Abn logo
Sep 8 2020 @ 12:33PM

హార్మోన్ల సమతౌల్యానికి...

ఆంధ్రజ్యోతి(08-09-2020)

మాటల్లో వ్యక్తం చేయలేని నిస్సత్తువ, అదుపు తప్పే భావోద్వేగాలు, కండరాల నొప్పులు... ఇలా శారీరక, మానసిక ఒడిదుడుకులకు లోనవడం మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల్లో కనిపించే సాధారణ లక్షణాలు. వీటిని సకాలంలో గుర్తించి, సత్వరం సరిదిద్దుకుంటే జీవితం తిరిగి గాడిలో పడుతుంది.


ఆయుర్వేద చికిత్సల ద్వారా శరీరంలో చోటుచేసుకున్న హార్మోన్‌ హెచ్చుతగ్గులను సమం చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే... 


త్రిఫల: నిస్సత్తువ, బడలిక, అజీర్తి, ఆకలి మంగించడం లాంటి ఇబ్బందులు జీర్ణవ్యవస్థ నీరుకారడానికి సూచనలు. ఈ సమస్య ఉన్నప్పుడు జీర్ణాగ్నిని వృద్ధి చేసే చికిత్సలు పాటించాలి. ఇందుకోసం త్రిఫల చూర్ణం తీసుకుంటే అజీర్తి కారణంగా శరీరంలో పేరుకుపోయిన మలినాలు, విసర్జకాలు విసర్జింపబడి శరీరం పునరుత్తేజం పొందుతుంది. ఈ చూర్ణాన్ని రోజూ రాత్రి నిద్రకు ముందు తీసుకుంటే భావోద్వేగాల్లో మార్పులు, మానసిక కుంగుబాటు మొదలైన మానసిక సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి.


అశ్వగంధ: వయసు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు తలెత్తే పరిస్థితి కార్టిసాల్‌ అనే హార్మోన్‌ అధిక ఉత్పత్తితో వస్తుంది. అశ్వగంధ వాడితే పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాలకు రక్తప్రసరణ మెరుగుపడి తద్వారా కార్టిసాల్‌ హార్మోన్‌ స్రావం అదుపులోకి వస్తుంది. మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలకు కూడా ఈ మూలిక మేలు చేస్తుంది. 


కటుంబ బెరడు: ఈ మొక్క బెరడులో యోహింబైన్‌ అనే ఉత్ర్పేరకం ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను చైతన్యపరిచడం ద్వారా భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. ఆయుర్వేదంలో ఈ మూలికతో హార్మోన్ల అవతవకలను వైద్యులు విస్తృతంగా సరిదిద్దుతున్నారు.


ఓట్లు కాండం: ఓట్లు కాండం నుంచి సేకరించిన సారం అవీనా సెటైవా. నెలసరి నొప్పులు తగ్గించే గుణం దీనికి ఉంది. మహిళల్లో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ పరిమాణాన్ని సమంగా ఉంచుతూ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.


మాక: ఇది పెరూలో దొరికే వేరు. పెరూవియన్‌ జిన్‌సెంగ్‌ అనే పేరున్న మాక నిద్ర, పునరుత్పత్తి, వంధత్వం మొదలైన సమస్యలకు చక్కని విరుగుడు. జింక్‌తోపాటు ఫైటోన్యూట్రియంట్స్‌ పుష్కలంగా ఉండే ఈ వేరు మెనోపాజ్‌ లక్షణాలను తొలగిస్తుంది. 


సిలాజిత్‌: మహిళల శారీరక శక్తికి తోడ్పడే ఔషధం ఇది. ఇందులో అమీనో యాసిడ్లు, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆందోళన తగ్గించి, మనసును తేలికపరిచే శక్తి ఇందులో ఉంది. 


సుమ: పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంచి, మనసుకు సాంత్వన చేకూర్చే ఈ మందును పలు రకాల ఆయుర్వేద చికిత్సలో విరివిగా వాడతారు.


ముయిరా పోమ: ఒత్తిడిని తగ్గించి, నాడులను నెమ్మదింపచేస్తుంది. కటి ప్రదేశంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా మహిళల్లో పునరుత్పత్తి సమస్యలు తొలగిపోతాయి.


ట్రిబ్యులస్‌ టెరెస్ర్టిస్‌: శరీరం హార్మోన్లను సమర్థంగా ఉపయోగించుకునే సామర్ధ్యాన్ని పెంచడంలో ఈ ఔషధం మెరుగైనది.  


టొంగట్‌ అలి: ఈ మూలికను ఒత్తిడి తొలగి, ఆలోచనల్లో స్పష్టత రావడానికి ఉపయోగించవచ్చు. హార్మోన్లలో హెచ్చుతగ్గులను సమం చేసి జీవన నాణ్యత మెరుగుపరచడంలో ఈ మూలిక సమర్థమైనది.


ప్రత్యేకంమరిన్ని...