యతలు
  • ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ 


జిల్లాలో ఏడో విడత హరితహారం కార్యక్రమ నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అడపాదడప వర్షాలు పడుతుండటంతో మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 74.10 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతీ మండలంలో పది ఎకరాల విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఏడో విడత తెలంగాణకు హరితహారాన్ని పక్కా ప్రణాళికతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ శాఖలను భాగస్వాములను చేయనున్నారు. వాటి పరిరక్షణ బాధ్యతలను సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు అప్పగించనున్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ సారి ప్రతీ మండలంలో పది ఎకరాల విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో స్థలాలను గుర్తించే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. హరిత తెలంగాణ కోసం అడుగులు వేయాలని ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏడో విడత హరితహారంపై దశ దిశను నిర్ధేశించారు. జిల్లాలో 74.10 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఇందులో అత్యధికంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 30 లక్షలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. అలాగే జిల్లాలోని మున్సిపాలిటీలకు 23.50 లక్షల మొక్కలను, అటవీశాఖ పరిధిలో 7లక్షల మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. అలాగే మిగతా శాఖలకు కూడా మొక్కలను నాటేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లాలోని అటవీశాఖ పరిధిలోని నర్సరీలతోపాటు డీఆర్‌డీవో పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. మరో వారంరోజుల్లో ఏడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. 


ఇంటింటికీ ఆరు మొక్కలు

హరితహారంలో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్కలు అందించే విధంగా ప్రణాళికను రూపొందించారు. తులసి, జామ, కరివేపాకు, పూల మొక్కలను అందించనున్నారు. 


అన్ని మొక్కలకు ప్రాధాన్యం

హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్నిరకాల మొక్కలను నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీడనిచ్చే మొక్కలతో పాటు పూలూ, పండ్లనిచ్చేవి కూడా నాటనున్నారు. నీడనిచ్చే గుల్మార్‌, కానుగ, వేప, చైనా, బాధం, చింత మొక్కలు నాటనున్నారు. అలాగే పండ్ల మొక్కల్లో భాగంగా జామ, నిమ్మ, ఉసిరి, మామిడి మొక్కలతోపాటు గులాబీ, మందార, మల్లె తదితర మొక్కలను నాటనున్నారు. 


రోడ్డుకు ఇరువైపులా..

ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా అన్నిరకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలను నాటేందుకు జిల్లాయంత్రాంగం ముందుకు సాగుతున్నారు. రోడ్ల వెడల్పు పనులను దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటనున్నారు. గ్రామస్థాయిలో వార్డు సభ్యుల నుంచి సర్పంచ్‌ల వరకు, కౌన్సిలర్ల నుంచి చైర్మన్ల వరకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా బాధ్యతలను అప్పగించనున్నారు. 


మొక్కలు సిద్ధంగా ఉన్నాయి

రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్లో నర్సరీలున్నాయి. గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో 558 నర్సరీల్లో 68లక్షలు పెంచుతున్నారు. అందులో దాదాపు 54 లక్షలు మొక్కలు పెద్ద సైజులో ఉన్నాయి. ప్రతి నర్సరీలో 12వేల మొక్కల చొప్పు సిద్ధంగా ఉన్నాయి. పూలు, పండ్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. పండ్ల మొక్కల్లో దానిమ్మ, జామ, నేరేడు, ఉరిసి, ఖర్జూర, బొప్పాయ,  బాదం వంటి వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఇంటిలో పెంచుకునే విధంగా తులసి, కరివేపాకు వంటి మొక్కలను ఈసారి అందించనున్నాం.

- నీరజ, జిల్లా ఉపాధిహామీ అధికారి 

------------------------------------------

2021లో శాఖలు, మున్సిపాలిటీల వారీగా 

నిర్ధేశించిన లక్ష్యం ఇలా..


శాఖ    లక్ష్యం (లక్షల్లో)


ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ 7.00

విద్యాశాఖ 0.75

డీఆర్‌డీవో 30.00

పంచాయతీ 5.00

వ్యవసాయ 3.00

పరిశ్రమలు 0.10

ఎక్సైజ్‌శాఖ సరూర్‌నగర్‌ 0.50

ఎక్సైజ్‌శాఖ  శంషాబాద్‌ 0.50

వైద్య ఆరోగ్య 0.10

పరిశ్రమలు 2.00

ఉద్యాన 1.00

దేవదాయ 0.10

సాంఘిక సంక్షేమ 0.10

గిరిజనశాఖ 0.50

మైన్స్‌ 0.25

మార్కెటింగ్‌ 0.10

పౌరసరఫరాలు 0.05

మున్సిపాలిటీలు

షాద్‌నగర్‌ 1.00

పెద్దఅంబర్‌పేట్‌ 1.00

బడంగ్‌పేట్‌ 2.00

మీర్‌పేట్‌ 2.00

ఇబ్రహీంపట్నం 1.00

జల్‌పల్లి 1.00

శంకర్‌పల్లి 1.00

ఆదిభట్ల 2.00

తుక్కుగూడ 1.50

ఆమనగల్లు 2.00

నార్సింగి 1.00

మణికొండ 1.50

శంషాబాద్‌ 1.50

తుర్కయాంజల్‌ 1.50

బండ్లగూడ జాగీర్‌ 2.50

---------------------------------


Updated Date - 2021-06-22T05:04:29+05:30 IST